భలే మంచి చౌకబేరం.. రేషన్ షాపులే అడ్డాగా కొత్త వ్యాపారం..!

ABN , First Publish Date - 2020-09-21T15:32:22+05:30 IST

ప్రకాశం జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. డీలర్లు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. పర్యవసానంగా గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మారిపోయాయి.

భలే మంచి చౌకబేరం.. రేషన్ షాపులే అడ్డాగా కొత్త వ్యాపారం..!

రేషన్‌ షాపు.. భలే మంచి చౌకబేరం

నగదు బదిలీ కేంద్రాలుగా రేషన్‌ దుకాణాలు 

పట్టణాల్లో బియ్యానికి బదులు చిల్లర సరుకులు

నెలవారీ కేటాయిస్తున్న వాటిల్లో 80శాతం పక్కదారి

కొంత రీసైక్లింగ్‌ చేసి విక్రయం.. మిగిలినది మళ్లీ ఎఫ్‌సీఐకి

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవహారం  


అద్దంకి(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. డీలర్లు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. పర్యవసానంగా గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మారిపోయాయి. పట్టణాల్లో రేషన్‌ బియ్యానికి బదులు కార్డుదారులకు అవసరమైన నిత్యావసర సరుకులను ఇస్తున్నారు. ఇలా వివిధ మార్గాల్లో తాము సేకరించిన బియ్యాన్ని డీలర్‌లు, వ్యాపారులు, మిల్లర్లకు అధిక ధరకు అమ్ముకుంటున్నారు. వారు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి గోతాలు మార్చి కొంత బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మిగిలినవి మళ్లీ ఎఫ్‌సీఐకు అమ్ముతున్నారు. నెలనెలా ప్రభుత్వం కేటాయిస్తున్న బియ్యంలో 80 శాతం వరకూ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు అంచనా. ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. కొందరు ప్రత్యక్షంగా ఈ వ్యవహారంలో పాలుపంచుకొంటుండగా, మరికొందరు పరోక్షంగా భాగస్వామ్యమవుతున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలిచి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


రేషన్‌ దుకాణాల్లో ప్రభుత్వం ఇచ్చే బియ్యా న్ని కార్డుదారులు వ్యాపారులకు అమ్ముకోవటం గతంలో జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మారిపోయాయి. పట్టణాల్లో రేషన్‌ బియ్యంకు బదులు కార్డుదారులకు అవసరమైన నిత్యావసర సరుకులను ఇస్తూ వస్తుమార్పిడి విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,151 రేషన్‌ దుకాణాల ద్వారా సుమారు 10.13లక్షల మం ది కార్డుదారులకు సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్‌డీలర్లు అత్యధికశాతం అధికారపార్టీకి చెందిన నాయకుల కుటుంబసభ్యులు, బం ధువులే ఉంటారు. కొద్దిమంది డీలర్లు మాత్ర మే ప్రత్యేక పరిస్థితులతో తటస్థులు, ప్రతిపక్షానికి చెందిన వారు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీ నాయకులు, రేషన్‌షాపుల డీలర్ల కనుసన్నల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నోరు ఉన్న అధికారపార్టీ డీలర్‌ అయితే ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. 


కలిసొచ్చిన కొవిడ్‌ రేషన్‌

లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నెలకు రెండుసార్లు రేషన్‌ సరుకులు పంపిణీ జరుగుతుండటంతో  బియ్యం వ్యాపారం మరింత జోరందుకుంది.  గతంలో రేషన్‌ షాపుల డీలర్ల వద్ద నుంచి బియ్యం కొనుగోలు చేసే దళారులు ఒక్కో మండలంలో నలుగురైదుగురు ఉండగా, ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే చక్రం తిప్పుతున్నారు. దీంతో వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. గతంలో  వ్యాపారుల మధ్య పోటీతో అధికారులకు అప్పుడప్పుడూ సమాచారం అందడం ద్వారా అక్రమంగా తరలిపోయే రేషన్‌ బియ్యం పట్టుబడేవి. ప్రస్తుతం అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే బియ్యం చిక్కుతున్నాయి. ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు   రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘాను గాలికి వదిలేశారు. కేవలం ప్రతిపక్షానికి చెందిన డీలర్లను టార్గెట్‌ చేస్తూ చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 


కందిపప్పు, శనగలు ఓకే..

జిల్లావ్యాప్తంగా 70 నుంచి 80శాతం రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు తీసుకోకుండానే డీలర్లు, ఇతర కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. డీలర్ల వద్ద  నుంచి దళారులు కిలోకు రూ.13 నుంచి రూ.14 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వాటిని లీజుకు తీసుకున్న రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఎఫ్‌సీఐకి మిల్లర్లు సరఫరా చేస్తున్నారు.  ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో బియ్యం, కందిపప్పు లేదా శనగలు, పంచదార పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులు కేవలం కందిపప్పు, లేదా శనగలు మాత్రమే తీసుకుంటున్నారు. బియ్యంకు బదులు నగదు తీసుకుంటున్నారు. పంచదార ధర మార్కెట్‌ ధరకు, డీలర్‌ ఇచ్చేదానికి పెద్ద వ్యత్యాసం లేకపోవడంతో దానిని తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్‌ బియ్యం అక్రమ కొనుగోలు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


అంతా అధికార పార్టీ నాయకులే

రేషన్‌ షాపుల డీలర్ల వద్ద నుంచి బియ్యం కొనుగోలు చేసే మధ్యవర్తులందరూ అధికారపార్టీకి చెందిన ప్రధాన నాయకులే ఉన్నారు. దీంతో రేషన్‌ బియ్యం పంపిణీకి స్వస్తి చెప్పి, నగదు బదిలీని అనధికారికంగా నిర్వహిస్తున్నారు. రేషన్‌ డీలర్‌లు కిలో రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అద్దంకిలో అత్యధిక రేషన్‌షాపులలో రేషన్‌ బియ్యంను డీలర్లే కొనుగోలు చేసి వాటికి బదులుగా వేరుశనగ పప్పు, శనగపప్పు, పామాయిల్‌, గోధుమపిండి, ఇడ్లీరవ్వ తదితర వస్తువులను లబ్ధిదారులకు ఇస్తున్నారు. దీని ద్వారా అటు రేషన్‌ బియ్యం కొనుగోలు, ఇటు సరుకుల అమ్మకం ద్వారా రెట్టింపు లాభం పొందుతున్నారు. 

Updated Date - 2020-09-21T15:32:22+05:30 IST