అజరామర విశ్వనరుడు

ABN , First Publish Date - 2020-09-28T06:28:00+05:30 IST

అంతరాల తిరోగమన సమాజంలో కలాన్ని ఆయుధం చేసుకున్న దార్శనికుడు జాషువా. చాతుర్వర్ణ కులవ్యవస్థ అందించిన నిచ్చెన మెట్ల సంస్కృతిని తన పద్యాల చేత...

అజరామర విశ్వనరుడు

జాషువా కవితా ఖండికలు రాసే కాలం నాటికి భావ కవిత్వం విరివిగా సృజిస్తున్నారు కవులు. మరోవైపు జాతీయోద్యమ ప్రభావంతో దేశభక్తి కవిత్వం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇలాంటి సమయంలో జాషువా సామాజిక వాస్తవికతను పట్టించుకోని కవిత్వాన్ని, కవుల పలాయన వాదాన్ని చీల్చి చెండాడు. ‘‘పూదోటల మద భంభర/ నాదముల విలాసవతుల నడుబెడగుల నా/హ్లాదించు కవులకీ నిరు/పేదల ఆక్రందనములు వీనుల బడునా!’’ అంటూ పేదల పక్షాన నిలబడ్డాడు. 


అంతరాల తిరోగమన సమాజంలో కలాన్ని ఆయుధం చేసుకున్న దార్శనికుడు జాషువా. చాతుర్వర్ణ కులవ్యవస్థ అందించిన నిచ్చెన మెట్ల సంస్కృతిని తన పద్యాల చేత పటాపంచలు చేసిన అక్షరసేనాని. జాషువా మీద పలు విశ్వవిద్యాలయాల్లో అనేక పరిశోధనలు జరిగినా, నామమాత్రంగానైనా తెలుగు సాహిత్య విమర్శకులు పట్టించుకున్నా, ఇంకా ఎన్నో కోణాలు జాషువా కవిత్వంలో మిగిలే ఉన్నాయి. ఆయన కవిత్వంలో చోటు సంపాదించుకున్న వస్తువు, ఆయనదైన ముద్ర కలిగిన ప్రాపంచిక దృక్పథమూ నేటికి ప్రాసంగికతను కోల్పోకుండా ఉన్నాయి. ఆయన కవిత్వంలోని ప్రశ్నించే చైతన్యం, బాధిత పక్షపాత వైఖరి ఈ తరానికి కూడా దారి చూపు తున్నాయంటే అతిశయోక్తి కాదు. 


1990వ దశకంలో దళిత సాహిత్యం ఉవ్వెత్తున ఎగి సింది. కారంచేడు, చుండూరు సంఘటనల నేపథ్యంలో దళిత కవులు తమ కలాలను ఎక్కుపెట్టి అనేక ప్రశ్నలను సంధించారు. తరతరాల అణచివేతలను తీవ్రస్వరంతో నిర సించారు. ఆత్మగౌరవబావుటాను ఎగురవేశారు. సాహిత్యంలో జాషువా కంటే ముందు ఈ తిరుగుబాటుకు పునాదులు వేసిన బహుజన కవులు కొద్దిమందే కనిపిస్తారు. కుల వ్యవస్థను నిరసిస్తూ వెలువడిన సాహిత్యానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాల్కుర్కి సోమన, వేమన, దున్నా ఇద్దాసు, పోతులూరి వీరబ్రహ్మం వంటి విముక్తి కవులు దక్షిణ భారతాన తమ ముద్రను బలంగా వేశారు. ఈ పరంపర ఉత్తర భారతానికి కూడా పాకింది. సంత్‌ రవిదాస్‌, కబీరు, నారాయణగురు, చొక్కమేళ, తుకారాం వంటి కవుల పాటలు, పద్యాల్లో కూడా సామాజిక ఆధిపత్యాలను నిల దీసినతనం కనిపిస్తుంది. ఈ మార్గాన్ని స్వానుభవ ఆత్మా శ్రయ ధోరణితో మరింత పదునెక్కించిన కవి జాషువా. 


జాషువా కవితా ఖండికలు రాసే కాలం నాటికి భావ కవిత్వం విరివిగా సృజిస్తున్నారు కవులు. వారిలా ప్రేయసి తన్మయత్వంతో కవిత్వం రాయకుంటే కవులే కాదూ, అది కవిత్వమే కాదనే పరిస్థితి. అయినా జాషువా మాత్రం ఈ ప్రభావానికి ఎదురీదాడు. మరోవైపు జాతీయోద్యమ ప్రభా వంతో దేశభక్తి కవిత్వం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇలాంటి సమయంలో జాషువా సామాజిక వాస్తవికతను పట్టించు కోని కవిత్వాన్ని, కవుల పలాయనవాదాన్ని చీల్చి చెండాడు. ‘‘పూదోటల మద భంభర/ నాదముల విలాసవతుల నడుబెడగుల నా/హ్లాదించు కవులకీ నిరు/పేదల ఆక్రందన ములు వీనుల బడునా!’’ అంటూ పేదల పక్షాన నిలబడ్డాడు. 


తెలుగు సాహిత్యంలో ఆర్థిక అసమానతల్ని చిత్రించిన అభ్యుదయ కవిత్వం అనగానే శ్రీశ్రీ గుర్తుకు వస్తారు. కానీ, జాషువా కూడా తన కవిత్వంలో అనేక మార్లు పేదల పక్షాన గొంతెత్తి పద్యగానం చేశాడు. ఆ పేదల పేదరికానికి మూలకారణంగా ఇక్కడ కులం ఉందనే స్పృహ జాషువాలో కనిపిస్తుంది. అందుకే సమాజంలోని అట్టడుగు ప్రజలను గురించి, పీడిత కులాలను గురించి తన కవిత్వంలో పరామర్శించారు. వారి బాధలను తన బాధలుగా స్వీకరించి పద్యాలు అల్లి లోకాన్ని ఆలోచింప జేశారు. ఈ లక్షణం వల్లనే జాషువా విశాల ప్రజారాశుల గుండెల్లో విశ్వకవి అయ్యాడు. పండితులు మాత్రం ఆయన్ను ఒక సమూహానికి ప్రతినిధిగా కట్టడి చేయాలని చేశారు. అందుకే దానిని పటాపంచలు చేస్తూ ‘‘నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు/ విశ్వనరుడను నేను’’ అని ధిక్కార ఆత్మగౌరంతో ప్రకటించుకున్నాడు. 


జాషువా కవిత్వంలో మరో గొప్పగుణం బుద్ధిస్టు దృక్పథం. తన గురువులు పేదరికం, కులమత బేధమని చెప్పుకున్న ప్పటికీ తనను ఇబ్బందుల పాలు చేసిన ఈ సమాజాన్ని జాషువా క్షమించాడు. ఈ క్షమ వెనుక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే బౌద్ధ విలువలున్నాయి. తనను గాయపరిచిన సమాజాన్ని కూడా సంస్కరించి సమానత్వం వైపు నడిపించాలనుకున్న తపన జాషువా పద్యాలలో అడుగడుగునా కనిపిస్తుంది. శత్రువును సైతం క్షమించాలనే బౌద్ధ సుగుణం జాషువా పద్యాల్లో ఉంది. అలాగే జాషువా ‘‘క్రీస్తు చరిత్ర’’ అనే కావ్యాన్ని రాయడం వెనుక కూడా క్రీస్తులో ఉన్న కరుణామయ గుణాన్నే జాషువా దర్శించినట్లు మనకు కనిపిస్తుంది. ఇట్లా ఈ రెండు మతా లలో ఉన్న మానవతా విలువల్ని స్వీకరించిన జాషువా, తనను అంటరానివాడంటూ అవమానించిన నాలుగు పడగల హైందవ నాగరాజును మాత్రం నిరసించాడు.


కులపీడనలో నలిగిపోయినతనం జాషువాను మరింత రాటుదేల్చింది. తనను అవమానాల పాలుచేసిన పండి తుల, పీఠాధిపతులను తన అక్షరాలతోటే జయించి సన్మాన సత్కారాలను అందుకున్నాడు. పాత సమాజపు ఛాందస విలువలను విడనాడి, నూతన విలువలను ప్రతిపాదించాడు. ‘‘జనులం చీలిచి పిప్పిజేసెడు దురాచారంబులన్‌ గాల మ/ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్య వ్యాఘ్రి కింపైనచో/ జనమా?మోసపు వ్రాత కోతలకు రక్షాబంధమా? ఎందుకీ/ మను జత్వంబు నొసంగలేని చదువుల మైరేయ పుం మైకముల్‌’’ అంటూ ఆనాడే దురాచారా లను, చదువుల్లోని డొల్లను గురించి తీవ్ర నిరసనను తెలిపాడు. ఈ పద్యసారాన్ని అవలోకించినపుడు అంబేద్కర్‌ చెప్పిన ""Cultivation of mind should be the ultimate aim of human existence''  అనే మాట గుర్తుకు రాక మానదు. 


‘‘ముప్పు ఘటించి వీని కులమున్‌ కబళించి (తదీయ) దేహమున్‌/ పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా/చెప్పులు కుట్టి జీవనము సేయునుగాని నిరాకరింప లే/దెప్పుడు, నప్పువడ్డది సుమీ భారతా వని వీని సేవకున్‌’’ అంటూ తన గబ్బిలం కావ్యంలో ఈ సమాజానికి తరాలుగా సేవ చేస్తున్న అంటరాని కులాల కృషిని కావ్యాలకు ఒంపి గౌరవించాడు. అలాగే తన కావ్యంలో గబ్బిలానికి చోటుకల్పించాడు. ఈ రెండు సాహసాలు అప్పటి కాలానికి సాహిత్య సంచలనాలు. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులో మూసధోరణులు బద్ధలై సామాన్యుడు కావ్యనాయకుడు కావచ్చుగాని, తరాలుగా బతుకు పోరా టంలో రాటుదేలిన దళితుడు మాత్రం సోకాల్డ్‌ కవులకు కాన రాలేదు. అభ్యుదయ కవులు సైతం కులాన్ని అసలు సమస్యగానే చూడకపోవడం చారిత్రక తప్పిదం. అలాంటి సమయంలో జాషువా సామాజిక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని తన కవిత్వంలో కడగొట్టుబిడ్డలను కథానాయకు లను చేశాడు. తన కాలానికంటే ముందు నడిచాడు. చాతుర్వ ర్ణాలంటూ ధర్మోపదేశాలు చేసిన హైందవ ఇతిహాస, పురా ణాలు చెప్పని ఐదవ వర్ణం గురించి జాషువా ప్రశ్నలు లేవనెత్తాడు. ‘‘ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు/ నలు వురు కుమారులనుట విన్నాముగాని/ పసరము కన్న హీను డభాగ్యుడైన/ యైుదవ కులస్థుడెవరమ్మా! సవిత్రి’’ అంటూ కులవ్యవస్థ మాటున దాగిన బ్రాహ్మణీయ కుట్రలను బద్ధలు చేశాడు. 


కులవ్యవస్థ ఉన్నంతకాలం జాషువా అక్షరం ఉంటుంది. జాషువా సాహిత్యావసరం ఇవాళ మరింత పెరిగింది. ఈ అత్యాధునిక శిరోముండన కాలానికి దారిచూపే వేగుచుక్క జాషువాయే!  

పసునూరి రవీందర్‌

77026 48825

(నేడు మహాకవి గుర్రం జాషువా 125వ జయంతి)

Updated Date - 2020-09-28T06:28:00+05:30 IST