నాయకుల అక్రమ అరెస్టు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2022-05-24T07:00:39+05:30 IST

ప్రజాసమస్యలపై పోరాటం చేసే ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు.

నాయకుల అక్రమ అరెస్టు అప్రజాస్వామికం
పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనలో పాల్గొన్న గుమ్మడి నర్సయ్య తదితరులు

నాయకుల అక్రమ అరెస్టు అప్రజాస్వామికం

పోలీస్‌స్టేషన్‌  ఎదుట ఆందోళనలో పాల్గొన్న గుమ్మడి నర్సయ్య తదితరులు

సూర్యాపేటటౌన్‌, మే 23: ప్రజాసమస్యలపై పోరాటం చేసే ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. జిల్లాకేంద్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా ఆధ్వర్యంలో సోమవారం నాయకులు చేపట్టిన మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజల సమస్యలపై నిరసన తెలుపడానికి వస్తున్న నాయకులను మంత్రి జగదీష్‌రెడ్డి అరెస్టు చేయడంలో ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారానికి చూడాలన్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడమే తప్ప పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తూ హామీలు తప్ప ఆచరణలో సాధ్యమయ్యే పాలనసాగించడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోకినపల్లి వెంకటేశ్వర్‌రావు, జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి శివకుమార్‌, ఎర్ర అఖిల్‌, కొత్తపల్లి రేణుక, రామోజీ, నాగార్జున, జీవన్‌, సంతోషి, కవిత, చంద్రకళ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. 


ఉపాధిహామీ వేతనాలు విడుదల చేయాలి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామి కూలీల వేతనాలు వెంటనే వి డుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు ముల్కలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదు లు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. క్యూబిక్‌ మీటర్ల కొలతలు రద్దు చేసి చట్టం ప్రకారం నిర్ణయించిన వేతనాలు చెల్లించాలన్నారు. ప్రతి మనిషికి ఉపాధి జాబ్‌ కార్డు ఇవ్వాలన్నారు. కొలతలు, పనితో నిమిత్తం లేకుండా రూ.257 కూలి చెల్లించాలని కోరారు. పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పద్మావతి, జానయ్య, సత్యం, పటాన్‌, వెంకటేశ్వర్లు, నగేష్‌, లక్ష్మి, సోమన్న, లింగయ్య, యాదయ్య, మహబూబ్‌అలీ, భిక్షం, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.


భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలుచేయాలి

భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఉద్యోగికి సోమవారం అందజేశారు. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన, వారి కుటంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కిరణ్‌, నర్సమ్మ, దుర్గమ్మ, నర్సయ్య., సత్యం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T07:00:39+05:30 IST