‘చిత్ర’..హింసలు

ABN , First Publish Date - 2022-06-28T05:03:54+05:30 IST

ప్రభుత్వ తీరు సినిమా థియేటర్ల యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా అమల్లోకి తెస్తున్న జీవో నెం బర్‌.69పై వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘చిత్ర’..హింసలు
టంగుటూరులోని శ్రీనివాస థియేటరు

కొత్త జీవోపై సినిమా థియేటర్ల యజమానుల్లో ఆందోళన

అంగీకార పత్రంపై సంతకానికి విముఖత

అధికారులు ఒత్తిడి చేస్తారని ముందుగానే మూసివేత

టికెట్ల సొమ్ము తిరిగి చెల్లింపుపై స్పష్టత కరువు 


టంగుటూరు, జూన్‌ 27 : ప్రభుత్వ తీరు సినిమా థియేటర్ల యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా అమల్లోకి తెస్తున్న జీవో నెం బర్‌.69పై వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంగీకారపత్రాలపై సంతకాల కోసం అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగానే థియేటర్లను మూసివేస్తున్నారు. వారం నుంచి టంగుటూరులోని మూడు థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాము రూపొందించిన పోర్టల్‌ ద్వారానే సినిమా టికెట్లు విక్రయించాలంటూ జీవో నెం.69 విడుద ల చేసింది. దీని ప్రకారం సినిమా టికెట్లు విక్రయిస్తే ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వానికి జమ అవుతాయి. ప్రభుత్వం ఒక్కో టికెట్‌కు 2 శాతం కమీషన్‌ మినహాయించుకొని మిగిలిన నగదును హాళ్ల యజమానుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. వచ్చే నెల 1 నుంచి ఈకొత్త జీవో అమల్లోకి రానుంది. దీనిపై థియేటర్ల యజమానులు విముఖత చూపుతున్నారు. 


అంగీకార పత్రాలపై సంతకాల సేకరణ

ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం సినిమా టికెట్లు విక్రయిస్తామంటూ ముందుగానే జిల్లా ఉన్నతాధికారులు సినిమాహాళ్ల యాజమాన్యాల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ఇరువర్గాల అంగీకార పత్రాలపై సంతకాల సేకరణ చేపట్టారు. జీవో అమలుకు సమయం ఉన్నా అధికారులు ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతకాలు చేసేందుకు ఇష్టం లేని సినిమా హాళ్ల యాజమాన్యాలు అధికారులు వచ్చి ఒత్తిడి చేస్తారన్న భయంతో ప్రదర్శనలను ముందుగానే నిలిపివేసి  గేట్లకు తాళాలు వేశారు.


భయం అంతా తిరిగి నగదు చెల్లింపుపైనే

పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తే ప్రభుత్వానికి వెళ్లే నగదు తిరిగి తమకు ఎప్పుడు అందుతుందోనని అన్ని హాళ్ల యాజమానులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం సినిమా టికెట్ల ద్వారా తీసుకున్న సొమ్ము తిరిగి తమకు సక్రమంగా చెల్లిస్తుందా అన్న సందేహం కూడా వారిని వెంటాడుతోంది. అందుకే ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్లు విక్రయించే పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీలతో సహా కొన్ని ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం లేగేసుకుంటున్న ప్రస్తుత పరిస్దితుల్లో టికెట్ల సొమ్ము వెనక్కి వస్తుందా అని కూడా  యజమానులు భయపడుతున్నారు. కొత్త జీవో ప్రకారం అయితే ఇక సినిమా హాళ్లు మూసివేసుకోవడమే ఉత్తమమన్న అలోచనకు కొన్ని హాళ్ల యాజమాన్యలొచ్చాయి.


బొమ్మకు ముందుగానే చెల్లించాలి

సినిమా థియేటర్‌లో ఏదైనా చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా డిస్ట్రిబ్యూటర్‌కు కొంత సొమ్ము చెల్లించి వారి నుంచి లైసెన్స్‌ పొందాల్సి ఉంది. దాని ఆధారంగా హాల్‌లో ఉన్న వెబ్‌సైట్‌కు సినిమా మొత్తం డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ పరిస్థితుల్లో  డిస్ర్టిబ్యూటర్‌కు నగదు చెల్లించి అనుమతి తెచ్చి సినిమా ప్రదర్శిస్తే హాల్‌ యజమానికి ముందుగా పైసా రాదు. వీళ్లు పెట్టుబడి పెట్టి ఆతర్వాత ప్రభుత్వం తిరిగి చెల్లించినప్పుడే తీసుకోవాలి. అందుకే యాజమాన్యాలు కొత్త జీవోకు దూరంగా ఉన్నాయి.

Updated Date - 2022-06-28T05:03:54+05:30 IST