ఇమ్యూనిటీ స్నాక్స్‌

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో డ్రైఫ్రూట్స్‌తో స్నాక్స్‌ తయారుచేసుకుంటే అందరూ ఇష్టంగానూ తింటారు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.....

ఇమ్యూనిటీ స్నాక్స్‌

ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో డ్రైఫ్రూట్స్‌తో స్నాక్స్‌ తయారుచేసుకుంటే అందరూ ఇష్టంగానూ తింటారు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. బాదం బర్ఫీ, డ్రై ఫ్రూట్‌ హల్వా, డేట్స్‌ ఖీర్‌, డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌, డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటా  ఆ కోవకు చెందినవే. వాటి తయారీ విశేషాలు ఇవి...


బాదం బర్ఫీ

కావలసినవి

బాదం పలుకులు - ముప్పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, వేడినీళ్లు - ఒక కప్పు, కుంకుమ పువ్వు కలిపిన పాలు  - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం

 ముందుగా ఒక బౌల్‌లో వేడి నీళ్లు పోసి బాదం పలుకులను అందులో వేసి ఒకగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత వాటి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. 

 బాదం పలుకులు తడి లేకుండా ఆరిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 

 స్టవ్‌పై మరొక పాన్‌ పెట్టి పంచదార తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి. 

 పానకం చిక్కగా అయిన తరువాత అందులో రెడీ చేసి పెట్టుకున్న బాదం పలుకుల పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు కలిపిన పాలు పోయాలి. చిన్నమంటపై కాసేపు ఉంచుకుని దింపుకోవాలి.

 బాదం మిశ్రమం చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.



డేట్స్‌ ఖీర్‌ 

కావలసినవి

ఖర్జూర (విత్తనాలు లేనివి) - అర కప్పు, నల్ల ఎండుద్రాక్ష - అరకప్పు, గసగసాలు - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు టీస్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ - అరకప్పు, కొబ్బరిపాలు - పావు లీటరు, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు. 

తయారీ విధానం

 స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌, గసగసాలు, ఖర్జూర, నల్ల ఎండు ద్రాక్షను వేయించుకోవాలి.

 తరువాత స్టవ్‌ని చిన్నమంటపై పెట్టి అందులో బెల్లం, కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి.

 ఒక చిన్న బౌల్‌లో బియ్యప్పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకుని ఆ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్‌ మిశ్రమంలో పోయాలి. పదినిమిషాల పాటు చిన్నమంటపై ఉడికితే డేట్స్‌ ఖీర్‌ రెడీ. 

 చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.


డ్రై ఫ్రూట్‌ స్పాంజ్‌ కేక్‌


కావలసినవి

జీడిపప్పు - పావు కప్పు, బాదం పలుకులు - పావు కప్పు, పిస్తా - పావు కప్పు, వాల్‌ నట్స్‌ - పావుకప్పు, ట్యూటీ ఫ్రూటీ - అరకప్పు, ఎండు ద్రాక్ష - పావు కప్పు, కోడిగుడ్లు - ఐదు, వెన్న - ముప్పావు కప్పు, పంచదార - ఒక కప్పు, ఉప్పు - కొద్దిగా, వెనీలా ఎసెన్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, మైదా - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకులపొడి - ఒక టీస్పూన్‌, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌, బీటర్‌, మైదా పొడి పిండి కొద్దిగా. 

తయారీ విధానం

 ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత స్టవ్‌పై ఒక వెడల్పాటి పాన్‌పెట్టి జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను డ్రై రోస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 

 ఒక బౌల్‌లో మైదా తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, ఎండు ద్రాక్ష, ట్యూటీ ఫ్రూటీ, పిస్తా పలుకులు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను వేసి బాగా కలుపుకోవాలి. 

 తరువాత రెండు చిన్న బౌల్స్‌ తీసుకుని వాటిలో కోడిగుడ్లు కొట్టి ఒక దాంట్లో తెల్లసొన, మరొక దాంట్లో పచ్చసొన వేయాలి.

 మరొక బౌల్‌లో వెన్న తీసుకుని అందులో పంచదార వేసి క్రీమ్‌లా తయారయ్యేలా బీటర్‌తో కలుపుకోవాలి.

 ఇప్పుడు అందులో కోడిగుడ్డు పచ్చసొన కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటర్‌తో కలపాలి. తరువాత వెనీలా ఎసెన్స్‌ వేసి మరోసారి కలుపుకోవాలి.

 ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమంను క్రీమ్‌లో కొద్దికొద్దిగా వేసుకుంటూ స్పూన్‌తో కలియబెట్టాలి.

 ఎగ్‌వైట్‌ బౌల్‌ను తీసుకుని బీటర్‌తో హైస్పీడ్‌లో కలపాలి. ఇలా చేయడం వల్ల ఎగ్‌వైట్‌ ఫోమ్‌ మాదిరిగా తయారవుతుంది. తరువాత దీన్ని డ్రై ఫ్రూట్స్‌, క్రీమ్‌ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. రెడీ అయిన కేక్‌ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 

 కేక్‌ పాన్‌ తీసుకుని దానికి వెన్న పూసి, పొడి పిండి చల్లాలి. తరువాత కేక్‌ మిశ్రమం వేసి గాలి బుడగలు లేకుండా సమంగా పరచాలి. 

 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీ హీట్‌ చేసుకున్న ఓవెన్‌లో పావుగంట పాటు బేక్‌ చేసుకోవాలి. 

 చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటా


కావలసినవి

గోధుమ పిండి - మూడు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - అరకప్పు, జీడిపప్పు - అరకప్పు, పనీర్‌ - అరకప్పు, ఎండుద్రాక్ష - పావుకప్పు, బెల్లం - పావు కప్పు, వాము - ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత.

తయారీ విధానం

 బాదం, జీడిపప్పు పలుకులను పొడి చేసుకోవాలి. పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.

 ఒక బౌల్‌లోకి వాటిని తీసుకుని అందులో ఎండుద్రాక్ష, బెల్లం, వాము, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి.

 మరొక బౌల్‌లో రెండు కప్పుల గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి.

 ఇప్పుడు పరోటాలు చేసుకోవడానికి మిశ్రమాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని పొడి పిండిలో అద్దుతూ పరోటా చేసుకోవాలి. దాని మధ్యలో ఒక చెంచా డ్రై ఫ్రూట్‌ పనీర్‌ మిశ్రమాన్ని పెట్టాలి. తరువాత పరోటా చివరలు దగ్గరకు ఒత్తాలి. చపాతీ కర్రతో మళ్లీ పరోటా తయారుచేసుకోవాలి.

 వీటిని పాన్‌పై నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడిగా తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.



డ్రై ఫ్రూట్‌ హల్వా


కావలసినవి

ఖర్జూర (విత్తనాలు లేనివి) - ఒక కప్పు, డ్రై అంజీర్‌ - ఒక కప్పు, పిస్తా - పావు కప్పు, జీడిపప్పు - పావు కప్పు, బాదం - పావు కప్పు, వాల్‌నట్స్‌ - పావు కప్పు, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం

 ముందుగా ఖర్జూర, అంజీర్‌, పిస్తా, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ పలుకులను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

 తరువాత వాటిన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ఒక టేబుల్‌స్పూన్‌ పాలు, ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి మిగిలిన నెయ్యి వేసి మిక్సీలో పట్టుకున్న పేస్టును వేసి వేయించాలి. నాలుగైదు నిమిషాలు వేయించిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST