అదిగో జాగా.. వేసేయ్‌ పాగా!

ABN , First Publish Date - 2021-03-07T05:10:07+05:30 IST

పట్టణీకరణ పుణ్యమా అని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు, పిల్లల చదువులకు అందరూ పట్టణాల బాట పడుతున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో భూములకు డిమాండ్‌ ఏర్పడింది. దీనిని అదునుగా చేసుకొని కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. మరికొంతమంది ప్రభుత్వ భూముల్లో సైతం నిర్మాణాలు చేస్తున్నారు. చెరువులు, కాలువల కబ్జాకు పాల్పడుతున్నారు.

అదిగో జాగా.. వేసేయ్‌ పాగా!
కొండపోరంబోకు భూమిలో ఆక్రమణలు

ప్రభుత్వ భూములను వదలని అక్రమార్కులు
మునిసిపాలిటీల్లోని చెరువులు, కాలువలు కబ్జా
నగర పంచాయతీల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
దృష్టి సారించని అధికారులు
(పలాస)

పట్టణీకరణ పుణ్యమా అని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు, పిల్లల చదువులకు అందరూ పట్టణాల బాట పడుతున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో భూములకు డిమాండ్‌ ఏర్పడింది. దీనిని అదునుగా చేసుకొని కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. మరికొంతమంది ప్రభుత్వ భూముల్లో సైతం నిర్మాణాలు చేస్తున్నారు. చెరువులు, కాలువల కబ్జాకు పాల్పడుతున్నారు.
------------------
పట్టణ ప్రాంతాల్లో భూములపై అక్రమార్కులు కన్నేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీలు ఉన్నాయి. వీటితో పాటు నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పాతపట్నం వంటి పట్టణాలు విద్య, వైద్య, వాణిజ్యరంగాల్లో అభివృద్ధి సాధించాయి. దీంతో ఎక్కువ మంది ఈ పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలురాగా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. పట్టణాల చుట్టూ ఉండే చెరువులు, పరిసర గ్రామాల్లో పొలాలకు సాగునీరందించే కాలువలు అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నాయి.  జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 60 ఎకరాలకు పైగా చెరువులు ఉన్నాయి. వాటి పరిధిలో కాలువలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.
- పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో సర్వే నెంబరు 151లో ఉన్న రెండున్నర ఎకరాల కొండపోరంబోకు (వర్షాకాలంలో కొండనుంచి వచ్చే నీరు కాలువగా మారిన ప్రాంతం) భూమి పూర్తిగా కబ్జాలకు గురైంది. దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే ఒకటిన్నర ఎకరాల్లో పక్కా గృహాలు వెలిశాయి. మిగిలిన ఖాళీ భూములను కూడా విక్రయానికి పెట్టడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
- మొగిలిపాడు గ్రామానికి ఆనుకొని జాతీయర హదారి బైపాస్‌ రోడ్డు వద్ద రోడ్డు వేయగా...మిగిలిన చెరువు ఖాళీ స్థలాన్ని పక్కాగా అమ్మకానికి పెట్టారు. పునాదులు వేసి పక్కాగా అమ్ముతున్నారు. కొంతభాగాన్ని అధికారులు గుర్తించి రూరల్‌ పోలీస్టేషన్‌కు స్థలాన్ని ఇక్కడ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన కొంతభాగం కూడా కబ్జాలకు గురవుతోంది.
- ఎర్రచెరువు గర్భం కూడా కబ్జాకు గురవుతోంది. ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు.

 రాజాంలో



రాజాం నగర పంచాయతీలో మొత్తం 20 ఎకరాలకు పైగా చెరువులు, కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గుర్రాలచెరువు, ఎర్రచెరువు, తామరచెరువులతో పాటు కాలువలు, బందలు కూడా మాయమవుతూ వెంచర్లుగా మారుతున్నాయి. ఇక్కడ ఎకరా స్థలం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల ధర పలుకుతుండడంతో కబ్జాదారులు చెరువు భూములపై కన్నేశారు. ఆక్రమణదారులను గుర్తించి తహసీల్దారు కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లినా యథేచ్ఛగా కబ్జాలు కొనసాగుతుండడం విశేషం.

 పాలకొండలో


పాలకొండ నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.2 నుంచి రూ.20 కోట్ల వరకూ పలుకుతుండడంతో చెరువులు, కాలువలను పూర్తిగా మాయం చేస్తున్నారు. పాతలవానిబంద, బావికట్టువీధి చెరువుతో పాటు పాలకొండ గ్రామానికి వెళ్తే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పంట కాలువలను సైతం కబ్జాదారులు విడిచిపెట్టడం లేదు. దీంతో ఆయకట్టుకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటిల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. 15 ఎకరాల వరకూ చెరువులు కబ్జాలకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది.

 ఆక్రమణలు గుర్తించాం
పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో ఆక్రమణలు గుర్తించాం. దీనిపై సమగ్ర నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందించాం ఆక్రమణలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటాం. ఎన్నికల అనంతరం ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం.
-డి.రాజగోపాలరావు, మునిసిపల్‌ కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ

Updated Date - 2021-03-07T05:10:07+05:30 IST