కరువుగడ్డపై కలిచెర్ల ముద్ర

ABN , First Publish Date - 2022-01-25T07:16:18+05:30 IST

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి మృతితో చిత్తూరు రాజకీయాల్లో ఓ అధ్యాయం ముగిసినట్టయింది.

కరువుగడ్డపై కలిచెర్ల ముద్ర
కలిచెర్ల ప్రభాకరరెడ్డి

మదనపల్లె/ పెద్దమండ్యం, జనవరి 24: తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర రెడ్డి(77) మృతితో జిల్లా రాజకీ యాల్లో ఓ అధ్యాయం ముగిసినట్టయింది. కరువు ప్రాంత మైన పెద్దమండ్యం మండలం కలిచెర్లలో భూస్వామ్య కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కడప నరసింహా రెడ్డిరెండవ కుమారుడైన ప్రభాకరరెడ్డి తండ్రికి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత కలిచెర్ల గ్రామానికి వీఎంగా (రెడ్డిగా) పనిచేసిన ఆయన తదనంతరం పెద్దమండ్యం తొలి ఎంపీపీగా ఎన్నికయ్యారు.ఆపై 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తంబళ్ళపల్లె ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు. మొత్తం ఐదుసార్లు పోటీచేసి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు.2014 ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన ప్రభాకర రెడ్డి రెండునెలల తరువాత వైసీపీలో చేరారు. అయితే అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇంటిపేరు కడప అయినా స్వస్థలం కలిచెర్ల కావడంతో అదే ఇంటి పేరుగా స్థిరపడింది. ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు చెందిన ఇందిరమ్మను వివాహమాడారు. స్థానికుల చేత అభిమానంగా అప్ప అని పిలిపిం చుకునే  కలిచెర్ల చెప్పిందే శాసనంగా పెద్ద మండ్యం మండలంలో చాలా కాలం చలామణి అయింది. టీడీపీ ఆవిర్భావంతో తలెత్తిన రాజకీయ చైతన్యం కారణంగా జిల్లాలో భూస్వామ్య పెత్తందారీ కుటుంబాల ప్రాభవం చాలావరకూ తగ్గుముఖం పట్టింది. అయితే దానికి మినహా యింపు కలిచెర్ల కుటుంబం.టీడీపీ స్థాపించిన తొలినాళ్ళలో ఎన్టీ రామారావు ప్రచారానికి వచ్చినప్పడు ఒక్కరు కూడా రోడ్లపై కనిపించ కూడదంటూ కలిచెర్ల కుటుంబం జారీ చేసిన ఆదేశం తూచా తప్పకుండా అమలై ఆంధ్రుల ఆరాధ్యుడైన రామారావునే నిశ్చేష్టుని చేసింది. కలిచెర్ల కుటుంబానికి ఆ ప్రాంతంలో వున్న పట్టుకు, ప్రజాబలానికి  అదీ నిదర్శనం. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అప్పపై ఏనాడూ అవినీతి మచ్చ పడలేదు.నియోజకవర్గ అభివృద్ధితో పాటు సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకూ కలిచెర్ల కృషి చేశారు.పెద్దమండ్యం మండలంలో ఆకుమానుగుట్ట , తంబళ్లపల్లె మండలంలో చిన్నేరు, దబ్బలగుట్ట, పీటీఎం మండలంలో మిట్టసానిపల్లె మినీ ప్రాజెక్టు ఈయన హయాంలోనే నిర్మితమయ్యాయి. కలిచెర్లకు దైవభక్తి ఎక్కువే. ఇంటి ఇలవేల్పుగా భావించే పోలేరమ్మకు ఇంటి ఆవరణంలోనే ఆలయం నిర్మించారు. కాగా ప్రభాకరరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కలిచెర్లలో బుధవారం ఉదయం జరగనున్నాయి.

Updated Date - 2022-01-25T07:16:18+05:30 IST