America scams: NRI లు జర జాగ్రత్త..! ఈ ఫోన్ కాల్ మీకు గనుక వస్తే..

ABN , First Publish Date - 2022-07-24T22:49:04+05:30 IST

అమెరికాలో ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ తమకూ వచ్చాయని అనేక మంది బాధితులు సోషల్ మీడియాలో వెల్లడించారు.

America scams: NRI లు జర జాగ్రత్త..! ఈ ఫోన్ కాల్ మీకు గనుక వస్తే..

ఎన్నారై డెస్క్: ఆ ఎన్నారై(NRI) అమెరికాలో ఉంటున్నాడు.. ఓ రోజు అకస్మాత్తుగా అతడికి ఫోన్ కాల్ వచ్చింది. ఇమిగ్రేషన్ అధికారినంటూ అవతలి వ్యక్తి తనని తాను పరిచయం చేసుకుంది. ఆ ఎన్నారై సమర్పించిన ఇమిగ్రేషన్ సంబంధిత పత్రాలు.. తాజా వివరాలతో అప్‌డేట్ కాలేదని చెప్పుకొచ్చింది. ఫోన్ కట్ చేయవద్దని, సంభాషణ మొత్తం రికార్డ్ అవుతోందని చెప్పింది. అంతేకాదు.. కాల్ కట్ అయితే మాత్రం ఎన్నారై చిక్కుల్లో పడతాడని, ఆపై తాను చేయగలిగిందేమీ ఉండదని వార్నింగ్ ఇచ్చింది. వెంటనే గిఫ్ట్ కార్డుల ద్వారా కొంత మొత్తాన్ని తనకు బదిలీ చేస్తే సమస్య అప్పటికప్పుడే పరిష్కారైపోతుందని హామీ ఇచ్చింది.


ఇదంతా విని కంగారు పడిపోయిన ఎన్నారై.. వెంటనే తేరుకుని తన ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూస్తున్న కన్సల్టెన్సీ అధికారితో కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేశాడు. దీంతో.. కన్సల్టెన్సీ అధికారికి వెంటనే విషయం అర్థమైంది. తన క్లైంట్‌ నుంచి డబ్బులు దండుకునేందుకు ఇలా ఇమిగ్రేషన్ అధికారినని చెప్పుకుంటూ బెదిరిస్తున్నారని గుర్తించి వెంటనే కాల్ కట్ చేశారు. దీంతో.. ఆ ఎన్నారై అపాయం నుంచి సులువుగా గట్టెక్కాడు.


అయితే.. అమెరికాలో(America) ఇలాంటి మోసాలు(Scams) ఇటీవల కాలంలో పెరిగిపోయాయని ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ తమకూ వచ్చాయని అనేక మంది బాధితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎన్నారైలను ట్రాప్ చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ వేస్తున్నారని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించావంటూ ఎన్నారైలను అలర్ట్ చేయడం.. డబ్బు బదిలీ చేస్తే సమస్య పరిష్కారమైపోతుందని హామీ ఇవ్వడం.. కాల్ అస్సలు కట్ చేయద్దంటూ బెదిరించడం.. ఈ ఫార్ములాతో ఎన్నారైలను ట్రాప్ చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కన్సల్టెన్సీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


ఇక ఢిల్లీలోని అమెరికా ఇమిగ్రేషన్ కార్యాలయం పేరిట కూడా కొన్ని పేక్ ఈమెయిల్స్ భారతీయులకు వెళుతున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(US citizenship and Immigration services) శాఖ గుర్తించింది. వీసా మంజూరైందని, డబ్బు పంపించాలని ఈ మెయిళ్లల్లో సందేశాలు వస్తున్నట్టు తెలిపింది.  వీసా లాటరీ పేరిట మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. ఇటువంటి మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారతీయులను హెచ్చరించింది. నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వ నిబంధనలు, కార్యకలాపాలపై అవాగాహన పెంచుకోవాలని సూచించింది. 

Updated Date - 2022-07-24T22:49:04+05:30 IST