వాయువ్య దిశగా నివర్.. కర్నాటకకు ఐఎండీ ఎల్లో అలర్ట్..

ABN , First Publish Date - 2020-11-26T21:31:17+05:30 IST

నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ఫలితంగా కర్నాటకలోని...

వాయువ్య దిశగా నివర్.. కర్నాటకకు ఐఎండీ ఎల్లో అలర్ట్..

బెంగళూరు: నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ఫలితంగా కర్నాటకలోని దక్షిణ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బెంగళూరుతో పాటు నగర పరిసరాల్లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 48 గంటల్లో బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాలతో పాటు కొలార్, చిక్కబల్లాపూర్, తూమకూరు, మాండ్య, రామానగర జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘‘ఈ నెల 26, 27 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కర్నాటకలోని కోస్తా ప్రాంతాల్లో ఈ నెల 27న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...’’ అని ఐఎండీ బెంగళూరు డైరెక్టర్ సీఎస్ పాటిల్ పేర్కొన్నారు. మరోవైపు నివర్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో సంప్రదింపులు జరిపారు. తుఫాన్ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామనీ... కేంద్రం నుంచి అవసరమైన సాయం మొత్తం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-11-26T21:31:17+05:30 IST