బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ABN , First Publish Date - 2022-03-03T18:12:14+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది....

బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

న్యూఢిల్లీ : నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మార్చి 3 నుంచి 5వతేదీల మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 


మార్చి 4,5తేదీల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ గురువారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో తెలిపింది. అల్పపీడన ప్రభావం వల్ల గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. 



శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల మీదుగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.మత్స్యకారులు ఈ నెల 5వతేదీ వరకు దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమోరిన్ ప్రాంతాల్లోకి చేపలవేటకు వెళ్ల రాదని ఐఎండీ కోరింది. 

Updated Date - 2022-03-03T18:12:14+05:30 IST