ప్రత్తిపాడులో.. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

ABN , First Publish Date - 2021-04-23T05:36:52+05:30 IST

ఓ వైద్యుడు వైద్యం చేయాలన్నా.. ఆస్పత్రి నిర్వహించాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. అయితే అలాంటివి ఏవీ లేకుండానే రెండేళ్లుగా ప్రత్తిపాడు బస్టాండు ఎదురు సంజీవిని క్లీనిక్‌ పేరుతో డాక్టర్‌ వలి హాస్పిటల్‌ను నడుపుతున్నట్లు కొవిడ్‌ తనిఖీల్లో తేలింది.

ప్రత్తిపాడులో.. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌
వలిని ప్రశ్నిస్తున్న సీహెచ్‌సీ వైద్యుడు చలపతిరావు, డీటీ ప్రశాంతి, హాస్పిటల్‌

అనుమతి లేకుండానే రెండేళ్లుగా ఆస్పత్రి 

కొవిడ్‌ తనిఖీల్లో వెలుగుచూసిన వలి వ్యవహారం 

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 22: ఓ వైద్యుడు వైద్యం చేయాలన్నా.. ఆస్పత్రి నిర్వహించాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. అయితే అలాంటివి ఏవీ లేకుండానే రెండేళ్లుగా ప్రత్తిపాడు బస్టాండు ఎదురు  సంజీవిని క్లీనిక్‌ పేరుతో వలి హాస్పిటల్‌ను నడుపుతున్నట్లు కొవిడ్‌ తనిఖీల్లో తేలింది. ఈ వైద్యశాలలో నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్‌, ఎక్సరే, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైద్యశాల వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. ఈ వైద్యశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడమే కాకుండా ట్రీట్‌మెంట్‌ కూడా చేస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అసలు ఆస్పత్రికి అనుమతులే లేవన్న విషయం వెలుగుచూసింది.  అంతే కాకుండా ఈ వైద్యుడికి భారత దేశంలో వైద్యం చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. వలికి ఉక్రెయిన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పొందినట్టు సర్టిఫికెట్‌ ఉంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం   రెండు సార్లు పరీక్షలు రాసి తప్పినట్టు వలి అధికారులకు తెలిపారు. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్‌ నడుపుతుండటంపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాయి సంజీవిని పాలీక్లీనిక్‌, సురక్ష డయాబెటిక్‌ సెంటర్‌, ఉషా డయాగ్నస్టిక్‌ సెంటర్ల పేరుతో పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి మరీ వైద్యశాల నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ వైద్యుడు చేసిన వైద్యం వికటించిన నేపథ్యంలో గొడవలు, పంచాయతీలు జరిగి డబ్బులు కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. తహసీల్దారు పూర్ణచంద్రరావు ఆదేశాల మేరకు డీటీ ప్రశాంతి, సామాజిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు చలపతిరావు, సిబ్బంది  తనిఖీలు నిర్వహించారు. 

 

Updated Date - 2021-04-23T05:36:52+05:30 IST