Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓ ర్యాలీలో భారత మంత్రి జైశంకర్ వీడియో ప్లే చేసి..

ABN , First Publish Date - 2022-08-14T22:00:33+05:30 IST

పాకిస్తాన్(Pakistan) 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) భారత్‌పై(India) ప్రశంసల జల్లు కురిపించారు.

Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓ ర్యాలీలో భారత మంత్రి జైశంకర్ వీడియో ప్లే చేసి..

ఇస్లామాబాద్ : పాకిస్తాన్(Pakistan) 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) భారత్‌పై(India) ప్రశంసల జల్లు కురిపించారు. భారత స్వతంత్ర విదేశాంగ విధానం భేష్ అంటూ కొనియాడారు. ఇరుదేశాలకూ ఒకేసారి స్వాతంత్ర్యం సిద్ధించినా దేశ ప్రజల ప్రయోజనార్థం భారత్ దృఢ విదేశాంగ విధానం అవలంభిస్తోందని మెచ్చుకున్నారు. లాహోర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో దృఢ వైఖరిని అవలంభించిందని, అమెరికాకు తలొగ్గలేదని చెప్పారు. ఈ సందర్భంగా స్లావేకియాలో ‘బ్రటిస్లావా ఫోరం’లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్‌ని ఇమ్రాన్ ఖాన్ ప్లే చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు అంశంలో అమెరికా ఒత్తిడికి లెక్కచేయకుండా దృఢంగా నిలబడిందని భారత్‌ని ప్రశంసించారు. ‘‘ భారత్, పాకిస్తాన్ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయి. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా విదేశాంగ విధానం విషయంలో భారత్ దృఢ వైఖరిని అవలంభిస్తోంది. కానీ వీళ్లు(ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం) మాత్రం గీతదాటరు ’’ అని ప్రస్తుత పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.


రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. పాకిస్తాన్ భాగస్వామి కాదు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా చెప్పినప్పుడు భారత్ ఏం చేసిందో చూడండి అంటూ వీడియో ప్లే చేశారు. ‘‘ చెప్పడానికి మీరెవరు? అంటూ పశ్చిమ దేశాలను జైశంకర్ నిలదీశారు. రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొనుగోలు చేస్తోంది. దేశ అవసరాల రీత్యా మేము ఆయిల్ కొనుగోలు చేస్తామని తెగేసి చెప్పింది’’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై తమ ప్రభుత్వం కనీసం చర్చలైనా జరిపిందని, ప్రస్తుతం ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గిందని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఇమ్రాన్ విమర్శల వర్షం కురిపించారు. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ప్రజలు పేదరిక రేఖకు దిగువనే ఉన్నారని, ఈ బానిసత్వానికి తాను వ్యతిరేకమని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

Updated Date - 2022-08-14T22:00:33+05:30 IST