అమలుకు నోచని హెర్బల్‌ పార్కు హామీ!

ABN , First Publish Date - 2020-11-30T05:38:16+05:30 IST

తూప్రాన్‌ మండలంలోని కోనాయపల్లిపీబీ గ్రామంలో ఆయుర్వేద పార్కు ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.

అమలుకు నోచని హెర్బల్‌ పార్కు హామీ!
కోనాయపల్లిపీబీలో హెర్బల్‌ పార్కు స్థానంలో ఏర్పడిన ప్రకృతి వనం

 నెరవేరని మంత్రి మాట

 కోనాయపల్లిపీబీలో ఆయుర్వేద పార్కు స్థానంలో విలేజ్‌ పార్కు ఏర్పాటు

 జడ్పీ చైర్‌పర్సన్‌ దత్తత తీసుకున్నా అభివృద్ధి శూన్యం


తూప్రాన్‌రూరల్‌, నవంబరు 29: తూప్రాన్‌ మండలంలోని కోనాయపల్లిపీబీ గ్రామంలో ఆయుర్వేద పార్కు ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఇంతకు ముందు మల్కాపూర్‌ పరిధిలో ఉన్న కోనాయపల్లిపీబీ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. కాగా రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ మల్కాపూర్‌లో కంటివెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చారు. ఆ సభకు కోనాయపల్లిపీబీ గ్రామస్థులను రానీయలేదు. తమ గ్రామానికి పక్కనే ఉన్న మల్కాపూర్‌ను గొప్పగా చూపించడంతో పాటు అక్కడికే అందరూ వచ్చిపోతుండడం కోనాయపల్లిపీబీ గ్రామస్థుల్లో గొప్ప మార్పును తీసుకొచ్చింది. కోనాయపల్లిపీబీని స్వచ్ఛ గ్రామంగా మార్చుకునేందుకు గ్రామస్థులు, యువకులు నడుం బిగించారు. మల్కాపూర్‌లో వారానికోసారి స్వచ్ఛభారత్‌ను చేపడుతుండగా ఇక్కడ ప్రతిరోజూ నిర్వహించారు. ఈ క్రమంలోనే మల్కాపూర్‌లో రాక్‌గార్డెన్‌కు భిన్నంగా ఔషధ మొక్కలతో హెర్బల్‌ పార్కును ఏర్పాటు చేయాలని సంకల్పించారు. పట్టుదలతో గ్రామ శివారులోని గొల్లగుట్టపై రాళ్లను, పొదలను తొలగించి అందంగా తీర్చిదిద్దారు. గతేడాది డిసెంబరులో అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు ఆయుర్వేద పార్కును ఏర్పాటు చేస్తామన్న సర్పంచ్‌ ఆలోచనలను అభినందించారు. ఆధునికంగా హెర్బల్‌ పార్కును నిర్మించాలని, అందుకు ఉచితంగా ఔషధ మొక్కలను ఇప్పిస్తానని,  చెప్పారు. రెండురోజుల్లోనే ఫారెస్టు అధికారులను గ్రామానికి పంపించి ఎన్ని మొక్కలు అవసరమవుతాయో లెక్క వేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క అధికారి కూడా గ్రామానికి రాలేదు. అంతే కాకుండా ఆయుర్వేద పార్కు స్థానంలో ఇపుడు విలేజ్‌ పార్కును ఏర్పాటు చేశారు. ఔషధ మొక్కలకు బదులు నీడనిచ్చే, పూల మొక్కలను పెంచుతున్నారు. నెల రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు దుబ్బాక ఎన్నికల ప్రచారానికి కోనాయపల్లి మీదుగా వెళ్తుండగా గ్రామస్థులు ఆపి సమస్యను వివరించారు. అప్పుడు కూడా త్వరలోనే పంచాయతీ భవనానికి రూ.20లక్షలు, గ్రామంలో 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అది కూడా కార్యరూపం దాల్చడం లేదు. జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతకు ముందు గడా ప్రత్యేకాధికారి దత్తత అధికారిగా ఉన్నా ఫలితం లభించలేదు. ప్రోత్సాహం లేకపోవడంతో గ్రామంలో రోజువారీ శ్రమదానాలు కనిపించడంలేదు. మంత్రి హామీ ఇచ్చిన నిధుల విషయమై కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదని గ్రామ సర్పంచ్‌ పాండు వాపోతున్నారు. తమ గ్రామానికి కూడా మల్కాపూర్‌లాగా ఇంటింటికీ పాడిగేదెల పథకాన్ని వర్తింపజేయాలని, 90 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలని, వడ్డేపల్లి వరకు రోడ్డును నిర్మించాలని సర్పంచ్‌ కోరుతున్నారు. 


Updated Date - 2020-11-30T05:38:16+05:30 IST