టీచర్ల అక్రమ బదిలీలు మళ్లీ షురూ!

ABN , First Publish Date - 2022-06-25T04:43:30+05:30 IST

పాఠశాల విద్యాశాఖలో మళ్లీ అక్రమ బదిలీల దందా షురూ అయింది.

టీచర్ల అక్రమ బదిలీలు మళ్లీ షురూ!

  • 317 జీవోకు వక్రభాష్యం
  • నేతల సిఫారసులు.. కదులుతున్న ఫైళ్లు
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దొడ్డిదారిన 9 మంది టీచర్లు!
  • ఇప్పటికే కొందరికి పోస్టింగ్‌లు 
  • భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు
  • తక్షణమే అక్రమ బదిలీలు రద్దు చేయాలని  డిమాండ్‌


పాఠశాల విద్యాశాఖలో మళ్లీ అక్రమ బదిలీల దందా షురూ అయింది. నేతల సిఫారసుతో నల్లగొండ నుంచి రంగారెడ్డి జిల్లాకు అంతర్‌ జిల్లా బదిలీలకు తెరలేపారు. 317 జీవోకు వక్రభాష్యం చెబుతూ ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు పెద్దఎత్తున అక్రమ బదిలీలు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి. 


రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 24 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లా బదిలీలో అవకతవకలు జరుగుతున్నాయి. నేతల సిఫారసులతో అధికారులు ఫైళ్లు కదిలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరికి అక్రమంగా పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో ఆరుగురు, మేడ్చల్‌ జిల్లాకు ముగ్గురిని అక్రమంగా బదిలీ చేశారు. ఇందులో కొందరికి గుట్టుచప్పుడు కాకుండా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఉత్తర్వుల కాపీలను కూడా విద్యాశాఖ అధికారులు బయటపెట్టడం లేదు. అదేమంటే ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రంగారెడ్డిజిల్లాలో నల్గొండ నుంచి వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి సరూర్‌నగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. మరో అయిదుగురికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అలాగే మేడ్చల్‌ జిల్లాకు కూడా ఇతర జిల్లాల నుంచి ముగ్గురిని బదిలీ చేశారు. వికారాబాద్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన వారిని మేడ్చల్‌ జిల్లాకు బదిలీ చేశారు. విచిత్రమేమిటంటే ఈ బదిలీలన్నీ కూడా నగరం నడిబొడ్డు ప్రాంతాలకే చేయడం గమనార్హం. డీడీఆర్సీ తీర్మానాలు, లోకాయుక్త పిటీషన్లను తుంగలో తొక్కి యథేచ్ఛగా బదిలీలకు తెరతీయడం సరైన విధానం కాదంటున్నారు. ప్రభుత్వం సాధారణ బదిలీలు జరపక నాలుగు సంవత్సరాలైందని, ఇప్పటికైనా సాధారణ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎంపీపీ/జడ్పీపీ- తెలుగు) పనిచేస్తున్న మునగాల మహిపాల్‌రెడ్డి సరూర్‌నగర్‌ మండలం ఎంపీపీఎస్‌ ఎన్టీఆర్‌నగర్‌ స్కూల్‌కు బదిలీ చేశారు. జీవో ఎంఎస్‌ నెంబరు 317 ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట పరిధిలోనే కేటాయించాల్సి ఉండగా.. రంగారెడ్డి జిల్లాకు కేటాయించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా ఎంతోమంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అంతర్‌ జిల్లా బదిలీలో మరో ఏడుగురు ఉపాధ్యాయులను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. అక్రమ ఉపాధ్యాయ బదిలీలను వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం పైరవీల ద్వారా బదిలీలకు తెరతీయడం శోచనీయమంటున్నారు. అక్రమ బదిలీలను ఆపకుంటే ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని స్థానికేతరుల కోటా సంఖ్య 45 శాతానికి మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీలకు సంబంధించిన నోట్‌ ఫైల్స్‌ ఉత్తర్వుల పత్రాలను డీఈఓ కార్యాలయం బయటపెట్టేందుకు నిరాకరించడం అనుమానాలకు తావిస్తోందని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు మాణిక్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు బయటపెట్టకపోవడంతో డీఈవోనే ఈ బదిలీలు చేస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తుందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి జిల్లా టీచర్లు ఇప్పటికే అక్రమబదిలీల వల్ల ఎంతో నష్టపోయారని మళ్లీ ఇప్పుడు దొడ్డిదారిన మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఇక్కడ టీచర్లను అవమానించడమేనన్నారు. 


గవర్నమెంట్‌ ఆర్డర్‌ అంతే.. : సుశీందర్‌రావు, డీఈవో 

నల్లగొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు మునగాల మహిపాల్‌రెడ్డి సరూర్‌నగర్‌ మండలం ఎంపీపీఎస్‌ ఎన్టీఆర్‌ నగర్‌ స్కూల్‌కు బదిలీ విషయమై జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావును ఆంధ్రజ్యోతి ప్రతినిధి వివరణ కోరగా.. నేనేమి వివరణ ఇవ్వలేను.. బదిలీలు ప్రభుత్వ పరంగా జరుగుతాయి.. నాకు తెలియదు.. గవర్నమెంట్‌ ఆర్డర్‌ను నేను ఇంప్లిమెంటేషన్‌ చేస్తాను అంతే. అని ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమ బదిలీలు పది వరకు వచ్చాయనే విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లగా అలాంటిది ఏమి లేదు. ఒక్కటే బదిలీ వచ్చిందని ఆయన సమాధానమిచ్చారు. 


పలుకుబడి, పైరవీలకు ఏ నిబంధనలూ అడ్డురావు

భార్య, భర్త గోడు పట్టదు. పలు నిబంధనలు విధించి పరస్పర బదిలీలకు అనుమతించడం లేదు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కోర్టు తీర్పులను ఖాతరు చేయడం లేదు. స్పెషల్‌ కేటగిరి అప్పీల్స్‌ పరిష్కారం చేయరు కానీ.. పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలకు మాత్రం ఏ నిబంధనలు అడ్డురావడం లేదు. స్పౌజ్‌కు బ్లాక్‌ చేసిన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు పైరవీ బదిలీల వరద కొనసాగుతుంది. ఇది అన్యాయం. 

- గాలయ్య, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి 


అక్రమ బదిలీలు రద్దు చేయకుంటే ఉద్యమమే..

అక్రమ బదిలీలను రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉం టుంది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ప్రాతినిథ్యం వహి స్తున్న జిల్లాకే ఇలాంటి బదిలీ జరగడం శోచనీయం. 317 జీవోతో అలోకేషన్‌లో భాగంగా ప్రభుత్వం దొడ్డిదారి బది లీలకు తెరతీయడం మంచిది కాదని, అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి. లేదంటే.. ఉద్యమం తప్పదు.

- ఏవి.సుధాకర్‌, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు


అక్రమ బదిలీలు రద్దు చేయాలి

అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి. సక్రమ బదిలీలు వెంటనే చేపట్టాలి. పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలకు ఏ నిబంధనలకు  అడ్డురావు. బ్లాక్‌ చేసిన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు పక్క జిల్లాల నుంచి పైరవీల బదిలీల వరద కొనసాగుతుంది. ఇది అన్యాయం. 

- సత్తారి రాజిరెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి 


తక్షణమే ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వం చేస్తున్న అక్రమ బదిలీల వల్ల స్థానిక టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 317జీవోకు కొత్త భాష్యం చెబుతూ సర్కార్‌ ఇచ్చిన జీవో వల్ల స్థానికత కలిగిన ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం.

- బొడ్డురవి, టీపీయూఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి



Updated Date - 2022-06-25T04:43:30+05:30 IST