భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌

ABN , First Publish Date - 2022-04-19T20:23:15+05:30 IST

పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన

భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌

వాషింగ్టన్ : పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ అభివృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం సహా అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 


క్రిస్టలినా మాట్లాడుతూ, భారత దేశం మంచి లక్ష్యంతో కూడిన విధానాలను అమలు చేస్తోందని, దీనివల్ల పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడటానికి అవకాశం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సహాయపడుతున్నందుకు భారత దేశాన్ని ప్రశంసించారు. శ్రీలంకతో ఐఎంఎఫ్ నిరంతరం క్రియాశీలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు భారత దేశాన్ని అభినందించారు. ఈ మహమ్మారితో పోరాడేందుకు ఇతర బలహీన దేశాలకు సహాయపడినందుకు భారత దేశాన్ని ప్రశంసించారు. 


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, నిర్మల సీతారామన్, క్రిస్టలినా జార్జీవా తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, పెరుగుతున్న ఇంధనం ధరలకు సంబంధించిన సవాళ్ళపైనా ఈ పరిణామాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది. 


నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. ప్రభుత్వం  మూల ధన వ్యయం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం కోసం నిధుల సరఫరాను పెంచడం, ప్రధాన మౌలిక నిర్మాణపరమైన సంస్కరణలు, పటిష్టమైన ద్రవ్య విధానాలను అమలు చేయడం వల్ల మహమ్మారి అనంతరం కోలుకోవడం సాధ్యమైనట్లు తెలిపారు. 


ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధి రేటును భారత దేశ ఆర్థిక వ్యవస్థ నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం నుంచి 8.5 శాతం జీడీపీ వృద్ధి సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిక వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంలో 35.4 శాతం పెంచింది. రూ.7.5 లక్షల కోట్లకు మూలధన వ్యయాన్ని పెంచింది. మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ పెట్టుబడుల ఆధ్వర్యంలో కోలుకోవడం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.5.5 లక్షల కోట్లు ఉండేది. 


Updated Date - 2022-04-19T20:23:15+05:30 IST