ఇష్టమైతే కొను.. లేదంటే పో..!

ABN , First Publish Date - 2022-09-18T05:22:42+05:30 IST

పట్టణంలో కాంట్రాక్టరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్‌ పాయింట్‌లో శనివారం ఒక్కసారిగా రేట్లను పెంచేశారు.

ఇష్టమైతే కొను.. లేదంటే పో..!
లోడింగ్‌కు పెట్టకుండా నిలిపివేసిన ట్రాక్టర్లు

ఇసుక ధరలను భారీగా పెంచిన కాంట్రాక్టర్‌

నాలుగు రోజులకే టన్నుపై రూ.265 పెంపు

కొనుగోళ్లను ఆపేసిన వాహనదారులు

తాళం వేసుకున్న స్టాక్‌ పాయింట్‌ నిర్వాహకులు


గుంతకల్లు, సెప్టెంబరు 17: పట్టణంలో కాంట్రాక్టరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్‌ పాయింట్‌లో శనివారం ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. టన్ను ధరను రూ.785 నుంచి రూ.1,050కి పెంచారు. ‘ఇష్టమైతే కొనండి.. కష్టమైతే వెళ్లిపోండి..’ అని స్టాక్‌ పాయింట్‌ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దీంతో ఇసుక కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రేట్లను పెంచితే ఎలా అని టిప్పర్‌, ట్రాక్టర్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత రేట్ల ప్రకారమైతేనే కొంటామని వాహనాలను నిలిపివేశారు. దీంతో స్టాక్‌ పాయింగ్‌ నిర్వాహకులు కార్యాలయానికి తాళం వేసుకున్నారు. 


చెప్పాపెట్టకుండా..

గుంతకల్లు మార్కెట్‌ యార్డులోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి హౌసింగ్‌ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ఇసుక సరఫరా అయ్యేది. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, పత్తికొండ, మద్దికెర, వజ్రకరూరు, విడపనకల్లు తదితర ప్రాంతాలకు ఆలూరు కోన నుంచి ఇసుకను కొని తెచ్చుకునేవారు. ఇసుక అమ్మకం బాధ్యతలను ప్రభుత్వం థర్డ్‌పార్టీ కాంట్రాక్టరుకు అప్పగించింది. దీంతో స్టాక్‌ పాయింట్‌లో గత సోమవారం నుంచి నేరుగా ఇసుక అమ్మకాలను ప్రారంభించారు. టన్ను రూ.785 ప్రకారం ట్రాక్టర్లు, టిప్పర్ల నిర్వాహకులకు అమ్మారు. గత వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఇసుకను అమ్మారు. రెండు రోజులుగా అమ్మకాలను నిలిపేసి, శనివారం పునఃప్రారంభించారు. కానీ ఒక్కసారిగా టన్నుపై రూ.265 ధర పెంచి.. రూ.1,050కి చేర్చారు. దీంతో వాహనదారులు అభ్యంతరం తెలిపారు. ఇసుక వినియోగదారులకు ఇదివరకేఒక ధర చెప్పామని, ఉన్నట్లుండి ధర పెంచితే ఎలా అమ్ముకోవాలని ప్రశ్నించారు. దీనికి స్టాక్‌పాయింట్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ‘ఆ సంగతి మాకు తెలియదు. పాత రేటు ప్రకారం గిట్టుబాటు కాదు. అందుకే రేటు పెంచాము. ఇష్టమైతే కొనండి. కష్టమైతే వెళ్లిపోండి..’ అని తెగేసి చెప్పారు. దీంతో స్టాక్‌పాయింట్‌ నిర్వాహకులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. వివాదం ముదురుతుండటంతో స్టాక్‌ పాయింట్‌ సిబ్బంది తమ ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. 


34 శాతం ధర పెంపు

మూడు రోజుల క్రితం వరకూ స్టాక్‌ పాయింట్‌లో టన్ను రూ.785 ప్రకారం ట్రాక్టరుకు 5 టన్నులకు రూ.3,925 తీసుకునేవారు. 6 చక్రాల టిప్పరుకు 10 టన్నులకు 7,850, 10 చక్రాల టిప్పరుకు 18 టన్నులకు రూ.14,130, 12 చక్రాల టిప్పరుకు 24 టన్నులకు రూ.18,840 తీసుకునేవారు. ఇప్పుడు ట్రాక్టరుకు రూ.5,250, సిక్స్‌ వీలరు టిప్పరుకు రూ.10,500, టెన వీలర్‌కు రూ. 18,900, 12 చక్రాల టిప్పరుకు రూ.25,200 చెల్లించాల్సి వస్తోంది. పాత ధరలపై దాదాపు 34 శాతం పెంచారు. పాత రేట్లను అనుసరించి ట్రాక్టరు ఇసుకను రూ.7,000, టెన వీలర్‌ టిప్పర్‌ ఇసుకను రూ.24 వేలు లేదా రూ.25 వేలకు వాహనదారులు అమ్మేవారు. పెరిగిన ధరలను అనుసరించి ట్రాక్టరు ఇసుకను దాదాపు రూ.9,300, టిప్పరు ఇసుకను రూ.30 వేల పైచిలుకు ధరకు అమ్మాల్సి వస్తుంది. 


ఇప్పుడెలా..?

మూడు రోజుల క్రితం ధరల ఆధారంగా ఇసుకను అమ్మడానికి వాహనదారులు తమ ధరను నిర్ణయించుకున్నారు. అనూహ్యంగా భారీగా ధర పెంచడంతో ఇసుకను ఎలా అమ్ముకోవాలని ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఇసుకను కొనేది లేదని ట్రాక్టర్లను, టిప్పర్లను నిలిపివేశారు. ‘మీరు కొనకపోతే మాకొచ్చిన నష్టం ఏమీ లేదు..’ అని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తమ వాహనాల కంటే బయటి నుంచి టిప్పర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని స్థానిక వాహనదారులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించేందుకు, స్థానికులు కొనలేనంతగా ధరలను పెంచేశారని ఆరోపించారు. కాగా ఇసుక ధరలను పెంచుకోవడానికి గనుల శాఖ అధికారులు ప్రత్యేక అనుమతి ఇచ్చారని స్టాక్‌పాయింట్‌ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-09-18T05:22:42+05:30 IST