అప్పటి నుంచే బాడీ షేమింగ్‌

ABN , First Publish Date - 2021-05-02T05:30:42+05:30 IST

‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమన్న గోవా సుందరి ఇలియానా కొన్నేళ్ళ పాటు టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఉన్నారు. ఆ తరువాత ఎక్కువగా హిందీ చిత్రాలకే ఆమె పరిమితమయ్యారు. ఇటీవలే అభిషేక్‌ బచ్చన్‌తో ఆమె నటించిన ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయింది. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ గురించి ఈమధ్య పెట్టిన పోస్ట్‌...

అప్పటి నుంచే బాడీ షేమింగ్‌

‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమన్న గోవా సుందరి ఇలియానా కొన్నేళ్ళ పాటు టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఉన్నారు. ఆ తరువాత ఎక్కువగా హిందీ చిత్రాలకే ఆమె పరిమితమయ్యారు.  ఇటీవలే అభిషేక్‌ బచ్చన్‌తో ఆమె నటించిన ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయింది. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ గురించి ఈమధ్య పెట్టిన పోస్ట్‌ సంచలనమయింది. తన శరీరాకృతిపై వచ్చిన వ్యతిరేక వ్యాఖ్యల గురించీ, తాను అనుభవించిన మనోవేదన గురించీ ఇలియానా పంచుకున్న మనోభావాలు ఆమె మాటల్లోనే...


‘‘ఆ రోజులను నేను మరిచిపోలేను. ఇదంతా నిన్ననే జరిగినట్టుంది. నన్ను చూసి కొందరు ఎగతాళిగా నవ్వేవారు. మరి కొందరు చెత్త కామెంట్స్‌ చెయ్యడానికి సంకోచించేవాళ్ళు కాదు. ఇదంతా నా గుండెలో లోతైన గాయం చేసింది. మరచిపోవాలని అనుకున్నా... మళ్ళీ ఆ కామెంట్స్‌ గుర్తొస్తే... ఆ గాయం మళ్ళీ సలుపుతున్నట్టుంటుంది.


నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే నా శరీరాకృతి గురించి అసభ్యమైన కామెంట్స్‌ వినాల్సి వచ్చింది. అప్పుడు నాకు పన్నెండేళ్ళే! ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలనీ, తమ శరీరాకృతి బాగుండాలనీ ఉంటుంది. భౌతికమైన అందంకన్నా మానసిక సౌందర్యం గొప్పదే! కానీ సమాజం మనం ఎలా కనిపిస్తున్నామన్నదే చూస్తుంది. అందుకే అందం గురించి స్పృహ అందరిలోనూ ఉంటుంది. కానీ పెద్దగా లోకం తెలియని వయసులోనే బాడీషేమింగ్‌ ఎదురవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయాను. ‘‘ఓ మై గాడ్‌! నీ శరీరంలో ఆ భాగం మరీ ఇంత పెద్దగా ఉందేంటి?’’ అనే కామెంట్స్‌ విని తట్టుకోలేకపోయాను. ‘‘మీరేం అంటున్నారు?’’ అని భయంగా అడిగేదాన్ని. అసహ్యమైన, బాధాకరమైన ఆ మాటలు నన్ను చాలా రోజులు వెంటాడాయి. 


డిప్రెషన్‌తో పోరాడాను...

ఒక దశలో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. బరువు కూడా ఎంతో తక్కువగా ఉండేదాన్ని. శరీరానికి సంబంధించిన సమస్యలూ ఎక్కువే. అయినప్పటికీ ‘‘దేవుడా! నేను చాలా లావుగా ఉన్నానే!’’ అనుకొనేదాన్ని. నా శరీరం తీరు గురించి ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడేదాన్ని కాదు. సినీరంగంలోకి వచ్చాక... నా కెరీర్‌ ప్రారంభంలో శరీరాకృతి సరిగ్గా లేదన్న కాంప్లెక్స్‌తో తీవ్రంగా పోరాడాను. అద్దంలో చూసుకున్నప్పుడు ‘‘నువ్వు అందమైన నటిలా కాకుండా మామూలు అమ్మాయిలా కనిపిస్తున్నావ్‌!’’ అనుకొనేదాన్ని. మరి కాసేపటికి ‘‘నేను బాగానే ఉన్నాను కదా!’’ అనిపించేది. అయితే దానికి కారణం ఏమిటో మొదట్లో నేను గుర్తించలేదు. నేను ఎందుకూ పనికిరానన్న భావన నన్ను వెంటాడేది. ఒక నటిగా అందంగా కనబడాలనే ఒత్తిడి నా మీద చాలా ఉండేది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉండేవి. చివరకు వైద్యుల్ని కలిశాను. నాకు డిప్రెషన్‌, బాడీ డిస్మోర్ఫియా డిజార్డర్‌ ఉన్నాయని అప్పుడే తెలిసింది. వైద్యుల సలహాలు, సాయంతో మెల్లమెల్లగా నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ‘నేను నేనే! నన్ను నేనుగా ఆమోదించుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చాను. మెల్లగా మెల్లగా డిప్రెషన్‌ నుంచి బైటపడ్డాను. 


రోజుకి పది మెసేజ్‌లు అలాంటివే...

సోషల్‌ మీడియా పెరిగాక... ముక్కూ మొహం తెలియని వారి నుంచీ ప్రతి రోజూ కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రోజుకు కనీసం పది వ్యాఖ్యలు నా శరీరాకృతిని ఎత్తిచూపేవే! రోజూ ఎవరో ఒకరు మీ గురించి అంటూనే ఉంటారు. అవి బాధపెడతాయి. ఇలాంటి పోస్టులు పెట్టేవారిని నేను కోరుతున్నది ఏంటంటే.... ఇతరుల విషయంలో సున్నితంగా వ్యవహరించండి. ఎందుకంటే అవి అవతల మనుషుల్ని ఎంత బాధపెడతాయో మీకు అర్థం కాదు. వారి ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి మాటలు దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తాయి. 


వాళ్ళను పట్టించుకోవద్దు...

ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు. అందిరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మీలో ఉన్న సానుకూలతల గురించి ఆలోచించండి. వీలైన లోపాలను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ, దాని గురించే ఆలోచించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మనమీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనప్పుడు మాత్రమే అలాంటి మాటలు మనల్ని బాధపెడతాయి. మన మనోభావాలు పట్టించుకోకుండా కొందరు నిర్లక్ష్యంగా, క్రూరంగా చేసే కామెంట్స్‌ తట్టుకోవడానికి ఎంతో ధైర్యం, శక్తి కావాలి. ‘ఎవరెలా అనుకున్నా నీకు నష్టం లేదు. నీ గురించి నువ్వేం అనుకుంటున్నావన్నదే ప్రధానం’ అంటూ నాకు నేను ప్రతిరోజూ ధైర్యం చెప్పుకుంటాను. నేను చెప్పగలిగేది ఒక్కటే. మీ శరీరాకృతి గురించీ, రంగు గురించీ వికృతమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని పట్టించుకోకండి. సానుకూలమైన దృక్పథంతో ఉండండి. 


అదే నాకు ముఖ్యం!

మనకు నియంత్రణ ఉండేది మన మీద, మన గురించి మనం చేసే ఆలోచనల మీదా మాత్రమే. కాబట్టి నేను నా గురించి నేను ఏమనుకుంటున్నానో అదే నాకు ముఖ్యం. ప్రపంచం ఏమనుకుంటుందనే దానితో నాకు నిమిత్తం లేదు. నేను నా శరీరంతో కలిసి జీవిస్తాను. కొన్నిసార్లు ఏదైనా నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు బెంగ పడిపోవడం లేదు. ‘అది అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి’ అనుకుంటాను. ఈ వైఖరే నన్ను మరోసారి డిప్రెషన్‌లోకి జారిపోకుండా ముందుకు నడిపిస్తోంది.’’


Updated Date - 2021-05-02T05:30:42+05:30 IST