పేదల ఇమ్యూనిటీ బూస్టర్ తిప్పతీగ

ABN , First Publish Date - 2021-06-16T17:24:29+05:30 IST

తిప్పతీగ ఇప్పటి వరకూ ఓ పిచ్చిమొక్కగానే దీన్ని చాలామంది పరిగణించేవారు. కరోనాతో దీని విలువ తెలిసి వచ్చింది. రోగ నిరోధక శక్తితో పాటు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం తిప్పతీగలో ఉన్నాయని

పేదల ఇమ్యూనిటీ బూస్టర్ తిప్పతీగ

తిప్పతీగ ఇప్పటి వరకూ ఓ పిచ్చిమొక్కగానే దీన్ని చాలామంది పరిగణించేవారు. కరోనాతో దీని విలువ తెలిసి వచ్చింది. రోగ నిరోధక శక్తితో పాటు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం తిప్పతీగలో ఉన్నాయని భావిస్తున్నారు. ఈ తిప్పతీగను సాగు చేసిన ఓ యువకుడికి ఫార్మా కంపెనీ నుంచి కోట్ల రూపాయల ఆర్డర్‌ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆయుర్వేద వైద్యులు తమవద్దకొచ్చే రోగులకు తిప్పతీగతో చేసిన మందులను సిఫారసు చేస్తున్నారు. కొన్ని కంపెనీల స్టోర్లలో గెలోయ్‌ పేరుతో  లభిస్తున్న ఈ ఔషధానికి మంచి ఆదరణ లభిస్తోంది. 


కరోనాతో పాటు ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం

పార్కులు, ఖాళీ ప్రదేశాల్లో


ఖైరతాబాద్‌ జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిప్పతీగ నగరంలోని నెక్లె్‌సరోడ్‌తో పాటు అనేక పార్కుల్లో, ఖాళీ స్థలాల్లో గుబురుగా పెరుగుతోంది. సైన్స్‌ పరంగా దీనిని కార్డిపోలియా పేరుతో పిలుస్తుంటారు. ఇళ్లలో కూడా వీటిని సులువుగా పెంచుకోవచ్చు. రోడ్డు పక్కల దారిపొడవునా విరివిగా కనిపిస్తాయి. దీని ఆకులు, కాయలు, కాండం, పూలు, వేర్లతో సహా అన్నిట్లో ఔషధ విలువలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. వీటిని నీటిలో వేసి డికాషన్‌లాగా మరగబెట్టి తాగితే వాతం, పిత్తం, కఫం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. కరోనాతో పాటు పలు రకాల జ్వరాలు, ఒంటి నొప్పులు, రక్త శుద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలిపి తాగినా ఇది పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


మొత్తం మందులాగే..

100 మిల్లీలీటర్ల నీటిలో మూడు తిప్పతీగ ఆకులు కానీ, కాండం అయితే రెండు అంగుళాలు వేసి ఆ నీరు 25 మిల్లీలీటర్లకు చేరేవరకూ మరగబెట్టాలి. 15 నుంచి 20 ఎంఎల్‌ చొప్పున రోజూ ఉదయం, సాయంత్రం టీ కప్పులో గోరువెచ్చటి నీటితో కలుపుకుని తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఆకు చేదుగా ఉంటుందని, తేనె, బెల్లాన్ని కలుపుకొని తీసుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఆకులను, కాండాలను గుళికలుగా చేసుకొని కూడా రోజుకొకటి తేనెలో కలుపుకొని తాగవచ్చు. రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్‌ ఉంటుందని, దానివల్ల ఆకలి పెరగడం, రక్త శుద్ధి, బలాన్ని అందించడంలో కీలకంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా వచ్చి పోయిన అనంతరం ఇమ్యూనిటీ పెంచేందుకు ఇది కీలకంగా పనిచేస్తుందన్నారు. దీనిని కరోనా వైద్యానికి వాడే మందులతో కలిపి నిర్ణీత రోజులు వాడాలని తెలిపారు. దీర్ఘకాలికంగా వాడాలనుకునేవారు వైద్యుల సూచనలు పాటించడం మంచిదన్నారు. 


మహిళల సమస్యలకూ చెక్‌

మహిళలకు సాధారణంగా వచ్చే ఎన్నో సమస్యల నివారణకు తిప్పతీగ పని చేస్తుంది. రుతుస్రావం సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. రుతుక్రమం సరిగ్గా రాకపోయినా, గర్భ సంచి, అండాశయాల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నా మంచి ఔషధంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా పిల్లలు పుట్టనివారికి, మూత్రాశయ సంబంధిత సమస్యలకు, మోనోపాజ్‌ ఆగిన మహిళల్లో కొందరికి వచ్చే చిరాకు, కోపం, జ్ఞాపక శక్తి లోపాల నివారణ మందులా పని చేస్తుందని తెలిపారు ఎముకలు అరిగిపోయి కీళ్ల నొప్పులతో బాధ పడే వారు తిప్పతీగతో నయం చేసుకోవచ్చునని వైద్యులు తెలుపుతున్నారు.


జ్వరాల నివారణకు అమృతం లాంటిది

ఏ రకమైన జ్వరాలకైనా తిప్పతీగ మంచి ఔషధంలా పని చేస్తుంది. నొప్పితో కూడిన ఏ వ్యాధి నివారణకైనా ఈ గూడూచి(తిప్పతీగ) కీలకంగా పనిచేస్తుంది. పిల్లలు పుట్టని మగవారికి మంచి ఔషధం. ఆయుర్వేద ఆస్పత్రుల్లో దీన్ని ఔషధంగా వాడుతున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ సమస్యల పరిష్కారానికి, కేన్సర్‌ చికిత్స పొందుతూ కీమోథెరఫీ, రేడియో థెరఫీలతో వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌లను పారదోలేందుకు తిప్పతీగ కీలకంగా పనిచేస్తుంది. వైద్య శాస్త్రంలో తిప్పతీగ అమృతం లాంటిది. 


- డాక్టర్‌ పి.యశోద, ప్రొఫెసర్‌, 

చిన్నపిల్లల విభాగాధిపతి, డాక్టర్‌ బీఆర్‌కేఆర్‌ 

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఎర్రగడ్డ


Updated Date - 2021-06-16T17:24:29+05:30 IST