మార్పు దిశగా..

ABN , First Publish Date - 2021-11-18T06:48:22+05:30 IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పు మొదలయింది.

మార్పు దిశగా..
ఆసుపత్రి గోడలకు రంగులు

జీజీహెచ్‌లో మెరుగుపడుతున్న సౌకర్యాలు

రోగుల కోసం అదనపు ఓపీ కౌంటర్లు 

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సూపరింటెండెంట్‌ చొరవతో సమకూరుతున్న మౌలిక వసతులు 


విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పు మొదలయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఓపీ, ఫార్మసీ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పని ఇక లేదు. వైద్య పరీక్షలు చేయించుకుని, రిపోర్టుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు ఒక్కో పని కోసం ఒక్కో బ్లాక్‌కు పరుగులు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు క్యాజువాలిటీ వద్దే అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ‘జీరో అవర్‌’లో మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ ఆసుపత్రిలో పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, రోగులకు సత్వర వైద్యసేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 


తొలిరోజు నుంచే.. 

రోగులకు మెరుగైన వైద్యసేవలందించడంతోపాటు ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తానని చెప్పిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తొలిరోజు నుంచే మార్పులకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు క్యాజువాలిటీతోపాటు వివిధ వార్డుల్లో పర్యటించిన ఆయన మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటాన్ని చూసి.. వెంటనే వాటికి మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓపీ, ఫార్మసీ, డయాగ్నొస్టిక్‌ విభాగాల్లో రద్దీ తగ్గించేందుకు అప్పటికప్పుడు మరో రెండు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయించారు. నాటి నుంచి ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందేలా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉన్నారు. 


పాలనను గాడిలో పెట్టేందుకు.. 

ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్తంగా మారిన పరిపాలన విభాగాన్ని గాడిలో పెట్టడంతోపాటు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లను నియమించారు. జనరల్‌ సర్జరీ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ సూర్యశ్రీలను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా నియమించి.. ఆసుపత్రిలో పరిపాలన, ఆర్థికపరమైన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను ఒకరికి, కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేలా పర్యవేక్షణ బాధ్యతలను మరొకరికి   అప్పగించారు. దీంతో ఆసుపత్రిలోని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మొదలుకొని నాలుగో తరగతి ఉద్యోగులు, నర్సులు, డాక్టర్లు, ప్రొఫెసర్ల పనితీరుపై పర్యవేక్షణ పెరిగింది. ఇప్పుడు అందరిలోనూ జవాబుదారీతనం వస్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 


పారిశుధ్యం, పచ్చదనంతో..

ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్ది.. ఆహ్లాదకరమైన వాతావరణంలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో ప్రతినెలా ఒకటి, మూడు ఆదివారాల్లో ఆసుపత్రిలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆసుపత్రి ఇన్‌-ఔట్‌ గేట్లను శుభ్రం చేయించారు. ప్రహరీకి రంగులు వేయించారు. 


మూలనపడిన పరికరాలకు మరమ్మతులు 

ఆసుపత్రిలో మూలనపడిన మంచాలు, స్ట్రెచర్లు, వీల్‌చైర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. ఆసుపత్రిలో అంబులెన్స్‌ల కోసం నిర్మించిన షెడ్లు పాత సామగ్రితో నిండి ఉండడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించడంతో వెంటనే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించారు. అంబులెన్స్‌లను ఆ షెడ్లలోనే నిలిపేలా చర్యలు తీసుకున్నారు. మరుదొడ్లకు వేసిన తాళాలను తీయించి, శుభ్రం చేయించి, అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రిలోని వార్డుల్లో స్వల్ప మరమ్మతులకు గురైన పడకలకు, కుర్చీలకు మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకువస్తున్నారు. పనికిరానివాటిని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. 


ఒకేచోట అత్యవసర వైద్యసేవలు 

అత్యవసర వైద్యసేవల కోసం వచ్చే రోగులు ఇంతకాలం ఓపీ చీటీలు, అడ్మిషన్‌ బుక్‌లు, వైద్య పరీక్షల కోసం ఎ, బి, సి బ్లాక్‌ల మధ్య పరుగులు తీయాల్సి వచ్చేది. దీంతో క్యాజువాలిటీ వద్దనే అత్యవసర ఓపీ రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్‌ కౌంటర్లు, ప్రత్యేక ఫార్మసీ కౌంటరు ఏర్పాటు చేయించి, రోగుల అవస్థలకు పరిష్కారం చూపించగలిగారు. 


పాత ప్రభుత్వాసుపత్రిలోనూ..

సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌, సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ పాత ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, అక్కడ కూడా రెండు అదనపు ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేయించారు. గర్భిణులకు ‘ఆరోగ్యశ్రీ’, ‘ఆరోగ్య ఆసరా’ కింద కాన్పులు చేయించాలని ఆదేశించారు. 


అందరికీ సత్వర వైద్యం అందించడమే లక్ష్యం 

ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వర వైద్యసేవలందించి, సంతోషంగా ఇంటికి పంపించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సగం సమస్యలు పరిష్కారమైనట్టే. అందుకే ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి నెలా ఒకటి, మూడు ఆదివారాల్లో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరూ కలిసి వస్తున్నందున ఇది విజయవంతంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ, రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను అందిస్తూ అందరి మన్ననలు అందుకోవాలనేది మా అభిలాష. - డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌ 



Updated Date - 2021-11-18T06:48:22+05:30 IST