అక్రమంగా మట్టి తరలింపు

ABN , First Publish Date - 2022-09-26T04:52:53+05:30 IST

ప్రభుత్వం మట్టి, ఇసుక రవాణాపై కఠిన నిబంధనలు విధించినా మట్టి మాఫియా మాత్రం విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అక్రమంగా మట్టి తరలింపు
నరసయ్యబండ కాలనీ సమీపంలోని చెరువులో మట్టిని ట్రాక్టర్లకు లోడ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడేనా...?!

సెలవు రోజులలో జోరుగా మట్టి రవాణా


గుర్రంకొండ, సెప్టెంబరు 25: ప్రభుత్వం మట్టి, ఇసుక రవాణాపై కఠిన నిబంధనలు విధించినా మట్టి మాఫియా మాత్రం విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సెలవు రోజులలో అక్రమార్కులు రెచ్చిపోతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో యథేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఎక్స్‌కవేటర్లతో మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సెలవు దినాలలో అధికారులు ఉండరనే ఉద్దేశ్యంతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. మట్టి అక్రమ తరలింపుపై అధికారులకు ప్రజలు, రైతులు చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గుర్రంకొండ మార్కెట్‌ యార్డు సమీపంలోని నరసయ్యబండ సమీపంలోని చెరువులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్స్‌కవేటర్‌ సాయంతో ట్రాక్టర్లలో మట్టిని యథేచ్చగా తరలించారు. మట్టిని అక్రమంగా తరలిస్తునారని రెవెన్యూ అధికారులకు రైతులు చెప్పినా పట్టించుకోలేదని పలువురు రైతులు తెలిపారు. కొందరు అధికారుల అండదండలతోనే ఇష్టానుసారంగా మట్టిని తోలుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహశీల్దార్‌ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా మట్టి తరలింపు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములలో మట్టిని తరలించరాదని ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-09-26T04:52:53+05:30 IST