శ్రీలంకకు భారత్ భరోసాపై ఐఎంఎఫ్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-04-19T18:07:51+05:30 IST

అత్యంత తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సహాయపడుతున్న

శ్రీలంకకు భారత్ భరోసాపై ఐఎంఎఫ్ ప్రశంసలు

న్యూఢిల్లీ : అత్యంత తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సహాయపడుతున్న భారత దేశాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రశంసించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీతో అమెరికాలో సమావేశమై, ఆ దేశానికి సహాయపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో నిర్మల సీతారామన్‌తో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా సమావేశమైనట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. శ్రీలంక పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉంటామని చెప్పినట్లు పేర్కొంది. 


భారత్, శ్రీలంక ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్, అలీ సబ్రీ సోమవారం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సమావేశమైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. శ్రీలంకకు సాధ్యమైన మేరకు సహకారం అందజేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని నిర్మల సీతారామన్ చెప్పినట్లు తెలిపింది. 


శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత తీవ్రమైన సంక్షోభం రావడం ఇదే మొదటిసారి. ఈ సమయంలో భారత దేశం రెండు రుణ ఒప్పందాలను కుదుర్చుకుని సహాయపడుతోంది. ఈ రుణాలతోపాటు మొత్తం మీద శ్రీలంకకు 1.5 బిలియన్ డాలర్ల మేరకు అందజేసింది. ఇంధనం, ఆహారం, మందులు వంటి నిత్యావసర వస్తువులను కొనేందుకు ఈ సహకారాన్ని అందజేసింది. 


పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్తు వంటి నిత్యావసరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సుస్థిరత ఉన్నట్లు సందేశాన్ని పంపేందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నూతన మంత్రివర్గాన్ని నియమించారు. నిత్యావసరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసమేనని తెలిపారు. 


అలీ సబ్రీ సహాయకుడు షమీర్ జవహిర్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో ఐఎంఎఫ్‌తో చర్చలు సానుకూల వాతావరణంలో ప్రారంభమైనట్లు తెలిపారు. వడ్డీ రేట్లను పెంచడానికి, అంతర్జాతీయ ఆర్థిక, న్యాయ సలహాదారుల నియామకానికి ఇటీవల చేపట్టిన చర్యలు ఓ మంచి ముందడుగు అని ఐఎంఎఫ్ గుర్తించిందన్నారు. ఈ చర్యలు రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్‌కు వీలు కల్పించవచ్చునని తెలిపిందన్నారు. ప్రస్తుతం నిత్యావసరాల సరఫరా సమస్యలను తగ్గించేందుకు ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్‌స్ట్రుమెంట్ (ఆర్ఎఫ్ఐ) కోసం ఆర్థిక మంత్రి సబ్రీ విజ్ఞప్తి చేశారన్నారు. అయితే ఈ చర్యలు తమ నిబంధనలకు తగినట్లుగా లేవని ఐఎంఎఫ్ ప్రాథమికంగా అభిప్రాయపడిందన్నారు. భారత దేశం శ్రీలంకకు ఆర్ఎఫ్ఐపై వినతులు చేసిందన్నారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ విజ్ఞప్తిని ఐఎంఎఫ్ పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, నిధులను సమకూర్చేందుకు ఐఎంఎఫ్ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. దీనివల్ల స్వల్ప కాలంలో పరిస్థితులను చక్కదిద్దడం సాధ్యమవుతుందని, ఆ తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ప్రారంభించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2022-04-19T18:07:51+05:30 IST