మోదీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించిన పాక్ ప్రధాని ఇమ్రాన్

ABN , First Publish Date - 2022-02-22T22:11:49+05:30 IST

అలాగే కశ్మీర్‌లో పాకిస్తానీల చొరబాటులకు చెక్కు పెట్టాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 2008లో ముంబైలోని తాజ్ హోటల్ వద్ద జరిగిన ఉగ్రదాడి, పఠాన్‌కోట్‌లో 2016లో జరిగిన ఉగ్రదాడి అలాగే 2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల..

మోదీని టీవీ డిబేట్‌కు ఆహ్వానించిన పాక్ ప్రధాని ఇమ్రాన్

ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్యనున్న వివాదాలకు స్వస్తి చెప్పి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని, అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాక్‌పై భారత్‌కు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం కోసం తాము ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.


రష్యా టుడేకి మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నరేంద్రమోదీతో టీవీ డిబేట్లో పాల్గొనాలని ఉంది. భారత ఉపఖండంలో ఉన్న కోట్లాది మందికి ఈ డిబేట్ ఉపయోగకరంగా ఉంటుంది. భారత్ శత్రు దేశంగా మారింది. అందుకే వారితో వ్యాపారం చేయలేకపోతున్నాం. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితే వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. ఇది ఇరు దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.


అయితే, ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ‘‘ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి పని చేయవు. భారత్‌తో చర్చలు చేయాలనుకుంటే ఉగ్రవాదాన్ని వదిలేయాలి’’ అని భారత్ కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తోంది. అలాగే కశ్మీర్‌లో పాకిస్తానీల చొరబాటులకు చెక్కు పెట్టాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 2008లో ముంబైలోని తాజ్ హోటల్ వద్ద జరిగిన ఉగ్రదాడి, పఠాన్‌కోట్‌లో 2016లో జరిగిన ఉగ్రదాడి అలాగే 2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మరింత దూరం పెరిగింది. ఈ దాడులకు పాకిస్తానే కారణమనే విషయం తెలిసిందే. పుల్వామా దాడికి ప్రతిగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది.

Updated Date - 2022-02-22T22:11:49+05:30 IST