అఫర్డబుల్‌ హౌసింగ్‌పై రేట్ల పెంపు ప్రభావం ఉండదు..

Published: Sat, 14 May 2022 02:54:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మరోసారి వడ్డీ రేట్లు పెరిగే చాన్స్‌ 

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని శాఖలు

‘ఆంధ్రజ్యోతి’తో ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ ఈడీ మోను రాత్రా


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత రెండేళ్లుగా వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం, కొవిడ్‌ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే బయటపడుతుండటం తో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను పెంచిందని, మరోసారి కూడా కీలక వడ్డీ రేట్లను పెంచే వీలుందని ఐఐఎ్‌ఫఎల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ మోను రాత్రా చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదల ప్రభావం అందుబాటు ధరల్లో ఉన్న గృహాల (అఫర్డబుల్‌ హౌసింగ్‌) కొనుగోలుపై ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూల అఫర్డబుల్‌ గృహాల నిర్మాణంపై డెవలపర్లు, కొనుగోలుదారుల్లో అవగాహన పెంచడానికి ‘కుటుంబ్‌’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఐఐఎ్‌ఫఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు..   


వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతాయా?

ఆర్థిక వ్యవస్థ గాడినపడటం, డిమాండ్‌ ఊపందుకోవటంతో గడచిన రెండేళ్లుగా యథాతథంగా ఉన్న కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచుతోంది. మరోసారి వడ్డీ రేట్లను పావు శాతం నుంచి అర శాతం పెంచే అవకాశాలున్నాయి.


రేట్ల పెంపు ప్రభావం గృహ విక్రయాలపై ఉంటుందా?

పెట్టుబడి కోసం.. ఎగువ, మధ్య తరగతి వర్గాలు కొనుగోలు చేసే ప్రీమియం గృహాలపై వడ్డీ రేట్ల ప్రభావం ఉండొచ్చు. అయితే, సాధారణ రిటైల్‌ కొనుగోలుదారులు కొనుగోలు చేసే అందుబాటు ధరల్లో ఉన్న గృహాల కొనుగోలుపై రేట్ల పెంపు ప్రభావం ఉండదు. అవసరం కోసం కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. 


అఫర్డబుల్‌ గృహాలు అంటే ?

ఇది ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంది. సాధారణంగా 600-800 చదరపు అడుగులు ఉండి.. చదరపు అడుగు రూ.1,700-2,000 ధరకు లభించే గృహాలను అఫర్డబుల్‌ గృహాలుగా భావించవచ్చు. మా కస్టమర్లనే తీసుకుంటే 80-90 శాతం మంది మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసినవారే.


ఎన్‌బీఎ్‌ఫసీలు, హెచ్‌ఎ్‌ఫసీలు ఎందుకు బ్యాంకులతో చేతులు కలుపుతున్నాయ్‌?

ఇది గృహ రుణాలు అందించడంలో కొత్త పంధా. బ్యాంకుల వద్ద నిధులు పుష్కలంగా ఉంటా య్‌. ఎన్‌బీఎ్‌ఫసీలు, హెచ్‌ఎ్‌ఫసీలు నెట్‌వర్కింగ్‌, మార్కెటింగ్‌ వంటి వాటిల్లో బలంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో గృహ రుణాలపై బ్యాంకులు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కో-లెండింగ్‌ జరుగుతోంది. సాధారణంగా గృహ రుణంలో హెచ్‌ఎ్‌ఫసీ 20 శాతం, బ్యాంకులు 80 శాతం ఇస్తున్నాయి. కో-లెండింగ్‌ వల్ల హెచ్‌ఎ్‌ఫసీ, ఎన్‌బీఎ్‌ఫసీ గృహ రుణ వడ్డీ రేట్ల కన్నా కొద్దిగా తక్కువకు వినియోగదారులు రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. కో-లెండింగ్‌లో ఐఐఎ్‌ఫఎల్‌ హోమ్‌, బ్యాంకులు కలిసి ఇప్పటి వరకూ రూ.1,900 కోట్ల రుణాలు ఇచ్చాయి.


తెలుగు రాష్ట్రాల్లో మీ రుణాలు ఏ మేరకు ఉన్నాయ్‌?

తెలుగు రాష్ట్రాల్లో 17,000 మందికి ఇప్పటి వరకూ గృహ రుణాలు ఇచ్చాం. ఈ రాష్ట్రాల్లో మొత్తం ఇచ్చిన రుణాలు రూ.2,448 కోట్లు. ఇందులో తెలంగాణలో రూ.1,491 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.956 కోట్ల మేరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 56 శాఖలు, తెలంగాణలో 31 శాఖలు ఉన్నాయి. 2023 మార్చి నాటికి రెండు రాష్ట్రాల్లో శాఖలను 120కి పెంచుతాం. నెలకు రెండు రాష్ట్రాల్లో 1,000 మంది రిటైల్‌ కొనుగోలుదారులకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తున్నాం. సగటు రుణం రూ.10 లక్షలు ఉంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,800 కోట్ల రుణాలు ఇచ్చాం. అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం) రూ.23,600 కోట్లు ఉంది. 


పర్యావరణ అనుకూల గృహాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

అఫర్డబుల్‌ గృహాలను ఎక్కువగా స్థానిక డెవలపర్లే నిర్మిస్తారు. వారికి పర్యావరణ అనుకూల ద్రువీకరణ పొందే  ప్రక్రియ మొదలైన వాటిపై అవగాహన ఉండదు. ఈ గృహాలను నిర్మించడానికి 2-4 శాతం ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అందువల్ల ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)తో కలిసి ఇటువంటి డెవలపర్లకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఈ గృహాలను కొనుగోలు చేసే వినియోగదారులకు కొద్దిగా తక్కువ రేటుకు కూడా రుణాలు ఇస్తున్నాం. 18-20 మంది డెవలపర్లకు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను చేపట్టడానికి రూ.400-500 కోట్ల నిధులు అందించాం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.