మట్టి మాఫియా!

ABN , First Publish Date - 2021-11-01T06:38:33+05:30 IST

లీజు మాటున మట్టి మాఫియా పేట్రేగిపోతోంది.

మట్టి మాఫియా!
పాతపాడు - పి.నైనవరం మధ్యలో మట్టిమాఫియా తవ్విన పోలవరం కాల్వ కట్ట

పోలవరం మట్టి లీజు మాటున అక్రమార్కులు

కాల్వకట్టకు నిలువునా కోత

సమీప తోటల్లోనూ మట్టి తవ్వకాలు

అర్ధరాత్రి అక్రమంగా లారీల్లో తరలింపు

బినామీ పేర్లతో లీజుకు తీసుకుంటున్న నేతలు

పోలవరం ప్రాజెక్టు అధికారులకూ వాటా

పాతపాడు, నైనవరం, నున్నలో ఆనవాళ్లులేని కాల్వకట్ట


లీజు మాటున మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై పోలవరం కాల్వకట్టను పూర్తిగా తొలిచేస్తున్నారు. అంతటితో ఆగక పక్కనే ఉన్న రైతుల పట్టా భూములు, రెవెన్యూ, రిజర్వు ఫారెస్టు కొండలనుసైతం అక్రమంగా తవ్వేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుపుతూ, వందలాది టిప్పర్లలో మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు బినామీ పేర్లతో పోలవరం కాల్వ మట్టిని తవ్వుకునేందుకు అనుమతి తీసుకుంటుండగా, అందులో పోలవరం ప్రాజెక్టు అధికారులూ వాటాదారులుగా ఉండటమే ఇక్కడ కొసమెరుపు. 


విజయవాడ రూరల్‌, అక్టోబరు 31 : విజయవాడ రూరల్‌ మండలంలోని పాతపాడు, పి.నైనవరం, నున్న ప్రాంతాల్లో పోలవరం కాల్వకట్ట ఆనవాళ్లు కూడా కనిపించడంలేదు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ రాజధానిగా మారటంతో నగరం చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. ఆ వెంచర్లను మెరక చేసుకునే పేరిట కొంతమంది నాయకులు పోలవరం కాల్వ మట్టిని తవ్వుకునేందుకు అనుమతి తీసుకుంటున్నారు. నాలుగైదు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకానికి అనుమతి తీసుకుంటూ, ఏకంగా 30 వేల నుంచి 50 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు అక్రమంగా తవ్వేస్తున్నారు. కాల్వకట్ట పక్కనే ఉన్న రైతుల పట్టా భూములను, రెవెన్యూ, రిజర్వు ఫారెస్టు కొండలను సైతం మట్టి మాఫియా వదలడం లేదు. పాతపాడు - పి.నైనవరం మధ్యలో పోలవరం కాల్వకట్ట లూజు మట్టిని 4,800 క్యూబిక్‌ మీటర్లను తరలించుకునేందుకు ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పోలవరం ప్రాజెక్టు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. సదరు వ్యక్తి మరికొందరితో కలిసి సిండికేట్‌గా ఏర్పడి, వారం క్రితం అర్ధరాత్రి సమయంలో పది ఎక్స్‌కవేటర్లతో పోలవరం కాల్వకట్టతోపాటు పక్కనే ఉన్న రైతుల పొలాల్లోని మట్టిని వంద టిప్పర్లతో తరలించేశాడు. స్థానికులు గుర్తించే అవకాశం ఉండటంతో టిప్పర్లను ఒకవైపు నుంచి కాల్వకట్ట అవతలకు పంపించి, మరోమార్గం నుంచి మట్టిని విజయవాడ పరిసర ప్రాంతాలకు తరలించేశారు. 


కంగుతిన్న  రైతు

ఇటీవలే స్థానిక రైతు ఒకరు తన తోటలో పది అడుగుల లోతునతవ్వి ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు చుట్టుపక్కల ఉన్న రైతులను కలుపుకుని అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాటు వేశారు. మట్టి మాఫియా టిప్పర్లలోకి పోలవరం కాల్వకట్ట మట్టితోపాటు, తమ తోటల్లో తవ్విన మట్టిని కూడా లోడు చేస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమ భూములను ఎందుకు తవ్వుతున్నారంటూ నిలదీశారు. అప్పటికే సుమారు 30 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆయా గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు సైతం మట్టి తవ్వకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మరింత పెద్దదయ్యే అవకాశం ఉండటంతో మట్టి మాఫియా, విజయవాడ నగరంలోని అధికార పార్టీకి చెందిన మరో బడా నేతను ఆశ్రయించి, తవ్విన పొలాలను మళ్లీ మెరక చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, అంతలోతు పూడ్చేందుకు మాఫియా మళ్లీ ఎక్కడ తవ్వకాలు జరుపుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


అనుమతుల్లేకుండానే..

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను మెరక చేసుకునేందుకు పోలవరం కాల్వకట్ట మట్టి అనువుగా ఉండటంతో, అనుమతుల్లేకుండా మరికొందరు అక్రమంగా తవ్వేసి, తరలిస్తున్నారు. నున్న, పాతపాడు, పి.నైనవరం ప్రాంతాల్లో నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో రాత్రివేళ అక్రమంగా తవ్విన మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం పోలవరం ప్రాజెక్టు అధికారులకు, పోలీసులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పోలవరం కాల్వ అధికారులు నిత్యం నున్న, పాతపాడు, పి నైనవరం గ్రామాలకు వెళుతున్నా, తవ్వకాలను పట్టించుకోకపోవడం గమనార్హం. 



Updated Date - 2021-11-01T06:38:33+05:30 IST