ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులతో చర్చించనున్న వీసీ

ABN , First Publish Date - 2022-03-21T17:32:44+05:30 IST

ట్రిఫుల్ ఐటీ విద్యార్థినులతో చర్చించేందుకు అమరావతి నుంచి చాన్స్‌లర్ చెంచిరెడ్డి సోమవారం రానున్నారు.

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులతో చర్చించనున్న వీసీ

కడప: ఇడుపులపాయ ట్రిఫుల్ ఐటీ విద్యార్థినులతో చర్చించేందుకు అమరావతి నుంచి చాన్స్‌లర్ చెంచిరెడ్డి సోమవారం రానున్నారు. రాత్రికి రాత్రే క్యాంపస్ ఖాళీ చేయడంపై అర్థరాత్రి వరకు విద్యార్థినులు నిరసనకు దిగారు. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని, వసతులు కల్పించేవరకు అక్కడే ఉంటామని విద్యార్థినులు స్పష్టం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు వీసీ వస్తున్నారు.


కడప జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులను రాత్రి వేళ క్యాంపస్‌ ఖాళీ చేయించారు. ఒంగోలు నుంచి వచ్చిన విద్యార్థుల కోసం హడావుడిగా వారందరినీ దూరంగా ఉన్న పాత క్యాంప్‌సకు తరలించారు. శిథిలావస్థకు చేరి, కనీస సౌకర్యాలు లేక, పాములతో నిండిన ఆ క్యాంప్‌సలోకి వెళ్లబోమంటూ విద్యార్థినులు నిరసన గళమెత్తారు. సర్దిచెప్పాల్సిన ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి విద్యార్థినుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ‘‘ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి’’ అంటూ ఆందోళనకు దిగిన ఓ విద్యార్థినిపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. భోజనం కూడా చేయకుండా అర్ధరాత్రి వరకూ ఏకధాటిగా 12 గంటలు నిరసన కొనసాగించారు. దీంతో ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో 6,500 మంది విద్యార్థులు ఉన్నారు. ఒంగోలులో కనీస సౌకర్యాలు లేవని పీయూసీ-1, పీయూసీ-2, ఇంజనీరింగ్‌-1కు చెందిన 3,300మందిని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి మార్చారు. వారికి వసతి కోసం ఇక్కడి విద్యార్థినులను క్యాంప్‌సకు దూరంగా పాత క్యాంపస్‌ (డ్యాం షెడ్స్‌)కు తరలించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రెండేళ్లుగా వాడుకలో లేక శిథిలావస్థలో ఉన్న ఆ భవనాలకు అంతంతమాత్రంగా మరమ్మతులు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పాత క్యాంపస్‌ గదుల్లోకి వెళ్లిన విద్యార్థినులకు ఫ్యాన్లకు వేలాడుతున్న పాములు, శుభ్రం చేయని మరుగుదొడ్లు దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఉదయం వారు బయటకు రాకుండా యాజమాన్యం గేట్లకు తాళాలు వేయడంతో ఆగ్రహంతో గేట్లు తోసుకుని అడ్మినిస్ర్టేషన్‌ బంగ్లాకు చేరుకుని నిరసన చేపట్టారు. 

Updated Date - 2022-03-21T17:32:44+05:30 IST