దుబ్బాక దుర్భిణిలో చూస్తే, గోల్కొండే!

ABN , First Publish Date - 2020-11-12T06:19:03+05:30 IST

విజయాన్ని దగ్గరిదారిలో అందుకోవాలనే తాపత్రయంలో ఉత్తరాది మార్గాన్నే ఇక్కడి నేతలు కూడా అనుసరిస్తే, అది తెలంగాణను సంక్షుభితం చేస్తుంది...

దుబ్బాక దుర్భిణిలో చూస్తే, గోల్కొండే!

రెండు మధ్యేవాద పార్టీల మధ్య ఉండే పోరులో ఒక పక్షాన్ని మితవాదపార్టీ ఆక్రమిస్తున్నది. దాని పర్యవసానాలు, ఫలితాలు ఎట్లా ఉంటాయో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రగతిశీల, సామరస్య, ప్రజాస్వామిక విలువలను కాంక్షించే తెలంగాణ ఎట్లా పరిణమించబోతోందో ఎవరికైనా సోయి ఉన్నదా?


విజయాన్ని దగ్గరిదారిలో అందుకోవాలనే తాపత్రయంలో ఉత్తరాది మార్గాన్నే ఇక్కడి నేతలు కూడా అనుసరిస్తే, అది తెలంగాణను సంక్షుభితం చేస్తుంది. ఉభయమతతత్వాలు చెట్టాపట్టాలు వేసుకుని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తే, తెలంగాణకు అంతకుమించిన శాపం మరొకటి ఉండదు. ఒక చిన్న ఉపఎన్నికలోనే బాబర్‌, అక్బర్‌, లాడెన్‌ ప్రస్తావనలు తీసుకువచ్చిన నాయకులు, రేపు రాష్ట్రస్థాయి ఎన్నికలలో గత విషాద ఉద్రిక్త చరిత్రలను రాజకీయ ఆయుధాలుగా ఝళిపిస్తే, అది సమాజంలోని ఏ వర్గానికీ మేలు చేయదు. ఈ సందేశాన్ని వారు గ్రహిస్తారా? పోనీ, ప్రజలైనా ఈ పరిణామాలలో దాగి ఉన్న ప్రమాదావకాశాలను గుర్తిస్తారా?


గెలుపు వస్తే పొంగిపోము, ఓటమికి కుంగిపోము అని చెబుతారు కానీ, అదేమీ ఉండదు. విజయానికి బాహాటపు సంబరాలు ఉంటాయి. భంగపాటుకు రహస్య రోదనాలు ఉంటాయి. ఉండాలి. ఉండకపోతే ఎట్లా? నీ కాలాన్ని, శ్రమని పెట్టి, ఒకటి సాధించాలని ప్రయత్నించినప్పుడు, అందులో సఫలమైనప్పుడు ఆనందపడవద్దా? పడిన కష్టమంతా నష్టమైతే భోరున విలపించవద్దా? 


ఇంత చిన్న అపజయానికి మేము చలిస్తామా? ఒకే ఒక్కడు ఉన్న పార్టీకి మరొక్కడు జత అయితే ఏం పుట్టి మునుగుతుందని బెంబేలుపడాలి? ఒకటా రెండా అన్నది కాదు కదా, చిన్న పెద్దలను నిర్ణయించేది? ఏలికల తోటఇంటి కైవారంలోనే కదా ఇది జరిగింది, మీ వూరికి వచ్చా, మీ వీధికి వస్తా, మీ ఇంటికి కూడా వస్తా అంటూ అవతలి వస్తాదు గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల పేర్లు ప్రస్తావించి మరీ సవాళ్లు విసురుతున్నాడు! వాళ్లు గల్లీల్లో పల్లెల్లో బలపడుతున్నారు, ఢిల్లీ బలం ఎట్లాగూ ఉన్నది! ఆదమరుపు వద్దు, ప్రమాదసూచిక ఎగిరింది, గమనించాలి. ఒక్క ఓటమే, తనను తాను గుణీకరించుకుని మహాపట్టణం అంతా వ్యాపిస్తే? నూటా పదిహేడుతో హెచ్చవేసుకుంటే? కాబట్టి, కావలసినంత కుంగిపోయి, పడవలసినంత భయపడి, చేయవలసినంత చేయండి, అది మీకు అవసరం. 


ఇక్కడ అసలు సమస్య ఒక అధికారపార్టీకి కష్టం రావడం కాదు. ఇంతకాలం అనుకున్న ప్రత్యామ్నాయ పార్టీ కాళ్ల కిందికి నీళ్లు రావడమూ కాదు. తెలంగాణ రాజకీయ, సామాజిక జీవన వేదిక మీద కలవరపాటు కలిగించే పరిణామం జరగడమే అసలు సమస్య. భారతీయ జనతాపార్టీ తాను బలమైన ప్రత్యర్థిగా ఎదగగలనని, తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోగలనని నమ్మకం కలిగేవిధంగా సామర్థ్యాన్ని ప్రదర్శించగలగడమే పెద్ద సమస్య. దుబ్బాకలో జరిగినది ఆ ప్రతిభా ప్రదర్శనే. 


మునుపు కూడా బిజెపి తెలంగాణలో అడపాదడపా విజయాలు సాధించింది. మహబూబ్‌నగర్‌ ఉపఎన్నికలో గెలిచింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. వాటి వల్ల కలిగిన ఉత్సాహం తాత్కాలికంగానే మిగిలిపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక అట్లా కాదు. అధిష్ఠానం రూపొందించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌లో మొదటి మజిలీ దుబ్బాక. అభ్యర్థి స్థానికుడు, సమర్థుడు. పార్టీకి రాష్ట్రంలో కొత్త నాయకత్వం. కార్యకర్తల కొదవలేదు. సంకల్పం, శ్రమా కలిస్తే కానిదేముంది? అతి చర్యలతో అధికారపార్టీ అందించిన సహకారం ఎట్లాగూ ఉన్నది. 


ఇప్పుడిక రోడ్‌మ్యాప్‌ రెండో మజిలీలో కార్యాచరణ మొదలవుతుంది. కమ్యూనిస్టులు ఎర్రకోటపై ఎర్రజెండా అంటుంటారు. బిజెపి వారు గోల్కొండపై కాషాయ జెండా అంటున్నారు. లక్ష్యం స్పష్టంగానే ఉన్నది. ఆ లక్ష్యం– తెలంగాణ సమాజానికి, తనకంటూ ఒక కొత్త రాష్ట్రాన్ని, ఉద్యమ వారసత్వాన్ని, సహజీవన సాంస్కృతిక విలువలను సమకూర్చుకున్న తెలంగాణ ప్రజానీకానికి మంచి చేస్తుందా? తెలంగాణ మౌలిక ప్రాతిపదికలను భంగపరచకుండా బిజెపి తన వ్యాప్తిని నిర్వహించలేదా?


తెలంగాణలో అధికారం కోసం పోటీ పడడానికి భారతీయ జనతాపార్టీకి అన్ని యోగ్యతలూ ఉన్నాయి. ఆ పార్టీ పూర్వ రూపం కూడా స్వాతంత్ర్యానంతరం మాత్రమే ఆవిర్భవించింది కావడంతో, జాతీయోద్యమంతోను, తెలంగాణ విమోచనోద్యమంతోను ఆ పార్టీకి ప్రమేయం లేకపోయి ఉండవచ్చు. కానీ, తెలంగాణలో ఆ రాజకీయ ధార దీర్ఘకాలంగా ఉంటూ వస్తోంది. మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కూడా నాటి జనసంఘ్‌ సమర్థించింది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగానే, ఇతరత్రాను క్రియాశీలంగా పాలుపంచుకున్నది. రెండు రాష్ట్రాలు, ఒక ఓటు నినాదంతో 1997లోనే రాజకీయమైన అంగీకారాన్ని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఒకవైపు విప్లవ వామపక్ష శక్తుల దగ్గర నుంచి మొదలుకుని, మితవాద రాజకీయశ్రేణుల దాకా అందరూ ఐక్యసంఘటనగా పాల్గొన్న ఉద్యమం. 


హైదరాబాద్‌ నగరంలో గత నాలుగు దశాబ్దాలుగా భారతీయ జనతాపార్టీ ఉనికిలో ఉంటూ వచ్చింది. 1970 దశకం చివరలో హైదరాబాద్‌లో మతఘర్షణలు ప్రారంభమైన తరువాత బిజెపి ఉనికి మరింత విస్తరిస్తూ వచ్చింది. అధికారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, హైదరాబాద్‌ ఉద్రిక్తతలు ఏర్పడగానే బిజెపి, ఎంఐఎం నేతలను అరెస్టు చేయడం ఆనవాయితీగా ఉండేది. (ఇప్పుడు బిజెపి జైత్రయాత్రలకు ఎంఐఎం సహకారం ఉన్నదని అనుకుంటున్నట్టుగానే, అప్పట్లో కూడా ఆ రెండు పార్టీల హైదరాబాద్‌ నేతలకు ఏవేవో లావాదేవీలు ఉండేవని చెప్పుకునేవారు) హైదరాబాద్‌ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా, వివిధ రాజకీయ సమీకరణాల వల్లా, హైదరాబాద్‌ పట్టణంలో బిజెపి ఎన్నికల విజయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. భారతీయ జనతాపార్టీ రాజకీయమైన ఉనికికి, మత ఉద్రిక్తతలకు ఉన్న లంకె కారణంగా, ఆ పార్టీని సర్వసాధారణ పార్టీగా, కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి పార్టీల మాదిరిగా పరిగణించడం తెలంగాణ సమాజానికి అలవాటు లేదు. 


కానీ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో, తక్కినవారితో కలసి నడవడంలో బిజెపి ఎంతో చొరవను ప్రదర్శించింది. వివాదాస్పదమైన, ఉద్రిక్తతలకు దారితీసే అంశాల ప్రస్తావనను ఆ కాలంలో ఆ పార్టీ పైకి తీసుకు వచ్చేది కాదు. ప్రత్యేక రాష్ట్రం గురించిన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ కీలకమయిన పాత్ర వహిస్తే, ఆ నిర్ణయం ఎటువంటి అవరోధం లేకుండా ఆచరణ రూపం తీసుకోవడంలో బిజెపి సహాయపడింది. 


బ్రిటిష్‌ వారి ప్రత్యక్ష పాలనలో లేని సంస్థానాలను విడిగా పరిగణించాలని సర్దార్‌ పటేల్‌ భావించారని అంటారు. బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలు కాంగ్రెస్‌కు అనువయినవని, సంస్థాన ప్రాంతాలు మితవాద, సంప్రదాయ రాజకీయవాదులకు అనుగుణమైనవని ఒక వాదన ఉన్నది. ఒకనాటి నైజాము రాజ్యంలో భాగమైన తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక భావాల వికాసం మొదట ఆర్యసమాజం వంటి మతసంస్థల ద్వారాను, తరువాత భూస్వామ్య వ్యతిరేక పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టుల ద్వారానూ జరిగింది. ఇక్కడి చరిత్ర సంక్లిష్టతను, ఉద్రిక్త పరిణామాలతోను కూడుకున్నది అయినప్పటికీ, అది ఉన్మాదాలకు దారితీయకుండా సెక్యులర్‌గా, సామరస్య సహజీవనంగానూ పరిణమించడానికి కమ్యూనిస్టుల ఉనికి తోడ్పడింది. తెలంగాణకు ఇప్పుడు తన సమ్మిశ్రిత సంస్కృతి ఒక గర్వకారణం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఆ విలువను పదే పదే ప్రకటిస్తూ వచ్చింది.


తెలంగాణకు, మొత్తంగా దక్షిణభారతదేశానికి ఆధునిక, ప్రగతిశీల, లౌకికవాద జీవనవిధానం ఎంతో విలువైన సాంస్కృతిక అంశం. భారతీయజనతాపార్టీ నాయకులలో కూడా ఉత్తరాది–దక్షిణాది తేడాలను చూడవచ్చు. జ్ఞానస్థాయిలలో కూడా వ్యత్యాసాన్ని గమనించవచ్చు. కానీ, విజయాన్ని దగ్గరిదారిలో అందుకోవాలనే తాపత్రయంలో ఉత్తరాది మార్గాన్నే ఇక్కడి నేతలు కూడా అనుసరిస్తే, అది తెలంగాణను సంక్షుభితం చేస్తుంది. ఉభయమతతత్వాలు చెట్టాపట్టాలు వేసుకుని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తే, తెలంగాణకు అంతకుమించిన శాపం మరొకటి ఉండదు. ఒక చిన్న ఉపఎన్నికలోనే బాబర్‌, అక్బర్‌, లాడెన్‌ ప్రస్తావనలు తీసుకువచ్చిన నాయకులు, రేపు రాష్ట్రస్థాయి ఎన్నికలలో గత విషాద ఉద్రిక్త చరిత్రలను రాజకీయ ఆయుధాలుగా ఝళిపిస్తే, అది సమాజంలోని ఏ వర్గానికీ మేలు చేయదు. ఈ సందేశాన్ని వారు గ్రహిస్తారా? తెలంగాణ వరకు విభజనవాదాన్ని కాదని సాధారణ ప్రతిపక్షపాత్రను పోషిస్తారా? పోనీ, ప్రజలైనా ఈ పరిణామాలలో దాగి ఉన్న ప్రమాదావకాశాలను గుర్తిస్తారా? 


ఇదంతా ఇట్లా కావడానికి కారణం ఎవరంటే, వారూవీరూ మీరూ అందరూ కారణమే. అధికార అహంకారం ఒకరిది. చతికిలపడిన నీరసఅలసత్వం మరొకరిది. వ్యూహమూ ఓపికా ఉన్నవారు గెలవక ఏమిచేస్తారు? ఒకటీరెండూ పదీ సీట్లు గెలిచినా మన బాహుళ్య వ్యవస్థలో సర్దుకోవచ్చును కానీ, మొత్తంగా ప్రత్యామ్నాయమే మారిపోతున్నది. దుబ్బాక ఒక ప్రతీక. రెండు మధ్యేవాద పార్టీల మధ్య ఉండే పోరులో ఒక పక్షాన్ని మితవాదపార్టీ ఆక్రమిస్తున్నది. దాని పర్యవసానాలు, ఫలితాలు ఎట్లా ఉంటాయో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రగతిశీల, సామరస్య, ప్రజాస్వామిక విలువలను కాంక్షించే తెలంగాణ ఎట్లా పరిణమించబోతోందో ఎవరికైనా సోయి ఉన్నదా? తెలంగాణలో కమ్యూనిస్టుల స్థితి అయితే ఇక చెప్పనక్కరలేదు. తరం మారిపోయి, కార్యకర్తలే దొరకడం లేదని నేతలు వాపోతున్నారు. మరి, కమ్యూనిస్టు పోరాట చరిత్రను అంతా భారతీయ జనతాపార్టీ తన ఖాతాలో వేసుకుంటూ, విమోచన ఉత్సవాలను జరుపుతుంటే నాయకులు మాత్రం ఏమి చేస్తున్నారు? తామూ విలీనోత్సవాలను జరిపి, మమ అనిపించుకుంటున్నారు. 

చేజేతులా సమర్పించుకుంటున్నప్పుడు అందుకునేవారికి ఏమి నెప్పి?


కె. శ్రీనివాస్

Updated Date - 2020-11-12T06:19:03+05:30 IST