ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

 టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

 రక్షాబంధన్‌ సందర్భంగా ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌

 మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 11: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, దళిత బంధు మహిళా లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కిట్టు అందుతుందా? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ లావణ్య మాట్లాడుతూ..మొదటి కాన్పు సర్కారు ఆసుపత్రిలో చేయించుకున్నానని, కేసీఆర్‌ కిట్టు ఇచ్చారని, చాలా సంతోషంగా ఉందన్నారు.  రెండు కాన్పు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే  చేయించుకుంటానని మంత్రికి తెలిపారు. భూదమ్మ అనే మహిళ మాట్లాడుతూ గతంలో పింఛన్‌ రూ.200 మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు వికలాంగులకు రూ.3,016, ఒంటరి మహిళలకు రూ.2,016 ఇస్తున్నారని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్‌ పదిరెట్టు పెరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మహిళా కౌన్సిలర్లు గాయత్రి, వనజ, లలిత, లక్ష్మి, యశోద, వేదవతి, కల్యాణి, జయశ్రీ, మమత, రుక్మిణి, మానస, శమున్నీసాబేగంతోపాటు రామాయంపేట మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పలువురు పాల్గొన్నారు. 


సంగారెడ్డిలో చింతానే గెలిపిస్తాం

సంగారెడ్డిటౌన్‌: రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకర్గం నుంచి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌నే గెలిపిస్తామని పలువురు మహిళలు తెలిపారు. ప్రగతి భవన్‌ నుంచి గురువారం మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అఽధ్యక్షుడు చింతాప్రభాకర్‌, పలువురు మహిళలు, టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి చింతాప్రభాకర్‌నే గెలిపిస్తామని తెలిపారు. అనంతరం చింతాప్రభాకర్‌ మాట్లాడుతూ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మంత్రి హరీశ్‌రావు చొరవతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు ఆస్పత్రిని 600 పడకలకు పెంచడంతో సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST