శ్రీకాళహస్తి ఆలయంలో ఆగని అక్రమ వసూళ్లు

ABN , First Publish Date - 2022-06-29T07:32:51+05:30 IST

తరచూ వివాదాలు చెలరేగుతూనే ఉన్నా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అక్రమ వసూళ్లు ఆగడంలేదు.

శ్రీకాళహస్తి ఆలయంలో ఆగని అక్రమ వసూళ్లు

అమ్మవారి సన్నిధిలో దర్జాగా దీపాల విక్రయం

శ్రీకాళహస్తి, జూన్‌ 28: తరచూ వివాదాలు చెలరేగుతూనే ఉన్నా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అక్రమ వసూళ్లు ఆగడంలేదు.ఆలయంలో భక్తులు దీపారాధన చేయడంపై ఎప్పటి నుంచో నిషేధం అమల్లో వున్నా కొందరు ఆలయ ఉద్యోగులు దర్జాగా అమ్మవారి సన్నిధిలో గర్భగుడి వెనుక తిష్టవేసి దీపాల వ్యాపారానికి తెరతీసారు. అమ్మవారి గర్భగుడి వెనుక ఏసీ కంప్రెషర్‌ కింది భాగంలో ముందుగా దీపాలను పళ్లెంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. గర్బగుడి వెనుక వైపున అమ్మవారి మూర్తి ఉంటారు. అలాగే గర్భగుడి వెనుకవైపున నైరుతి భాగంతో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిలకు పత్రీకగా త్రిశక్తి రూరంలో ధ్యానమూర్తి ఉంటారు.భక్తులు ప్రత్యేకంగా అక్కడ ప్రదక్షిణ చేసి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. దాంతో గర్భగుడి వెనుక దీపారాధన చేస్తే మంచిదని కొందరు సిబ్బంది భక్తులను నమ్మిస్తున్నారు. మనిషిని బట్టి నగదు వసూలు చేస్తున్నారు.వచ్చిన అక్రమ సంపాదనను వాటాలుగా పం చుకుంటున్నారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో కొసమెరుపు ఏంటంటే పవిత్ర గర్భాలయ ప్రదేశంలో నకిలీ నేతి దీపాలతో భక్తులను మోసం చేయడం. ఆలయం వెలుపల తేరువీధి, సన్నిధి వీధిలో నకిలీ నేతి దీపాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పలుమార్లు తనిఖీ చేసి హెచ్చరించారు. అయితే ప్రస్తుతం ఆలయ ఉద్యోగులే ఏకంగా అమ్మవారి గర్భగుడి వెనుక నకిలీ నేతి దీపాల అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇటీవల స్వామివారి గర్భగుడికి ఆనుకొని ఉన్న కొష్టి దుర్గమ్మ వద్ద ఎవరో ముల్లంగి దీపం పెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దుమారం రేగిన విషయం తెలిసిందే.ఐదురోజుల క్రితం ఆలయంలోని కనకదుర్గమ్మ మూర్తి వద్ద ఓ అర్చకుడు బహిరంగంగా పసుపు, ఎరుపు దారాలను విక్రయించడం కూడా తెలిసిందే. దాంతో అక్కడ దారాల అమ్మకంతో వసూళ్లు చేసిన గురుభరణ్‌ అనే అర్చకుడిని సస్పెండ్‌ చేశారు.రూ.500 రాహు కేతు పూజా మండపంలో బలవంతంగా భక్తుల చేత దక్షిణ వసూలు చేశారని మరో ఇద్దరు అర్చకులను సస్పెండు చేశారు. ఇక నెల రోజుల క్రితం ఆలయంలో బహిరంగా కొందరు సెక్యూరిటీ సిబ్బంది దళారుల అవతారం ఎత్తి భక్తుల నుంచి వసూళ్లు చేసిన దృశ్యాలు పెద్దఎత్తున వైరల్‌ అయ్యాయి. ఆలయ అధికారులు దళారుల అవతారం ఎత్తిన నలుగురికి విధుల నుంచి ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించారు. కానీ వారం రోజులు కూడా తిరగకుండానే మళ్లీ ఆ నలుగురు విధుల్లోకి దర్జాగా వచ్చేశారు. దీంతో వసూళ్లు చేస్తే ఏం చర్యలు తీసుకుంటారులే అన్న ధీమా అందరిలో పెరిగిపోయింది.సంబంధిత అధికారులు స్పందించి అమ్మవారి సన్నిధిలో నకిలీ నేతి దీపాలతో అక్రమ వసూళ్లను అరికట్టాల్సి వుంది.


Updated Date - 2022-06-29T07:32:51+05:30 IST