Credit Card, Debit card లను వాడుతున్నారా..? అక్టోబర్ 1 నుంచి మారబోయే ఈ నిబంధన గురించి తెలుసుకుంటేనే మంచిది..!

ABN , First Publish Date - 2022-09-29T19:52:30+05:30 IST

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడుతున్న వారికి ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి ఈ కార్డుల చెల్లింపు విధానంలో భారీ మార్పు చోటు చేసుకోబోతున్నాయి. సైబర్ కేటు గాళ్లు, ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టే విధంగా ఆర్బీఐ(RBI) రూపొందించిన నిబంధన అక్టోబర్ 1 నుం

Credit Card, Debit card లను వాడుతున్నారా..? అక్టోబర్ 1 నుంచి మారబోయే ఈ నిబంధన గురించి తెలుసుకుంటేనే మంచిది..!

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడుతున్న వారికి ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి ఈ కార్డుల చెల్లింపు విధానంలో భారీ మార్పు చోటు చేసుకోబోతున్నాయి. సైబర్ కేటు గాళ్లు, ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టే విధంగా ఆర్బీఐ(RBI) రూపొందించిన నిబంధన అక్టోబర్ 1 నుంచే అమలులోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కొత్త రూల్ తప్పక తెలుసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులపై ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెజాన్, ప్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో.. ఇలా రకరకాల యాప్‌లు, వెబ్‌సైట్లలో డెబిట్ లేదా క్రిడిట్ కార్డు(Credit/Debit Card)లు ఉపయోగించి చెల్లింపులు చేస్తాం. ఈ పద్ధతిలో మొదటిసారి.. మన కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా యాప్స్, వెబ్‌సైట్‌లలో ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఎన్నిసార్లు లావాదేవీలు చేసినా పూర్తి కార్డు వివరాలను ఇవ్వం. దీని కారణం మనం మొదటిసారి కార్డు వివరాలు ఎంటర్ చేసిన వెంటనే.. ఆ కార్డు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో సేవ్ అయిపోతాయి. తర్వాత మనం ఎన్నిసార్లు లావాదేవీలు జరిపినా.. పూర్తి కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా కేవలం సీవీవీ, మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మాత్రమే చెల్లింపులు జరుపుతున్నాం. అయితే.. ఇకపై ఈ పద్ధతిలో లావాదేవీలు జరపడం కుదరదు. అలాగని.. ప్రతిసారి కార్డు డిటైల్స్ ఎంటర్ చేయాల్సిన పనీ లేదు. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే టోకనైజేషన్ విధానం ద్వారా ప్రతిసారి కార్డుల వివరాలు ఇవ్వకుండానే లావాదేవీలు జరపొచ్చు.


టోకనైజేషన్(Tokenization) అంటే..

ఈకామర్స్ వైబ్‌సైట్లు, ఇతర ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో క్రెడిట్/డెబిట్ కార్డు(Credit/Debit Card)లు సేవ్ అయి ఉండటం వల్ల సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికే ఆర్బీఐ టోకనైజేషన్ విధానాన్ని రూపొందించింది. టోకనైజేషన్ విధానంలో కార్డు వివరాలు ప్రత్యేకమై టోకెన్ నెంబర్‌తో భర్తీ అవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో ఏ కార్డు వివరాలు సేవ్ కావు. ప్రత్యేకమైన టోకెన్ నెంబర్ సహాయంతో మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఈ టోకెన్ నెంబర్ పొందాలంటే.. చెల్లింపు జరిపే ప్లాట్‌ఫాంలో ‘టోకెన్ రిక్వెస్టర్’కు అభ్యర్థన పెట్టుకోవాలి. ఈ అభ్యర్థన కార్డు నెట్‌వర్క్ సంస్థకు వెళ్తుంది. ఈ క్రమంలోనే వినియోగదారుడి రిక్వెస్ట్ మేరకు నెట్‌వర్క్ సంస్థ కార్డు వివరాలకు బదులు.. టోకెన్ నెంబర్‌ను ఇస్తుంది. ఇలా జారీ చేయడాన్నే టోకనైజేషన్ అంటారు. ఒక వేళ వినియోగదారుడు టోకనైజేషన్ చేసుకోకపోతే.. ఆన్‌లైన్ చెల్లింపులు జరిపిన ప్రతిసారి కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 


టోకనైజేషన్ చేసే విధానం..

  • ఈకామర్స్ లేదా షాపింగ్ యాప్స్‌లో షాపింగ్ చేసిన తర్వాత చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలి.

  • ఈ చెల్లింపు ప్రక్రియ సందర్భంగా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాలి.

  • చెల్లింపు చేయడానికి ముందు ‘ఆర్బీఐ గైడ్‌లైన్స్ ఆన్ టోకనైజ్ యువర్ కార్డ్ ఎడ్జ్’ అప్షన్‌ను ఎంచుకోవాలి.

  • ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే టోకెన్ జనరేట్ అవుతుంది. కార్డుకు బదులుగా ఈ టోకెన్ నెంబరే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో సేవ్ అవుతుంది.



Updated Date - 2022-09-29T19:52:30+05:30 IST