నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!

ABN , First Publish Date - 2022-08-08T05:35:09+05:30 IST

నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!

నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!
మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కణజాల ఇన్‌ఫెక్షన్‌ బాధితులు

పెరుగుతున్న ‘కణజాల ఇన్‌ఫెక్షన్‌’

నిమిషాల్లోనే కాళ్లకు బొబ్బలు, నల్లగా మారడం

పట్టించుకోని వైద్యాధికారులు

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు

ఆందోళన చెందుతున్న ప్రజలు 

ఇప్పటి వరకు 30 మంది వరకు బాధితులు


మహబూబాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : కాళ్లకు దురదపెట్టడం.. గోక డం.. నిమిషాల వ్యవధిలోనే బొబ్బలు ఏర్పడటం, కాలు ఎర్రబారడం జరుగుతోంది. చికిత్సలో ఆలస్యం జరిగితే ఎర్రబారిన ప్రాంతం నల్లగా మారి, శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సివస్తోంది. 


మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగేళ్ల క్రితం కేసముద్రం మండలం కల్వలలో వెలుగు చూసిన కణజాల ఇన్‌ఫెక్షన్‌ (సెల్యులైటీస్‌) వ్యాధి ఇప్పుడు ఆ గ్రామంతో పాటు ఇతర మండలాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. జిల్లా కేం ద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారం రోజులుగా రోజుకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున ఇదే సమస్యతో వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. తొలిదశలో వచ్చిన వారికి మందులతో నయం అవుతోండగా, కాలి కండరాలు నల్లగా మారిన వారికి శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తున్నారు. 


వైద్యసేవల్లో జిల్లాకు పెద్దదిక్కు అయిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఈ సమస్యతో వెళితే బాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తు న్నాయి. కేవలం ప్రైవేటు ఆస్పత్రిలోనే ఈ వ్యాధికి శస్త్రచికిత్సలు జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. జిల్లా సర్కారు ఆస్పత్రిలో కణజాల ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన శస్త్రచికిత్స చేయకపోగా, జిల్లాలో అసలు ఇలాం టి వ్యాధేలేదని వైద్యాధికారులు వెల్లడించడం గమనార్హం. ఈ సమస్యతో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన వారు 30 మంది వరకు బాధితులుండగా వీరిలో ఆరుగురు కేసముద్రం మండలం కల్వల గ్రామం నుంచే ఉన్నట్లు సమాచారం. 


బాధితుల బాధలు ఇలా..

గ్రామాల్లో సర్వే నిర్వహించి, కణజాల ఇన్‌ఫెక్షన్‌ బాధితులకు అవగాహన కల్పించి, వారికి ధైర్యం చెప్పేవారే లేరు. జిల్లా సర్కారు ఆస్పత్రికి వెళితే వైద్యచికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోండటంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వేల రూపాయలు ఖర్చుచేసి, వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 


మహబూబాబాద్‌ మండలం శనిగపురం శివారు ముత్యాలమ్మతండాకు చెందిన వాంకుడోత్‌ సేవ్రీ ఈనెల 3న జిల్లా ఆస్పత్రికి జ్వరంతో వచ్చి చేరింది. సాధారణ వార్డులో ఇన్‌పేషెంట్‌గా రెండు రోజులు జ్వరానికి సంబంధించిన చికిత్స చేశారు. అనంతరం ఆమె కాలు ఎర్రగా కందిపోయి బొబ్బలు వచ్చి, ఆ తర్వాత నల్లగా మారిపోవడంతో తీవ్ర ఆందోళన చెందింది. ఆమెను సర్జికల్‌ వార్డుకు మార్చి సాధారణ చికిత్స చేశారు. ఆపై ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నట్లు బాధితురాలు తెలిపారు.


మహబూబాబాద్‌ మండలం ఈదులపూసపల్లి శివారు సీత్లాతండాకు చెందిన బాదావత్‌ భద్రుకు అకస్మాత్తుగా కాళ్లపై పుండులాగా ఏర్పడి జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేలోపు ఎర్రగా మారింది. ప్రైవేటుకి వెళ్లగా ఆయన కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ అయిన ప్రాంతంలో శస్త్ర చికిత్స చేశారు. కేసముద్రం మండలం కొత్తూరు శివారు భద్రుతండాకు చెందిన బానోతు భద్రునాయక్‌ కాలువాపు, బొబ్బలు ఏర్పడి ఆస్పత్రికి రావడంతో శస్త్రచికిత్స చేశారు. ఇదే మండలం తాళ్లపూసపల్లికి చెందిన రామగిరి పుష్ప వరినాట్లు వేసేందుకు వెళ్లగా కాలికి దురద ఏర్పడి, గోకడంతో కాలు వాపు వచ్చింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు శస్త్రచికిత్స చేశారు.


సర్కారు ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిల్‌..

కణజాల ఇన్‌ఫెక్షన్‌ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లితే సరైన వైద్యం అందకపోవడంతో ఈ బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి గత వారం నుంచి రోజుకు మూడు, నాలుగు ఇలాంటి కేసులే వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటింటా సర్వే నిర్వహించి, అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తే జిల్లా వ్యాప్తంగా చాలా కేసులు బయటపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇటీవలె ఓ గ్రామంలో తూతూ మంత్రపు సర్వే నిర్వహించి ఎవరికీ ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని జిల్లా వైద్యాధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో ఒకవైపు బాధితులు కనిపిస్తున్నప్పటికీ ఇలాంటి బాధితులు ఎవరూ లేరని వైద్యాధికారులు వెల్లడించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


వరంగల్‌లోని ఎంజీఎం తరహాలో జిల్లా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నప్పటికీ ఈ తరహా కేసులకు చికిత్స చేయకపోవడం గమనార్హం. ఇలాంటి బాధితులు మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి వచ్చినప్పటికీ వారికి చికిత్స చేయడంలో జాప్యం, నిర్లక్ష్యం వహించడంతో వారు వెంటనే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కణజాల ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి జిల్లా ఆస్పత్రిలో ఒక్క శస్త్రచికిత్స చేయకపోవడం గమనించదగ్గ విషయం. కూలీనాలీ చేసుకునే పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్సకోసం వేలకువేలు ఖర్చు చేసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా వ్యాప్తంగా ఈ తరహా బాధితులపై సర్వే నిర్వహించి, జిల్లా ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు, వైద్యం అందించాలని, వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాందోళలను తొలగించాలని పలువురు కోరుతున్నారు. 


జిల్లా ఆస్పత్రిలో పట్టించుకోలేదు : వాంకుడోత్‌ సేవ్రీ, బాధితురాలు, ముత్యాలమ్మతండా 

సర్కారు దవఖానా కు వెళితే జ్వరానికి ఇం జెక్షన్‌ ఇచ్చారు. కానీ, కాలుకు ఉన్న సమస్య కు ఎలాంటి చికిత్స చే యలేదు. తన కాలి స మస్యపై వైద్యులు, సిబ్బంది ఎలాంటి స మాధానం చెప్పలేదు. దీంతో ఇక్కడ నాకు చికిత్స లభించదని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాను.


త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి : డాక్టర్‌ నన్నపనేని అంజన్‌కుమార్‌, జనరల్‌ సర్జన్‌, మహబూబాబాద్‌ 

 కణజాల ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన వారు లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వచ్చిచికిత్స చేయించుకుంటే సులభంగా మందులతోనే నయం చేసుకోవచ్చు. ఆలస్యం చేస్తే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి కాలు తొలగించాల్సివస్తుందని, కొన్ని సందర్భాల్లో ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. స్టెఫెల్లోఫోకస్‌, నియోమోఫోకస్‌ బ్యాక్టీరియాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. మధుమేహం, డయాలసిస్‌ పేషెంట్లు, వృద్ధులకు వస్తే తొందరగా వృద్ధి చెందుతుంది. 

Updated Date - 2022-08-08T05:35:09+05:30 IST