పరిసరాల పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-05-16T05:28:55+05:30 IST

మెదక్‌ జిల్లాలో డెంగీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో పనిచేసి వ్యాధి నివారణకు కృషి చేస్తున్నారు.

పరిసరాల పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం
రామాయంపేటలో డెంగీ నివారణ చర్యలు చేపట్టిన సిబ్బంది(ఫైల్‌)

మెదక్‌ జిల్లాలో తగ్గుముఖం పట్టిన డెంగీ కేసులు 

గతేడాది 38 పాజిటివ్‌ కేసులు.. ఈ ఏడాది జీరో 

జిల్లాలో ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమం అమలు


మెదక్‌ అర్బన్‌, మే 15: మెదక్‌ జిల్లాలో డెంగీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో పనిచేసి వ్యాధి నివారణకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్య రావడం కూడా ఒకందుకు కారణం. 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇళ్లలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం వంటి కారణాలతో డెంగీ సోకుతుంది. ముఖ్యంగా ఎడిస్‌ ఈజిప్టి దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. పాత టైర్లు, మురుగుకాలువలు, కొబ్బరిచిప్పలు, ఎయిర్‌కూలర్లు, డ్రమ్ములు, బిందెల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులో లార్వా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతాయి. ఆ దోమలు కుట్టడం వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. 


జిల్లాలో తగ్గిన కేసులు

మెదక్‌ జిల్లాలో డెంగీ తగ్గుముఖం పడుతుంది. 2019లో 100 పాజిటివ్‌ కేసులు, 2020లో 22 కేసులు, 2021లో జిల్లాలో 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తూప్రాన్‌-12, నర్సాపూర్‌-11, రామాయంపేట-8, మెదక్‌-7, పట్టణ ప్రాంతాల్లో కేసులు బయట పడ్డాయి. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించి సహాయక చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. దాంతో ఈ ఏడాది ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో జీరో కేసులు నమోదు కావడం గమన్హారం. 


నివారణ చర్యలతోనే నియంత్రణ

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో 

వర్షాకాల సీజన్‌లో అపరిశుభ్ర వాతావరణం దోమల వ్యాప్తికి అనుకూలమైంది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటితొట్లపై మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం జిల్లాలో డ్రై డేను పాటించాలి. 

Updated Date - 2022-05-16T05:28:55+05:30 IST