భూంబేలు!

ABN , First Publish Date - 2022-01-23T07:56:27+05:30 IST

ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువను ఆరు నెలల్లోపే పెంచబోతుండడంపై ఇటు సామాన్య, మధ్య తరగతి, అటు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

భూంబేలు!

  • ‘భూముల ధరలు’ పెంచితే ప్రజలపై పెనుభారం
  • రియల్టర్లపైనా ప్రభావం
  • స్థలాలు కొనుగోలు చేయాలంటే జనం బెంబేలు
  • సర్కారుకు రాబడి.. సామాన్యులకు గుదిబండ
  • రిజిస్ట్రేషన్‌ చార్జీలకు అధిక మొత్తంలో చెల్లింపు
  • ఆర్నెల్ల కిందటి పెంపుతోనే కోలుకోని వైనం
  • స్థిరాస్తి రంగం క్రయవిక్రయాలు కుదేలే!
  • నిర్మాణ సామగ్రి ధరలతో ఇప్పటికే ఇబ్బందులు
  • అప్పులు తీర్చలేక తిప్పలు.. వడ్డీలు మోపెడు
  • హైదరాబాద్‌లో సొంతింటి కల కష్టమే
  • ప్రభుత్వాన్ని కలుస్తాం.. పెంపు వద్దని కోరతాం
  • క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి


హైదరాబాద్‌ చిక్కడపల్లిలో ప్రస్తుతం చదరపు గజం ధర రూ.49,500. ఇక్కడో వ్యక్తి 200 గజాల ఖాళీ స్థలం కొనుక్కోవాలనుకున్నాడు..  దీని రిజిస్ట్రేషన్‌కు రూ.7.42 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే, ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు.. భూముల మార్కెట్‌ విలువ 30 శాతం పెంచితే ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.9.65 లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే.. సుమారు రూ.2.22 లక్షల భారం పడనుంది. గజానికి దాదాపు రూ.14,850 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. బంజారాహిల్స్‌లో ఖాళీ స్థలం చదరపు గజం ఇప్పుడు రూ.84,500. ఇక్కడ కూడా 200 గజాలు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే.. ప్రస్తుతానికి రూ.12.67 లక్షలపైగా అవుతుంది. మార్కెట్‌ రేటు 30 శాతం పెంచితే రిజిస్ట్రేషన్‌కు రూ.16.47 లక్షలు అవుతుంది. అదనంగా సుమారు రూ.4 లక్షలు కట్టాల్సి ఉంటుంది.


జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ప్రస్తుతం గజం మార్కెట్‌ విలువ రూ.58,500గా ఉంది. ఈలెక్కన 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌కు రూ.8.77 లక్షల దాకా అవుతుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు 30ు పెంచితే.. రూ.11.40 లక్షలు రిజిస్ట్రేషన్‌ చార్జీలు అవుతాయి. అదనంగా రూ.2.63 లక్షలు భారం పడుతుంది. ఇప్పుడు గజానికి రూ.58,500పై 7.5% చొప్పున రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లిస్తుండగా.. మార్కెట్‌ విలువ 30 శాతం పెరిగిన తర్వాత రూ.76,050కు రిజిస్ట్రేషన్‌ చార్జీలు కట్టాల్సి వస్తుంది. అదే మార్కెట్‌ విలువ 50% పెంచితే రూ.87,750కు.. చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువను ఆరు నెలల్లోపే పెంచబోతుండడంపై ఇటు సామాన్య, మధ్య తరగతి, అటు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది చాలా దారుణమని వీరంతా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఎంతసేపూ ఆదాయంపైనే దృష్టిపెడుతోంది తప్ప.. ప్రజల కోణంలో ఆలోచించడం లేదని వాపోతున్నారు. మార్కెట్‌ విలువలు పెరిగితే సామాన్యులు, మధ్య తరగతివారిపై మరింత భారం పడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. వారు ఇంకా నిరుత్సాహానికి గురవుతారన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రజలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి జంకుతున్నారు. కరోనా కారణంగా  రియల్‌ ఎస్టేట్‌ రంగం అతలాకుతలమవుతోందని, సంక్రాంతి పండుగ రోజుల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని స్థిరాస్తి వ్యాపారులు వివరిస్తున్నారు. దీని నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాల్సి ఉండగా.. మళ్లీ బాదుడుకు సిద్ధమవుతుండడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ విలువల పెంపుతో ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు, భూముల క్రయ విక్రయాలు తగ్గవచ్చని స్థిరాస్తి వ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కరోనా రెండో వేవ్‌, ప్రస్తుత మూడో వేవ్‌తో.. ప్రజలు ఆరోగ్య అవసరాలకు  డబ్బు పోగు చేసుకుంటున్నారు. ఆస్తుల కొనుగోలుకు   వెచ్చించడం లేదు. నిరుడు జూలైలో పెరిగిన మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కొనుగోళ్లను కొంత ప్రభావితం చేశాయి. మళ్లీ విలువలను పెంచడంలో ప్రభావం పడుతుందని రియల్టర్లు వివరిస్తున్నారు. 


రాబడి సరిపోక.. మళ్లీ గుదిబండనా?

నిజానికి  తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలను పెంచలేదు. అయితే, జూలైలో ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల ధరలను 30 నుంచి 50 శాతం మేర పెంచింది. దాంతో ఏడాదికి రూ.3000-3,500 కోట్ల రాబడి సమకూరుతోంది. బడ్జెట్‌కు ఇతరత్రా మార్గాలు లేకపోవడంతో భూముల మార్కెట్‌ విలువల పెంపుపై మరోసారి ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా 30 నుంచి 50 శాతం మేర పెంచాలని యోచిస్తోంది. తద్వారా అదనంగా రూ.3000-3,500 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలన్నది ఆలోచన. కానీ, రాబడి ఉద్దేశంతో 6 నెలల్లోనే ప్రజలపై చార్జీల గుదిబండ వేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కాగా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి వంటి స్థిరాస్తి లావాదేవీలు అధికంగా ఉండే జిల్లాల్లో గతేడాది జూలైలో మార్కెట్‌ విలువ పెంపుతో.. రిజిస్ట్రేషన్లు కొంత మందగించాయి. ఇప్పుడు మరోసారి పెరిగితే.. ప్రభావం ఎక్కువగా ఉంటుందని రియల్టర్లు వివరిస్తున్నారు.


జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఇలా..

మార్కెట్‌ విలువల పెంపు జిల్లాల్లోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానిక రియల్టర్లు వివరిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని హనుమకొండకు చెందిన రియల్టర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు చెల్లించకుంటే రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, మార్కెట్‌ విలువలను అదే పనిగా పెంచుతూ పోతే మరింత తగ్గుతాయని వేములవాడ రియల్టర్‌ మారం కుమార్‌ తెలిపారు. సామాన్యులు ఇళ్లు, స్థలాలు కొనుక్కోలేని పరిస్థితి నెలకొందని ఒక్కో ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు రూ.20-30 వేలు అవుతున్నాయని, పెంపుతో అది రూ.60-70 వేలవుతుందని నిజామాబాద్‌ స్థిరాస్తి వ్యాపారి కుంట గంగారెడ్డి చెప్పారు. కరోనా కారణంగా వ్యాపారం కత్తి మీద సాములా మారిందని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా స్థిరాస్తి వ్యాపారులు వివరిస్తున్నారు. భవనాలు, భూములు, ఇతర నిర్మాణాలపై పెట్టుబడి పెట్టామని.. అప్పులు, వడ్డీలు చెల్లించలేక పోతున్నామని వాపోయారు. దీనికితోడు ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలపై భారం పడుతుందని సంగారెడ్డికి చెందిన రియల్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గవచ్చన్నారు. కొనుగోళ్లపై ప్రజలు పునరాలోచనలో పడే అవకాశం ఉందని నిర్మల్‌ రియల్టర్‌ ఒకరు వివరించారు. మరోవైపు పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణ దశల్లో ఉన్నవాటిలో ఫ్లాట్లు, ప్లాట్లకు ఒప్పందాలు చేసుకున్నవారు డబ్బు చెల్లింపునకు వెనుకంజ వేస్తున్నారని పలువురు రియల్టర్లు తెలిపారు. కాగా, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు చెబుతున్నారు. ఇనుము, సిమెంటు ధరలు అమాంతం పెరిగాయని, కూలీలకు అధిక కూలి చెల్లించాల్సి వస్తున్నదని వివరిస్తున్నారు. ఇలాంటి దశలో మార్కెట్‌ విలువలను పెంచడం వల్ల కొనుగోలుదారులు మరింత నిరుత్సాహానికి గురవుతారని, ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటారని చెబుతున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇలా..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే భూముల ధరలు భారీగా ఉన్నాయి. ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు సామాన్యులకు అందనంతగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను భరించడమూ సవాల్‌గా మారింది. మళ్లీ మార్కెట్‌ ధరలు పెంచితే భారీగా దెబ్బపడుతుందని రియల్టర్లు చెబుతున్నారు. కొవిడ్‌తో రెండేళ్లుగా సొంతింటి ఆలోచనకు దూరంగా ఉన్న మధ్య తరగతివారు.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారని, ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రభావం చూపే వీలుందని పేర్కొంటున్నారు. ఇది అపార్ట్‌మెంట్ల కొనుగోలుపై ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రాంతాలకు అనుగుణంగా భూ  విలువలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ప్రభావం పడుతోందని రియల్టర్లు అంటున్నారు.


ప్రజలపై భారం.. స్థిరాస్తి రంగానికి పెద్ద దెబ్బ

ప్రభుత్వం భూముల ధరలను పెంచాలనుకోవడం సరికాదు. 30 శాతం అని ఓవైపు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో వందశాతానికి పైగా పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వినియోగదారులకు ఇది భారమే కాక.. స్థిరాస్తి రంగానికి పెద్ద దెబ్బ. కొవిడ్‌ నుంచి పుంజుకునేందుకు పలు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గిస్తూ స్థిరాస్తి రంగానికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. కానీ, మనదగ్గర ఆరు నెలలకే మార్కెట్‌ విలువ పెంచితే వినియోగదారులు అయిష్టత చూపిస్తారు. రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉండడంతో స్థిరాస్తి వ్యాపారుల కంటే ప్రజలపైనే ఇంకా ఎక్కువ భారం పడుతుంది. స్థిరాస్తి రంగ ప్రస్తుత పరిస్థితిని వివరించి.. భూముల విలువను పెంచొద్దంటూ ప్రభుత్వానికి సోమవారం వినతిపత్రం ఇవ్వనున్నాం.

-డి.మురళీకృష్ణారెడ్డి, క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు

Updated Date - 2022-01-23T07:56:27+05:30 IST