ఇటుకపడ్డ ఆర్నెళ్లకు..

ABN , First Publish Date - 2022-05-27T06:06:10+05:30 IST

జంగారెడ్డిగూడెం బస్టాండ్‌ సమీపంలో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై నియోజకవర్గ ప్రజా ప్రతినిధి రైట్‌ హ్యాండ్‌గా పేరొందిన నాయకుడు స్పందించాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు.

ఇటుకపడ్డ ఆర్నెళ్లకు..

అక్రమ నిర్మాణాలకు రెండోసారి నోటీసులు జారీ

అంతకుమించి ముందుకు వెళ్లొద్దని కార్పొరేటర్ల హుకుం

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న టౌన్‌ ప్లానింగ్‌

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వెనకడుగు

ఆంధ్రజ్యోతి ‘కట్టరకట్టు’ కథనంతో కదలిక..

 

కలెక్టర్‌ మీకేమైనా రాసిచ్చారా ?

జంగారెడ్డిగూడెం బస్టాండ్‌ సమీపంలో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై నియోజకవర్గ  ప్రజా ప్రతినిధి రైట్‌ హ్యాండ్‌గా పేరొందిన నాయకుడు స్పందించాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ  ఆ నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు. ఎంత ఖర్చయినా పర్లేదు. అవసరమైతే ఎంత వరకైనా వెళ్లండి’ అంటూ ఆ నేత మునిసిపల్‌ అధికారులకు వివరించినట్లు సమాచారం. కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని మునిసిపల్‌ అధికారులు చెప్పగా.. ‘కలెక్టర్‌ మీకు ఏమైనా లిఖిత పూర్వకంగా రాసిచ్చారా? నోటి మాటగా చెబితేనే పనులు ఆపిం చేస్తారా? లిఖిత పూర్వకంగా రాసిచ్చినపుడు చూద్దాంలే’ అంటూ హితబోధ చేశాడని సమాచారం. చివరకు సర్లెండి.. చూద్దాం ! అంటూ నాయకుడికి మద్దతుగా నిలిచారు. 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

అక్రమ నిర్మాణాలపై కూల్చివేతల ప్రసక్తే లేదంటోంది ఏలూరు కార్పొరేషన్‌. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినా, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనలను తుంగలో తొక్కినా పర్లేదంటోంది. రాజకీయ నాయకుల కళ్లల్లో సంతోషమే మాకు ముఖ్యమంటోంది. ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో పేట్రేగిపోతో న్న అక్రమ నిర్మాణాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథ నంపై అధికారులు, నాయకుల్లో పెద్ద చర్చే జరిగింది. ఈ క్రమంలో భవన నిర్మాణాలపై ఏదొక నిర్ణయం తీసుకునేందు కు అధికారులు కదులుతుండగా.. ‘నోటీసులు మాత్రమే ఇవ్వాలి.. అంతకుమించి ఆ భవనాల జోలికి వెళ్లొద్దు’ అంటూ కొందరు కార్పొరేటర్లు కార్పొరేషన్‌కు హుకుం జారీ చేస్తున్నా రు. అలా కాదని మరో నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచా రం. నిర్మాణం ప్రారంభమైన 2–3 నెలల వ్యవధిలోనే ఆ  భవనం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా ? లేదా ? అని తెలుసుకోవడం టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ముఖ్య విధి. కానీ, ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ ఎదురుగా జరుగుతున్న పలు నిర్మాణాలు, శంకర మఠం సమీపంలో జరుగుతున్న నిర్మాణం, వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌ నిర్మాణం విషయంలో కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఇవి చేపట్టి ఆరు నెలలకుపైగా గడుస్తున్నా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, అధికారికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నామ్‌ కే వాస్తే చందాన తొలి దఫా నోటీసులు జారీచేసి చేతులు ముడుచుకున్నారు. ఈ క్రమంలో ‘కట్టర కట్టు’ అంటూ అక్రమ నిర్మాణాలపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు మళ్లీ ఆఘమేఘాల మీద రెండోసారి నోటీసులు ఇస్తున్నారు. తదుపరి కమిషనర్‌ ఆదేశించిన తర్వాత చూద్దామన్నట్టు మిన్నకుండిపోయారు. 


రాజకీయంగా ఒత్తిళ్లు

ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లకుగానూ అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లే గెలిచారు. వీరిలో చాలా మంది వార్డుల్లో అక్రమ నిర్మాణాలు శ్రుతిమించుతున్నాయి. ఇటీవల 5, 6 డివిజన్ల కార్పొరేటర్లు రోడ్డును ఆక్రమించి మరీ కల్యాణ మండపం నిర్మించేందుకు విఫలయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ క్రమంలో ప్రజాగ్రహానికి గురైన వారి ఇద్దరి వ్యవహారం పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కాయి. ఈ వివాదం సద్దుమణగక ముందే మరి కొందరు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోన్న అక్రమ నిర్మాణాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొందరు శతవిధాల కృషి చేస్తున్నారు. ఉన్నతస్థాయి నాయకులు మొదలు అధికారులతో కొందరు సిఫారసులు చేయించుకుంటుండగా, మరికొందరు రుబాబుకు దిగుతున్నారు. ఈ క్రమంలో చోద్యం చూస్తూ కూర్చోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏలూరు కార్పొరేషన్‌ పడిపోయింది. కాదూ కూడదని చర్యలకు దిగితే మరుక్షణం సంస్థాగతమైన చర్యలు లేదా బదిలీల పేరిట కఠిన చర్యలు తప్పవని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. మొత్తం మీద ఇలా సాగుతోంది.. అక్రమ నిర్మాణాల భాగోతం..!

Updated Date - 2022-05-27T06:06:10+05:30 IST