మిద్దెపై మొక్కలు పెంచుకోవాలంటే...

ABN , First Publish Date - 2022-05-26T07:53:38+05:30 IST

ముందుగా రూఫ్‌ని వాటర్‌ప్రూఫ్‌ చేయించుకోవాలి. టెర్రస్‌పై ఏమైనా లీక్‌లు ఉన్నాయేమో ముందే చెక్‌ చేసుకోవాలి.

మిద్దెపై మొక్కలు పెంచుకోవాలంటే...

ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది. కానీ స్థలం లేక చాలా మంది ఆసక్తిని చంపుకొంటారు. అయితే మిద్దెపై మొక్కలను పెంచుకోవడం ద్వారా గార్డెన్‌ కోరికను నెరవేర్చుకోవచ్చు. అయితే టెర్రస్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే... 


ముందుగా రూఫ్‌ని వాటర్‌ప్రూఫ్‌ చేయించుకోవాలి. టెర్రస్‌పై ఏమైనా లీక్‌లు ఉన్నాయేమో ముందే చెక్‌ చేసుకోవాలి. అలాగే రూఫ్‌ నుంచి డ్రైన్‌ నీరు సాఫీగా వెళ్లిపోయేలా చూసుకోవాలి.

రూఫ్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకునే ముందు రఫ్‌గా ప్లాన్‌ను గీసుకోవాలి. కంటెయినర్స్‌ ఎక్కడెక్కడ పెట్టాలి? కూర్చోవడానికి అనువైన ప్రదేశాలు ఏవి? వాకింగ్‌ స్పేస్‌ ఎలా వదలాలి? ఇలాంటివన్నీ పక్కాగా పేపర్‌పై ప్లాన్‌ రూపంలో గీయాలి. 

కంటెయినర్స్‌ ఏర్పాటు చేసుకుంటే నిర్వహణ సులువవుతుంది. టెర్రాకోట, సిరామిక్‌ ప్లాంటర్స్‌ను ఉపయోగించవచ్చు. కోకోనట్‌ షెల్స్‌, కోక్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సైతం పాట్స్‌గా వాడొచ్చు. అయితే వేసవికాలంలో ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌ వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి పాట్స్‌ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టితో పాటు వర్మికంపోస్ట్‌ సమంగా కలుపుకొని కుండీల్లో నింపాలి. 

టెర్రస్‌పై ఐదారు గంటలు ఎండ ఉంటుంది. వేసవిలో ఇంత సమయం మొక్కలకు నేరుగా ఎండ తగిలితే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పలుచటి క్లాత్‌ను కట్టి ఎండ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి. 

సీజనల్‌గా పుష్పించే మొక్కలు, కూరగాయల మొక్కలను ఎంపిక చేసుకోవాలి. నేరుగా సూర్యరశ్మితో పెరిగే టొమాటో, క్యాప్సికం, మిర్చీ మొక్కలను పెంచుకోవచ్చు. సూర్యరశ్మిని తట్టుకోలేని మొక్కలు రూఫ్‌ గార్డెన్‌కి ఎంచుకోకపోవడమే ఉత్తమం.

వేసవికాలంలో మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీళ్లు పోయాలి. ఇతర సీజన్లలో ఒకసారి పోసినా సరిపోతుంది. వర్షాకాలంలో కుండీలో మట్టిని చెక్‌ చేస్తూ ఉండాలి. తడిగా ఉంటే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు.

ఎండిన ఆకులు, పుష్పాల కాడలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విరిగిపోయిన కొమ్మలను తీసేయాలి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.

Updated Date - 2022-05-26T07:53:38+05:30 IST