అడ్డుకోకపోతే కన్నీరే...!

Jun 22 2021 @ 01:33AM
గండికోట జలాశయం

జిల్లాపై తెలంగాణ ప్రాజెక్టుల ప్రభావం

మన జలాశయాల సామర్థ్యం 84.85 టీఎంసీలు

శ్రీశైలం ప్రాజెక్టే ప్రధాన నీటి ఆధారం

తెలంగాణ ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి కష్టాలు

కాలువల సామర్థ్యం పెంచినా.. ఎగువ నుంచి వరద రాకపోతే..?

అడ్డుకోకపోతే కడప గడప ఎడారే?


కడప గడపన నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రధాన నీటి ఆధారం శ్రీశైలం ప్రాజెక్టు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని రాయలసీమ సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వరదలు వస్తే తప్ప ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయరుకు నీరు చేరే పరిస్థితి ఉండదు. అదే జరిగితే కృష్ణా జలాల ఆధారంగా జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు పరిస్థితి ఏంటి..? జిల్లా రైతాంగాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. కాలువ సామర్థ్యం పెంపు సరే.. ఆ కాలువలకు వరద చేరకుండా అడ్డుకట్ట వేసే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అంకుర దశలోనే అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో 84.21 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నా.. అందులో 75.52 టీఎంసీలు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు శ్రీశైలమే ఆధారం. అంతేకాదు.. 95 వేల ఎకరాలకు సాగునీరు అందించే కేసీ కాలువకు కూడా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ తీసుకుంటున్నారు. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గండికోట, బ్రహ్మంసాగర్‌, మైలవరం, వెలిగల్లు, అన్నమయ్య ప్రాజెక్టు వంటి 11 ప్రధాన జలాశయాలు ఉన్నాయి. వీటి సామర్థ్యం 84.85 టీఎంసీలు. ఇందులో శ్రీశైలం జలాశయం ఎగువన మళ్లించే కృష్ణా జలాలపై ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టుల సామర్థ్యం 75.52 టీఎంసీలు. కొత్తగా నిర్మించే రాజోలి, జొలదరాశి జలాశయాలకు టెండర్లు పిలిచారు. ఇవి కాదని.. మరో 20 టీఎంసీల సామర్థ్యంలో గండికోటకు అనుబంధంగా దేనేపల్లి జలాశయం, 3-4 టీఎంసీలతో పెన్నా నదిపై పుష్పగిరి రిజర్వాయరు నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద పుష్కలంగా ఉండాల్సిందే. అయితే.. తాజాగా ఎగువ రాష్ట్రం తెలంగాణా కృష్ణా బేసిన నీటి ఆధారంగా పలు ప్రాజెక్టులు నిర్మించారు. తాజాగా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం వెల్లడించారు. అంటే.. దిగువకు న్యాయబద్ధంగా రావాల్సిన వరదకు  ఎగువనే అడ్డుకట్ట వేసి మళ్లించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం నిండే పరిస్థితి ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలానికే వరద చేరకపోతే ఆ నీటి ఆధారంగా నిర్మించిన జిల్లా ప్రాజెక్టులు ఒట్టిపోవాల్సిందేనా..? రైతులను వేధిస్తున్న ప్రశ్న. 


శ్రీశైలం నీటి లెక్కలు పరిశీలిస్తే...

శ్రీశైలం జలాశయానికి ప్రధాన నీటి ఆధారం కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదులు. 2010-11 నుంచి 2020-21 వరకు రిజర్వాయర్‌లో చేరిన నీటి లెక్కలు పరిశీలిస్తే.. 2010-11, 2019-20, 2020-21 ఈ మూడేళ్లలో మాత్రం వెయ్యికి పైగా టీఎంసీలు వరద చేరింది. 2011-12లో 734 టీఎంసీలు, 2013-14లో 848 టీఎంసీలు, 2014-14లో 614 టీఎంసీలు వరద చేరింది. మిగిలిన ఐదేళ్లలో కనిష్టంగా 59, గరిష్టంగా 541 టీఎంసీలు చేరాయి. అంటే.. సగటున ఏటా 311 టీఎంసీలకు మించి చేరలేదని జలవనరుల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన లెక్కలు. 35-45 శాతం నీటి వాటా తుంగభద్ర నది నుంచే వస్తుంది. ఈ లెక్కన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి.. భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నిర్మించిన.. కొత్తగా నిర్మించబోయే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి లిఫ్టు, పాలమూరు-రంగారెడ్డి, దండి లిఫ్టు, మిషన భగీరథ, భక్త రామదాసు, తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకాల ద్వారా 255 టీఎంసీలకు పైగా వాడుకోవాలని సన్నాహాలు చేస్తోంది. అంటే.. ఐదేళ్లు సగటున శ్రీశైలంలో చేరే వరదలో ముప్పాతిక శాతం ఎగువ రాష్ట్రమే వాడుకుంటే.. దిగువన ఉన్న రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం లేకపోలేదు. 


ఆ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే...

కృష్ణా నదీజలాల ఆధారంగా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్‌, బ్రహ్యంసాగర్‌, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 జలాశయాలు నిర్మించారు. వాటి సామర్థ్యం 75.52 టీఎంసీలు. ఇందులో గండికోట, మైలవరం ప్రాజెక్టులు పెన్నానదిపై నిర్మించారు. గత ఇరవై ఏళ్లుగా పెన్నా వరద నీటి లెక్కలు పరిశీలిస్తే రెండు మూడేళ్లు మినహా పెన్నాకు చెప్పుకోదగ్గ వరద రాలేదని ఇంజనీర్లు అంటున్నారు. అంటే.. ఈ ప్రాజెక్టులకు ఆధారం కృష్ణా జలాలే. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి మళ్లించే కృష్ణా జలాలు బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ దగ్గర గాలేరు-నగరి వరద కాలువ (జీఎనఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌) నుంచి అవుకు రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి జీఎనఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ద్వారా గండికోటకు మళ్లిస్తున్నారు. గండికోట నుంచి ఎత్తిపోతల ద్వారా చిత్రావతి, పైడిపాలెం, గ్రావిటీ ద్వారా మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్‌ను నింపుతున్నారు. అలాగే.. బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా బ్రహ్మంసాగర్‌, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 నింపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడానికి వీలుగా గాలేరు-నగరి వరద కాలువ సామర్థ్యం 33 వేల క్యూసెక్కులకు విస్తరిస్తున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టులు ఏటేటా నింపుకోవాలన్నా.. కడప గడప పచ్చని పైర్లతో సస్యశ్యామలం కావాలన్నా ఎగువన తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం జగనపై ఒత్తిడి తీసుకురావాలని సీమ సాగునీటి నిపుణులు కోరుతున్నారు. 


కేసీ ఆయకట్టు కన్నీళ్లతో తడపాల్సిందేనా..?: 

కేసీ కాలువ పరిధిలో కర్నూలు, కడప జిల్లాలో 2.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 29.5 టీఎంసీలు నీటి వాటా ఉంది. తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ నుంచి నీటిని తీసుకోవాల్సి ఉంది. అయితే.. తుంగభద్ర జలాశయం నుంచి కేసీకి రావాల్సిన 10 టీఎంసీల నీటి వాటాను జీఓ నెం.3 ద్వారా ఏటేటా అనంతపురం జిల్లాకు మళ్లిస్తున్నారు. కేసీ కాలువకు బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా లిఫ్టు, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా మళ్లిస్తున్నారు. జిల్లాలో కేసీ కింద 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల శ్రీశైలానికి వరద తగ్గిపోతే.. జిల్లాలో కేసీ, టీజీపీ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమే. 


కృష్ణా జలాల ఆధారంగా జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు, సామర్థ్యం (టీఎంసీలు): 


జలాశయం సామర్థ్యం

గండికోట 26.85

చిత్రావతి 10.00

పైడిపాలెం 6.00

మైలవరం 6.50

వామికొండ 1.60

సర్వరాయసాగర్‌ 3.06

బ్రహ్మం సాగర్‌ 17.74

ఎస్‌ఆర్‌-1 1.33

ఎస్‌ఆర్‌-2 2.44

మొత్తం 75.52


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.