అక్కడ ప్రైవేట్‌ స్కూల్‌కి వెళ్తే...రూ.1000 జరిమానా

ABN , First Publish Date - 2022-07-03T18:11:36+05:30 IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో (మహారాష్ట్ర సరిహద్దులో) ఉంది ముఖరా (కె) గ్రామం. ఉదయమే పంచాయితీ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఉప సర్పంచ్‌తో

అక్కడ ప్రైవేట్‌ స్కూల్‌కి వెళ్తే...రూ.1000 జరిమానా

ఎలాంటి మొహమాటాలు లేకుండా, ఊరంతా ఒకే మాటగా తీసుకున్న ఒక నిర్ణయం ఆ ఊరు ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ఊరు ఊరంతా ఒక్క తాటిపై నిలిచింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే తల్లి దండ్రుల నిర్ణయంతో ఆదిలాబాద్‌ జిల్లాలోని ముఖరా.కె. గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది. 


తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో (మహారాష్ట్ర సరిహద్దులో) ఉంది ముఖరా (కె) గ్రామం. ఉదయమే పంచాయితీ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఉప సర్పంచ్‌తో కలిసి గ్రామస్థులను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఇంటి ముందు ఆగి ఆడవారికి బొట్టుపెట్టి, పిల్లలకు కొత్త దుస్తులు, స్కూల్‌ బ్యాగ్‌, పుస్తకాలు ఇచ్చి ‘‘మీ బిడ్డలను మన ప్రభుత్వ బడిలోనే చదివించాలి. అన్ని వసతులు ఉన్నాయి. ప్రైవేట్‌ కాన్వెంట్‌ల వైపు పంపవద్దు. ఇదంతా గ్రామసభలో తీసుకున్న నిర్ణయం’’ అని సున్నితంగా నచ్చ చెబుతున్నారు. అలా కాదని ప్రైవేట్‌ స్కూల్‌కి పంపితే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని సుతిమెత్తగా హెచ్చరిస్తూ ఊర్లోని గడప గడపకు తిరుగుతున్నారు.


‘‘మా గ్రామంలో విశాలమైన ప్రభుత్వ పాఠశాల ఉంది. 2016లో ఇక్కడ విద్యార్థుల సంఖ్య కేవలం 20 మాత్రమే. విద్యార్థులంతా ప్రైవేట్‌స్కూల్స్‌కి వెళ్లేవారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులమంతా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడి విద్యార్థులందరూ ప్రభుత్వ బడిలోనే చదవాలి. కాదని ప్రైవేట్‌ స్కూల్‌కి పంపితే రూ.1000 జరిమానా అని తీర్మానం చేశాం. ప్రతీ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి వారి పిల్లలను బడిలో చేర్పించాం.’’ అని గ్రామ ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌ అన్నారు. అయితే వీరు కేవలం జరిమానాలతో ఆగలేదు. శిఽథిలావస్థలో ఉన్న పాత పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సర్వశిక్ష అభియాన్‌ నిధులు సాధించి రూ.26 లక్షలతో వసతులు కల్పించారు.


సకల వసతులతో...

ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఆధునిక వంటశాలను, ఆటస్థలాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు విద్య మీద దృష్టిపెట్టారు. ఇంగ్లీషు మీడియంలో పాఠాల కోసం ప్రత్యేకంగా ముగ్గురు టీచర్లను నియమించు కొని గ్రామపంచాయితీ నిధుల నుండి జీతాలు ఇస్తున్నారు. ఇలా ఊరి మధ్యనే ఇంటికి సమీపంలో చిన్నారులకు మెరుగైన విద్య అందుబాటులోకి తెచ్చారు. ‘‘ప్రభుత్వ బడిలో టీచర్ల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వ్యయం చేస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజలకు అందుబాటులో బడి ఉండాలనే ఆలోచనతో తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నాం. ప్రైవేట్‌ స్కూల్‌కి ధీటుగా సకల వసతులతో ప్రభుత్వ బడిని తీర్చిదిద్దాం. ఇప్పుడు పిల్లల చదువుల్లో కూడా మార్పు వచ్చిందని తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు’’ అన్నారు సర్పంచ్‌ మీనాక్షి.

పచ్చటి ప్రకృతి నడుమ ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. ఈ బడిలోకి అడుగుపెట్టగానే పరిసరాలు ఆహ్లాదంగా, కావాల్సినంత ఆక్సిజన్‌ను అందిస్తుంది. రంగులతో పాఠశాలను పిల్లలకు నచ్చేలా డిజైన్‌ చేశారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా తయారుచేశారు. ‘‘ఒకప్పుడు ఈ స్కూల్‌ బిల్డింగ్‌ బాగా లేకుండె. దాంతో అందరూ ప్రైవేట్‌ స్కూల్స్‌కి వెళ్లేవారు. మా గ్రామ సర్పంచ్‌, ప్రజల భాగస్వామ్యంతో ఈ బడిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మా శ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉంది’’ అంటారు హెడ్మాస్టర్‌ సురేఖ. పీజీ చేసినా ఉద్యోగం లేక వ్యవసాయ పనులు చేసుకుంటున్న నిరుద్యోగి ప్రమోద్‌తో పాటు మరో ఇద్దరికి ఇక్కడ విద్యా వాలంటీర్లుగా ఉపాధి లభించింది.


జాతీయ స్థాయికి...

విద్యావికాసమే కాక, స్వచ్ఛ పల్లెగా తీర్చిదిద్దడానికి ముఖరా (కె) గ్రామస్థులు ఐకమత్యంగా కృషి చేస్తున్నారు. గ్రామంలో 300 గడపలు, 700 మంది జనాభా ఉంది. గ్రామంలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత కనిపిస్తాయి. తడిచెత్త, పొడి చెత్త ేసకరణ ద్వారా ేసంద్రియ ఎరువు తయారీ యూనిట్‌ పెట్టారు. ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొంది, జాతీయస్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీ ఇదే.

ప్రభుత్వ పథకాలను వంద శాతం ఉపయోగించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి ప్రకృతి వనంలో నర్సరీ, ేసంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, మియావాకీ విధానంలో దట్టమైన అడవిని సృష్టించారు.  ముఖరా గ్రామస్థుల్లాగా అందరూ ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలే కాదు... పల్లె ముఖ చిత్రాలు కూడా అనూహ్యంగా మారిపోతాయనడంలో సందేహం లేదు. 

- శ్యాంమోహన్‌, 94405 95858

Updated Date - 2022-07-03T18:11:36+05:30 IST