అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి

ABN , First Publish Date - 2022-08-16T10:43:15+05:30 IST

‘‘దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఏపీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి.

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి

  • రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు
  • సీఎం జగన్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే
  • 12వేల టీచర్‌ పోస్టులను కాలగర్భంలో  కలిపారు: ఎంపీ రఘురామ


న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఏపీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్‌డీఏ ఇచ్చిన వ్యాపార ప్రకటన పరిశీలిస్తే... రాష్ట్ర ముఖచిత్రం స్పష్టమవుతుంది. ఆ సంస్థ అమ్మకానికి పెట్టిన ప్లాట్లకు బిడ్లు వేసే నాథుడే లేరు. రాష్ట్రంలో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా పరిస్థితి ఉంది’’ అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో, ప్రజలు తెలంగాణకు వలస పోవడానికి సిద్థంగా ఉన్నారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి తన ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పారు. 


నన్ను నియోజకవర్గానికి రాకుండా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎంతోమంది మహానుభావులు కష్టపడి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువస్తే... రాష్ట్రంలో మాత్రం స్వాతంత్ర్యాన్ని కోల్పోయాం. ప్రస్తుత పాలకుల బుద్ధి మారాలని ఎవరికీ వారు అల్లూరి సీతారామరాజులాగా పోరాడుతారో, లేకపోతే నాలా గాంధేయవాదుల్లా ఉద్యమిస్తారో నిర్ణయించుకోవాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులు తనను గొడ్డును బాదినట్లు బాదారంటూ గతంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. విద్యావ్యవస్థను అద్భుతం చేశామని చెబుతున్న జగన్‌ 12 వేల టీచర్‌ ఉద్యోగాలను కాలగర్భంలో కలిపారని రఘురామ ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కులాలను అంటగట్టడం సబబేనా అని రఘురామ ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-16T10:43:15+05:30 IST