ఆర్బీకేల్లో అందుబాటులోలేని ఎరువులు

ABN , First Publish Date - 2021-11-07T06:59:59+05:30 IST

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో అన్నింటికీ కొరతే. రైతులకు అవసరమైన మేర ఎరువులు లేవు.

ఆర్బీకేల్లో అందుబాటులోలేని ఎరువులు
రైతు భరోసా కేంద్రం..

అన్నింటికీ కొరతే..!

ఇండెండ్‌ పెట్టినా.. ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి 

కనిపించని రసాయనిక మందులు

వేరుశనగ, పప్పుశనగ తప్పా.. మిగతా విత్తనాలేవీ..? 

కరువు రైతుకు తప్పని ఇక్కట్లు

అనంతపురం వ్యవసాయం/ ధర్మవరం, నవంబరు 6: జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో అన్నింటికీ కొరతే. రైతులకు అవసరమైన మేర ఎరువులు లేవు. ఇండెంట్‌ పెట్టినా.. ఎప్పుడొస్తాయో తెలీదు. రసాయనిక మందులు అస్సలు కనిపించట్లేదు. విత్తనాల పరిస్థితీ అంతే. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పట్లేదు. బయట ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదు. రైతులకు స్థానికంగానే అన్నిరకాల సేవలు అందిస్తామని ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఆ మేరకు సేవలందించలేకపోతున్నారు. సేవలన్నీ బోర్డులకే పరిమితమయ్యాయి. ఎరువుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీజనలో సాగుచేసిన పంటలకు దశలవారీగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన ఎరువులను సకాలంలో అందించలేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని పలు ఆర్బీకేల్లో రసాయనిక మందుల పంపిణీ ఊసెత్తకపోవడం గమనార్హం. ఖరీఫ్‌, రబీ సీజన్లలో వేరుశనగ, పప్పుశనగ పంపిణీతో సరిపెడుతున్నారు. మిగతా పంటల విత్తనాలు అందించడంలో శ్రద్ధ చూపడంలేదన్న విమర్శలున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్కో యంత్రంలో ఎరువులు కావాల్సిన రైతులు ముందస్తుగా రిజిస్ర్టేషన చేసుకోవడంతోపాటు డబ్బులు చెల్లించాలన్న షరతుపెట్టారు. డబ్బు చెల్లించిన తర్వాత ఎన్ని రోజులకు ఎరువులు వస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. రసాయనిక ఎరువులు కావాలంటే ముందగా రిజిస్ర్టేషన చేసుకోవాల్సిందే. వీటికి పంపిణీ చేసే సమయంలోనే డబ్బు చెల్లించేలా నిబంధనలు విధించారు. ముందస్తుగా రిజిస్ర్టేషనతోపాటు డబ్బు చెల్లించి తామెందుకు నిరీక్షిం చాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రిటైల్‌ షాపుల తరహాలోనే ఆర్బీకేల్లో ముందస్తుగా ఎందుకు నిల్వ చేయరంటూ నిలదీస్తున్నారు.


వెంటాడుతున్న ఎరువుల కొరత 

జిల్లావ్యాప్తంగా 867 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటి లో ఎరువుల కొరత కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని మండలాల్లోని వ్యవసాయ అధికారులు రైతులకు అవసరమైన ఎరువులను ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరికొన్ని మండలాల్లో ఇండెంట్‌ పెట్టినా సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతు భరోసా కేం ద్రాల్లో ఎమ్మార్పీకే ఎరువులు విక్రయిస్తున్నారు. దీంతో ఎక్కువ శాతం మంది రైతులు ఆర్బీకేల్లోనే ఎరువులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆశించిన మేరకు ఎరువులు తెప్పించలేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నా రు. తప్పని పరిస్థితుల్లో రిటైల్‌ డీలర్ల వద్ద అదనపు డబ్బు వెచ్చించి, తెచ్చు కోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నెలరోజుల క్రితం రబీ సీజన ఆరంభమైంది. ఈ సీజనలో పప్పుశనగ ఎక్కువ శాతం సాగు చేస్తున్నారు. పప్పుశనగతోపాటు పప్పుదినుసు పంటలకు భాస్వరం కలిగిన డీఏపీ, సూపర్‌, 28-28-0, 20-20-0 తదితర రకాల ఎరువులు తప్పనిసరి. వేరుశనగ, వరి ఇతర పంటలకు యూరియా, సూపర్‌పాస్పేట్‌ తదితర ఎరువులు అవసరం. మిగతా పంటలకు పలు దశల్లో తగిన ఎరువులు వేసుకోవాల్సిందే.


రసాయనిక మందుల ఊసెత్తని దుస్థితి 

 రైతుభరోసా కేంద్రాల్లో రసాయనిక మందులు (పురు గు, క్రిమిసంహారక మందులు) పంపిణీ ఊసెత్తడం లేదు. ఇప్పటిదాకా రైతు భరోసాకేంద్రాల నుంచి ఎలాంటి ఇండెంట్‌ పెట్టకపోవడం విడ్డూరం. ఖరీఫ్‌ సీజనలో 75474 యూనిట్స్‌ (మందు డబ్బాలు) రసాయనిక మందులు అవసరమని ఇండెంట్‌ పెట్టారు. ఇందులో రూ.1.56 కోట్ల విలువైన 34786 యూనిట్లను సరఫరాచేసేందుకు అనుమతించారు. వీటిలో రూ.51.26 లక్షల విలువైన 13131 యూనిట్లను సరఫరా చేశారు. ఇప్పటి దాకా రూ.6.26 లక్షల విలువైన 2248 యూనిట్లను విక్రయించారు. ఆయా రైతు భరోసా కేంద్రాల నుంచి ఇండెంట్‌ పెట్టినా సకాలంలో పురుగు, క్రిమిసంహారక మందులు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి.  ప్రభుత్వం ఆర్టీకేల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంది.





ఎప్పుడొస్తాయో తెలియదు 

నేను ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేశా. పంటకు కావాల్సిన యూరియా, జిప్సం, సల్ఫేట్‌ కోసం ఆర్బీకే వద్దకు వెళ్లా. ముందస్తుగా స్టాక్‌ ఉండదనీ, ఇండెంట్‌ పెడితే తెప్పిస్తామని చెప్పారు. ఎప్పుడొస్తాయో తెలియని మందుల కోసం ఎదురు చూడలేక వెనక్కి వచ్చేశా. ఎమ్మార్పీకే ఆర్బీకేల్లో ఎరువులు దొరుకుతాయనుకుంటే నిరాశే మిగిలింది.

- రైతు రామచంద్ర, తిప్పాబట్లపల్లి, కొత్తచెరువు మండలం


ఎరువులు స్టాక్‌ లేవంట 

నాకు ఏడెకరాల భూమి ఉంది. మూడెకరాల్లో వేరుశనగ, మిగతా నాలుగెకరాల్లో టమోటా పంట సాగు చేశా. పంటలకు పొటాష్‌, డీఏపీ, యూరి యా, జింక్‌, ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్లా. ప్రస్తుతానికి స్టాక్‌ లేదనీ, ముందుగా రిజిస్ర్టేషన చేసుకుని, డబ్బు చెల్లిస్తే తెప్పిస్తామని చెప్పారు. డబ్బు కట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఎరువులు వస్తాయో తెలియకపోవడంతో బయటి ఎరువుల దుకాణాల్లో అధిక ధరకు కొనుగోలు చేసుకున్నాం. ముందస్తుగా ఆర్బీకేల్లో ఎరువులు, రసాయనిక ఎరువులు నిల్వ చేసి, రైతులకు అందిస్తే బాగుటుంది.

 - రైతు ఓబుళపతి, మామిళ్లపల్లి, కనగానపల్లి మండలం



రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

జేడీఏ చంద్రానాయక్‌

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనిక ఎరువులు పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అన్ని ఆర్టీకేల నుంచి ఎరువులు, రసాయనిక ఎరువులకు సంబంధించి ఇండెంట్లు పెట్టించడంతోపాటు సకాలంలో వాటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుం టాం. క్షేత్రస్థాయిలో ఎక్కడై నా సమస్యలుంటే నేరుగా మా దృష్టికి తెస్తే పరిష్కరి స్తాం. ఆర్బీకేల్లో మొక్కజొన్న, వరి, ఉలవ విత్తనాలు పంపి ణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - 2021-11-07T06:59:59+05:30 IST