నీది తెలంగాణ రక్తమే అయితే.. మోదీ సర్కారును పడగొట్టు!

ABN , First Publish Date - 2022-07-03T08:45:56+05:30 IST

కేసీఆర్‌.. నీకు దమ్ముంటే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టు.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రికి సవాలు విసిరారు.

నీది తెలంగాణ రక్తమే అయితే.. మోదీ సర్కారును పడగొట్టు!

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాలు
  • నీది గింత పార్టీ.. ఉఫ్‌ అంటే కొట్టుకుపోతవ్‌
  • నీ సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చు
  • సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సంజయ్‌
  • ప్రధాని మోదీ పట్ల గౌరవప్రదమైన 
  • భాష వాడాలని కేసీఆర్‌కు హితవు


హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌.. నీకు దమ్ముంటే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టు.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. కేసీఆర్‌ పాలనలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల విచ్చలవిడితనం పెరిగిపోయిందని.. శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనపై, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా శనివారం హెచ్‌ఐసీసీ మీడియా పాయింట్‌ వద్ద సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లుగా మొరుగుతున్నడు. మోదీ ప్రభుత్వాన్ని పడగొడతడట. కేసీఆర్‌.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, తెలంగాణ కారమే తింటే.. దమ్ముంటే.. మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించు. నీది గింత పార్టీ. ఉఫ్‌ అని ఊదితే కొట్టుకుపోతవ్‌. నీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చేజారొచ్చు. ఉఫ్‌ మంటే ఊడిపోయే ప్రభుత్వం నీది’’ అని వ్యాఖ్యానిం చారు. టీఆర్‌ఎస్‌ సర్కారే ఎప్పుడైనా పడిపోవచ్చని జోస్యం చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, ల్యాండ్‌, శ్యాండ్‌, డ్రగ్స్‌ మాఫియాకు తెలంగాణ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థనే కేసీఆర్‌ కించపరుస్తున్నారని విమర్శించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజలేమైనా ఓట్లేస్తారా? అవేమైనా సర్పంచ్‌, మునిసిపల్‌ ఎన్నికలా? ర్యాలీలు తీస్తూ.. ఫ్లెక్సీలు కడుతూ రాష్ట్రపతి ఎన్నికల స్థాయిని దిగజారుస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతమైన పదవిలో ఉంటూ నిస్సిగ్గుగా, సంస్కారహీనుడిగా మాట్లాడుతున్న కేసీఆర్‌ను చూసి ప్రజలు ‘ఛీ.. థూ..’ అని ఈసడించుకుంటున్నారని అన్నారు.


 మోదీ పాలనలో ఇండియాలో విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతున్నాయా? సిగ్గుండాలే.. తెలంగాణలోనే మైనర్‌ బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతున్నాయి. నీ విచ్చలవిడితనంతోనే తెలంగాణలో శాంతిభద్రతలు స్తంభించినయ్‌. మొన్నటికి మొన్న డ్రగ్స్‌ దందా తెరపైకి వచ్చింది. ఎందుకు స్పందించడం లేదు? ఆ కేసులో నీ చుట్టాలేమైనా ఉన్నారా? గతంలో దేశంలో బాంబు బ్లాస్ట్‌లు జరిగేవి. బీజేపీ హయాంలో జరుగుతున్నాయా?’’ అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రాలేదని సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘‘పంజాబ్‌కు పోయి అక్కడి రైతులకు డబ్బులిచ్చినవ్‌. నిన్ను గెలిపించిన ఇక్కడి రైతులకు ఎందుకు సాయం చేయడం లేదు? వాళ్లు చేసిన పాపమేంది?  అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నువ్వు చేసిందేంటి? నీ కుటుంబమే రాజ్యమెందుకు ఏలుతోంది? నువ్వే సీఎం ఎందుకు కావాలి? నీ కొడుకు, అల్లుడు మంత్రులెందుకు కావాలి? నీ బిడ్డ ఎమ్మెల్సీ ఎందుకు కావాలి? సడ్డకుడి కొడుకు ఎంపీ ఎందుకు కావాలి? తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోవడం లేదు? అందుకే.. ఇక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌ ముక్త్‌ తెలంగాణ కోరుకుంటున్నరు’’ అని అన్నారు.


నిన్ను దింపే రోజులు దగ్గరకొచ్చినయ్‌..

‘‘బీజేపీ అవినీతి చిట్టా బయటపెడతానన్నవ్‌. ఏది..? ఎందుకు బయటపెట్టడం లేదు? నీ తాటాకు చప్పుళ్ల్లకు భయపడేది లేదు. నీకు పాలన చేతగాకపోతే దిగిపో. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి చిప్ప చేతికిచ్చినవ్‌. కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీలంకలాగా తయారు చేసినవ్‌. నీకు దిగిపోవాల్సిన రోజులు దగ్గరకొచ్చినయ్‌’’ అని సంజయ్‌ ధ్వజమెత్తారు.   దేశ ప్రధాని పట్ల గౌరవప్రదమైన భాష వాడాలని హితవు పలికారు.  బహిరంగ సభను విజయవంతం చేయాలని, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. 


వచ్చే ఎన్నికల్లో నిజాం పాలన అంతం 

హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తూ సంజయ్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశాలతో తెలంగాణ అంతటా ఉత్సాహకరమైన వాతావరణం నెలకొందని, పార్టీ మరింత వృద్ధి సాధిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాం, అతని రజాకారుల పాలన అంతం కానుందని అన్నారు. 2006లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ మద్దతు ప్రకటించిందని.. తెలంగాణ ప్రజలు చిన్నమ్మగా పిలిచే దివంగత నేత సుష్మాస్వరాజ్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు. ఇంత కష్టపడి సాధించిన తెలంగాణలో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ మూడోసారి స్వాతంత్ర్యాన్ని కోరుకుంటోందని, ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2022-07-03T08:45:56+05:30 IST