వరుసగా 3 సార్లు ఓడితే.. ఇక టికెట్‌ ఉండదు!

ABN , First Publish Date - 2022-05-28T08:03:00+05:30 IST

వరుసగా 3 సార్లు ఓడితే.. ఇక టికెట్‌ ఉండదు!

వరుసగా 3 సార్లు ఓడితే.. ఇక టికెట్‌ ఉండదు!

ఒకే పదవి వెంటవెంటనే చేపట్టినవారికి పదోన్నతి

లేకుంటే విరామం.. నాకూ వర్తిస్తుంది: లోకేశ్‌

చంద్రబాబు నిర్ణయం

మహానాడు తర్వాత.. 2 భారీ స్కాంలు బయటపెడతా

అది బస్సు యాత్ర కాదు.. బుస్‌ యాత్ర

మీడియాతో లోకేశ్‌ మాటామంతీ


అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): పార్టీ తరఫున పోటీచేసి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకూడదని అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో దీనిపై చర్చించినట్లు తెలిపారు. శుక్రవారం మహానాడు ప్రాంగణంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీలో టూ ప్లస్‌ వన్‌  పద్ధతి ఉండాలని ప్రతిపాదించానని.. రెండు దఫాలు వరుసగా ఒక పార్టీ పదవిని నిర్వహించినవారు.. మూడో దఫా ఆ పదవికంటే పైకయినా వెళ్లాలని, లేకుంటే విరామమైనా తీసుకోవాలన్నదే ఈ ప్రతిపాదన అని తెలిపారు. ఆ విధానాన్ని తనకు కూడా వర్తింపజేయాలని చెప్పానన్నారు. దీనిపై చర్చ జరుగుతోందన్నారు. పార్టీలో ప్రతి స్థాయిలోను యువరక్తం నింపేందుకు, అందరికీ అవకాశాలు ఇవ్వడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. పార్టీలో పనిచేయని నేతలకు, ఇన్‌చార్జులకు అవకాశాలుండవన్నారు. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇంకా ప్రజల్లోకి వెళ్లడం లేదన్నారు. వైసీపీ మంత్రులు చేపట్టింది బస్సు యాత్ర కాదని.. బుస్‌ యాత్ర అని ఎద్దేవా చేశారు. గడపగడపకు ప్రభుత్వం తుస్‌ మనడంతో ఈ యాత్ర పెట్టారన్నారు. జగన్‌ ప్రభుత్వం ఇసుక, మద్యంలో డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు. మహానాడు అయ్యాక మరో రెండు భారీ కుంభకోణాలను పక్కా ఆధారాలతో బయటపెడతానని వెల్లడించారు. ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభమైందన్నారు. జగన్‌పై వైసీపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉందని.. పార్టీ  ఎమ్మెల్యేలపైనే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌నే చంపేస్తే.. మరో వైసీపీ ఎమ్మెల్సీ తమ పార్టీ గ్రామస్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం అంతగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి దండం పెడితే చాలు గెలిచిపోయే పరిస్థితి ఉందన్నారు. తన మంగళగిరి నియోజక వర్గంలో దుగ్గిరాల మండలాన్ని టీడీపీ ఎప్పుడూ గెలవలేదని, కానీ ఇటీవల గెలిచిందని గుర్తుచేశారు.   


ప్రజల మనసులు గెలుస్తాం..

పొత్తుల సంగతిపై ప్రశ్నించగా.. అందుకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని.. ప్రజల మనసులు గెలవడంపైనే తాము తొలిగా దృష్టిపెట్టామని లోకేశ్‌ చెప్పారు. ప్రజలంతా కలిసి ప్రజాకంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే అందరూ కలవాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఏ రూపంలోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 40 శాతం యువతకు సీట్లలో పార్టీ నేతల వారసులతో పాటు.. కొత్త యువత కూడా ఉంటారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీయే సుప్రీంగా ఉంటుందని.. మంత్రులు కూడా పార్టీకి రిపోర్ట్‌ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  జగన్‌రెడ్డి దావోస్‌ వెళ్లి ఒప్పందాలు చేసుకుంది రాష్ట్రానికి చెందిన కంపెనీలతోనేనని.. అరబిందో కంపెనీ వారి మనుషులదేనని.. ఇక అదానీ, గ్రీన్‌కోలను సచివాలయానికి పిలిపిస్తే వచ్చి కలిసి వెళ్తారన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటుండడంతో.. అక్కడ టీడీపీ పోటీచేయదని స్పష్టం చేశారు. కాగా.. మహానాడులో ఎన్టీఆర్‌ బ్లడ్‌బ్యాంకు నిర్వహించిన శిబిరంలో ఆయన రక్తదానం చేశారు.

Updated Date - 2022-05-28T08:03:00+05:30 IST