పాకిస్థాన్‌కు భారీ రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదం

ABN , First Publish Date - 2022-02-03T20:26:10+05:30 IST

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి

పాకిస్థాన్‌కు భారీ రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఆమోదం

ఇస్లామాబాద్ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల మేరకు రుణం మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వెంటనే 1 బిలియన్ డాలర్లను ఆ దేశం అందుకునేందుకు మార్గం సుగమం ఆయింది. 


ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) క్రింద 1 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయడానికి 6వ సమీక్షను పూర్తి చేయాలని ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్ కోరింది. దీంతో ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలి బుధవారం వాషింగ్టన్ డీసీలో సమావేశమై, ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తరిన్ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. పాకిస్థాన్‌ కోసం ఐఎంఎఫ్ రుణ వితరణ ప్రోగ్రామ్‌లో 6వ విడత భాగాన్ని ఆ సంస్థ బోర్డు ఆమోదించినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. 


2019 జూలైలో ఐఎంఎఫ్, పాకిస్థాన్ సిబ్బంది స్థాయిలో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మూడేళ్ళపాటు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 39 నెలల్లో దాదాపు 6 బిలియన్ డాలర్లు పాకిస్థాన్‌కు అందుతుంది. పాకిస్థాన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ఐఎంఎఫ్ ఈ రుణ సహకారాన్ని అందిస్తోంది. 


Updated Date - 2022-02-03T20:26:10+05:30 IST