I-Day: అశ్లీల భోజ్‌పురి పాటలపై ఐఐటీ బీహెచ్‌యూ దర్యాప్తు

ABN , First Publish Date - 2022-08-16T22:47:38+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం కొందరు యువకులు అశ్లీల భోజ్‌పూరి పాటలు ప్లే చేసిన...

I-Day: అశ్లీల భోజ్‌పురి పాటలపై ఐఐటీ బీహెచ్‌యూ దర్యాప్తు

వారణాసి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం కొందరు యువకులు అశ్లీల భోజ్‌పూరి పాటలు (Vulgar Bhojpuri Songs) ప్లే చేసిన ఘటనను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బనారస్ హిందూ యూనివర్శిటీ  (IIT-BHU) సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు కమిటీని (probe committee) ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు మంగళవారంనాడు తెలిపాయి.


ఐఐటీలో భోజ్‌పురి అశ్లీల పాటలను ప్లే చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావడం సంచలనమైంది. దీంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ప్రతిసంవత్సరం లాగానే జింఖానా గ్రౌండ్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామని ఐఐటీ (బీహెచ్‌యూ) అధికారి ఒకరు తెలిపారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత టీచర్లు, బోధనేతర సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని, కొందరు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లను మ్యూజిక్ సిస్టంకు అనుసంధానించి కొన్ని భోజ్‌పురి పాటలు ప్లే చేశారని, అందుకు అనుగుణంగా నృత్యాలు చేశారని అన్నారు. అశ్లీల గీతాలు ప్లే చేస్తుండటం విన్న కొందరు సిబ్బంది వెంటనే అక్కడి మ్యూజిక్ సిస్టంను కట్టివేసి, యువకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు తెలిపారు.


దర్యాప్తు కమిటీ...

ఐఐటీలో భోజ్‌పూరి అశ్లీల పాటలు, నృత్యాలు చోటుచేసుకున్నాయన్న ఘటనపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్టు జాయింట్ రిజిస్ట్రార్ రాజన్ శ్రీవాత్సవ తెలిపారు. దర్యాప్తు నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై మహాత్మాగాంధా కాశీ విద్యాపీఠం మాజీ ప్రొఫెసర్ అనిల్ ఉపాధ్యాయ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి శుభ సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదని అన్నారు. బీహెచ్‌యూకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇలాంటి ఘటనలు జరక్కుండా బీహెచ్‌యూ యంత్రాంగం చూడాలని చెప్పారు. ఈ ఘటనపై పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

Updated Date - 2022-08-16T22:47:38+05:30 IST