IMD warning: ఒడిశాలో భారీవర్షాలు..రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2021-09-13T13:17:31+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది...

IMD warning: ఒడిశాలో భారీవర్షాలు..రెడ్ అలర్ట్

భువనేశ్వర్ : అల్పపీడన ప్రభావం వల్ల ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఒడిశాలోని 7 జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని, దీంతో ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణశాఖ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ చెప్పారు. మరో 6 జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో తాము ఎల్లో అలర్ట్ జారీ చేశామని దాస్ పేర్కొన్నారు. ఒడిశాలోని ఒకటి, రెండు జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసి, మెరుపు వరదలు సంభవించే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. 



ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని అధికారులు వివరించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్యంగా కదులుతూ సోమవారం తెల్లవారుజామున చంద్ బలి సమీపంలోని ఉత్తర ఒడిశా తీరాన్ని దదాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావం వల్ల మత్స్యకారులు సెప్టెంబర్ 14 వరకు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2021-09-13T13:17:31+05:30 IST