Telangana Rains: తెలంగాణలో వానలు గట్టిగానే చెప్పారుగా.. హైదరాబాద్‌లో వర్షాలపై తాజా అప్‌డేట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-26T20:34:22+05:30 IST

తెలంగాణలో (Telangana Rains) మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో..

Telangana Rains: తెలంగాణలో వానలు గట్టిగానే చెప్పారుగా.. హైదరాబాద్‌లో వర్షాలపై తాజా అప్‌డేట్ ఏంటంటే..

హైదరాబాద్: తెలంగాణలో (Telangana Rains) మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ 26 నుంచి 30వ తేదీ మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జులై 26న తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వాన ముసురు కమ్ముకుంది. ఇక.. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో జులై 26, 30 తేదీల్లో.. కోస్తాంధ్ర ప్రాంతంలో 26, 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ట్విట్టర్‌లో పేర్కొంది.



ఇదిలా ఉండగా.. భాగ్యనగరాన్ని అర్ధరాత్రి వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం(Heavy rains) కురిసింది. యాకత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలు చోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. నీటి ప్రవాహంలో పలుచోట్ల  కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ 9.2 సెంటీమీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీమీటర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0  సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.



వికారాబాద్ , చేవెళ్ల  ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్‌(Osmansagar)కు 2400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ ఫ్లో 2442 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి  అధికారులు ఉస్మాన్ సాగర్ నుంచి ఆరు గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్  సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత  నీటిమట్టం 1787.20 అడుగులకు చేరింది. అటు హిమాయత్  సాగర్‌(Himayath sagar)కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు సాగర్ నాలుగు గేట్ల ద్వారా మూసిలోకి 1320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి  నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులకు చేరింది.

Updated Date - 2022-07-26T20:34:22+05:30 IST