ఈహెచ్‌ఎస్‌కు అనారోగ్యం!

ABN , First Publish Date - 2022-05-17T08:30:10+05:30 IST

ఒకవైపు ఈహెచ్‌ఎ్‌స(ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) పనిచేయదు.. మరోవైపు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుందామనుకుంటే.

ఈహెచ్‌ఎస్‌కు అనారోగ్యం!

  • పథకం పనిచేయదు.. రీయింబర్స్‌మెంట్‌ రాదు
  • ప్రైవేటు ఆస్పత్రుల గుర్తింపు రెన్యువల్స్‌ పెండింగ్‌
  • కొత్త వాటికీ మంజూరు కాని అనుమతులు
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఉద్యోగులకు తీవ్ర ఇక్కట్ల


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఈహెచ్‌ఎస్‌(ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) పనిచేయదు.. మరోవైపు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుందామనుకుంటే.. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతులను రెన్యువల్‌ చేయదు. ఎలాగోలా కష్టపడి ఏదో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే.. నెలలు గడిచినా రీయింబర్స్‌మెంట్‌ రాదు.. ఇవీ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల పాట్లు.. అసలే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు సర్కారు నిర్లక్ష్య వైఖరి చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందించేందుకు సర్కారు నుంచి గుర్తింపు పొందాయి. కొంతకాలంగా ఈహెచ్‌ఎస్‌ కార్డు పనిచేయకపోవడంతో మెజారిటీ ఉద్యోగులంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. అనంతరం రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు సర్కారీ ఉద్యోగులకు వైద్యం చేసే గుర్తింపు రెన్యువల్‌ ప్రక్రియను వైద్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే కొత్తగా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న వాటికీ వైద్య శాఖ అనుమతులివ్వడం లేదు. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌ కార్డులను ఆస్పత్రులు అంగీకరించడం లేదు. దీంతో ఉద్యోగులు డబ్బులిచ్చి చికిత్స చేయించుకుని, తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేసుకుంటున్నారు. దీనికి కూడా తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగులు డబ్బులిచ్చి వైద్యం చేయించుకున్నా.. ఆ ఆస్పత్రులు వైద్య విద్య సంచాలకుల నుంచి అనుమతులు పొంది ఉండాలి. చికిత్స అనంతరం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. పెట్టిన ఖర్చులో రూ.లక్ష వరకు తిరిగి వస్తుంది. కేన్సర్‌, కిడ్నీ, గుండె సంబంధిత జబ్బులున్న వారికి రూ.2 లక్షల వరకు రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఏ ఆస్పత్రులకు అనుమతి ఉందో ఉద్యోగులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఒకవేళ రెన్యువల్‌ కాని, రిజిస్ట్రేషన్‌ చేసుకోని ఆస్పత్రుల్లో చికిత్స పొందితే డబ్బులు రావు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగులు, 2లక్షల మంది విశ్రాంత ఉద్యోగులున్నారు. వీరి డిపెండెంట్స్‌ను కలిపితే మొత్తం 18-20 లక్షల వరకు ఉంటారు.


రెన్యువల్‌ కాని గుర్తింపు.. 

ఉద్యోగులకు వైద్యం అందించే ప్రైవేటు ఆస్పత్రులు ముందుగా వైద్య శాఖ నుంచి గుర్తింపు పొందాలి. ఆ గుర్తింపును మూడేళ్లకోసారి రెన్యువల్‌ చేయించుకోవాలి. ఇలా గుర్తింపు ఉన్న వాటిలోనే ఉద్యోగులు వైద్యం చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే వారు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గుర్తింపు లేని, రెన్యువల్‌ కాని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆ బిల్లులు రావు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్‌ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 వరకు ఉన్నాయి. తమ అనుమతులను రెన్యువల్‌ చేయాలని ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నాయి. వీటికి వైద్య విద్య సంచాలకులు అనుమతులివ్వాలి. తనిఖీల పేరిట బాగా ఆలస్యం చేస్తున్నారని, సకాలంలో రెన్యువల్‌ చేయడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటికీ ఇదే పరిస్థితి ఉందని అంటున్నాయి.


50 వేల రీయింబర్స్‌మెంట్‌ ఫైల్స్‌ పెండింగ్‌

ప్రభుత్వంలోని వివిధ విభాగాల నుంచి ప్రతి నెలా 5 వేలకుపైగా రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులు వైద్య విద్య సంచాలకుల కార్యాలయానికి వస్తాయి. అవి నిర్ణీత ప్రమాణాల మేరకు ఉన్నాయో..లేదో.. డీఎంఈ కార్యాలయం తనిఖీ చేస్తుంది. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటికి బిల్లులు మంజూరు చేసి ఉద్యోగుల మాతృశాఖకు పంపుతుంది. ఇక ఆస్పత్రుల్లో చేసే ప్రతి సర్జరీకి ప్రభుత్వం ఒక ప్యాకేజ్‌ ధర ఖరారు చేస్తుంది. దాని ప్రకారమే రీయింబర్స్‌మెంట్‌ను నిర్ణయిస్తారు. కాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక సర్జరీకి ఉండే ప్యాకేజ్‌ ధరకు, సర్కారు చెల్లించే ధరకు చాలా వ్యత్యాసం ఉంటోందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం 5-6 నెలల రీయింబర్స్‌మెంట్‌ పైళ్లు పెండింగ్‌ ఉన్నాయని.. సుమారు 50 వేల దరఖాస్తులను క్లియర్‌ చేయాల్సి ఉందని చెబుతున్నారు.


రెండేళ్ల కిందట దరఖాస్తు చేసుకున్నా 

ఉద్యోగులకు వైద్యం అందించే గుర్తింపు అనుమతుల రెండేళ్ల క్రితం దరఖాస్తు చేశాం. కొవిడ్‌ వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది. కొద్ది నెలలుగా అనుమతుల కోసం డీఎంఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, కొత్త వాటికి అనుమతి ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. అలాగే గుర్తింపు ఉన్న వాటికి కూడా రెన్యువల్‌ చేయడం లేదని ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. 

- ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం, హైదరాబాద్‌


అన్నీ ఒకేసారి రెన్యువల్‌కు రావు 

ప్రైవేటు ఆస్పత్రులు ఐదు శాతం మంత్రి బీపీఎల్‌ రోగులకు ఉచితంగా చికిత్స ఇవ్వాలనే జీవో ఉంది. అది సరిగా అమలు కావడంలేదు. ఈ విషయంలో డీఎంహెచ్‌వోలకు కొన్ని అధికారాలు ఇస్తే బాగుంటుందని సర్కారు యోచిస్తోంది. వారి సిఫారసుల ద్వారా వెళితే ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స అందించాలి. అందుకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. జీవో వచ్చిన తర్వాత గుర్తింపు అనుమతుల రెన్యువల్స్‌తో పాటు కొత్త వాటికి కూడా అనుమతిలిస్తాం. ప్రస్తుతం మన దగ్గర 500 ఆస్పత్రులున్నాయి. అన్నీ ఒకేసారి రెన్యువల్‌కు రావు. ఏటా కొన్ని రెన్యువల్‌ అవుతున్నాయి.

- డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకులు

Updated Date - 2022-05-17T08:30:10+05:30 IST