Imran Khan praises PM Modi:​ మోదీ ఆస్తుల గురించి ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-23T01:22:47+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (Pakistan Tehreek e Insaf) అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

Imran Khan praises PM Modi:​ మోదీ ఆస్తుల గురించి ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (Pakistan Tehreek e Insaf) అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Former Pakistan Prime Minister Imran Khan) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Prime Minister of India, Narendra Modi) మరోసారి ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ (Pakistan Muslim League N supremo, Nawaz Sharif) విదేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఇమ్రాన్ ప్రసంగించారు. ఒక దేశ ప్రధాని విదేశాల్లో ఇంత పెద్ద మొత్తం అక్రమాస్తులు కూడబెట్టడం పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కే చెల్లుతుందన్నారు. ఆయన ఎంత కూడబెట్టారో ఎవ్వరూ అంచనావేయలేరని ఇమ్రాన్ చెప్పారు. అదే సమయంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావించారు. మోదీకి విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నాయో ఎవరైనా చెప్పగలరా అని ప్రజలను ప్రశ్నించారు. తద్వారా మోదీ అవినీతికి దూరమని, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతిలో మునిగితేలారని ఇమ్రాన్ చెప్పకనే చెప్పారు. 


ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం మోదీ ఆస్తుల విలువ 2022 మార్చి 31నాటికి రూ.2,23,82,504/- ఆయనకు స్థిరాస్తులు లేవు. 2021 మార్చి 31నాటికి ఆయనకు గల స్థిరాస్తుల విలువ రూ.1.1 కోట్లు. ఈ స్థిరాస్తి గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉంది. దీనిని మరో ముగ్గురితో కలిసి 2002 అక్టోబరులో కొన్నారు. దీనిలో నలుగురికీ సమాన వాటాలు ఉన్నాయి. ఆయన తన వాటాను విరాళంగా ఇచ్చేశారు. దీంతో ఈ ఏడాది ఇక ఆయనకు స్థిరాస్తులు లేవు. మోదీ చరాస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.26.13 లక్షలు పెరిగింది. 2022 మార్చి 31నాటికి ఆయన వద్ద నగదు రూపంలో రూ.35,250 ఉంది. ఆయనకు రూ.9,05,105 విలువైన పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, రూ.1,89,305 విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. 


ఇమ్రాన్ గత కొంత కాలంగా నరేంద్రమోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధ వేళ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ రష్యా వద్ద తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిందని ఇమ్రాన్ బహిరంగసభల్లో ప్రశంసించారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా ఉందని, పాకిస్థాన్‌లో అలా లేదని ఇమ్రాన్ వాపోతున్నారు. 


పాక్ నేషనల్ అసెంబ్లీలో మెజార్టీ లేక పాక్ ప్రధాని పదవి కోల్పోయినప్పటినుంచీ ఇమ్రాన్ ఖాన్ అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్‌ను, పాక్ నాయకత్వాన్ని భారత్‌తోనూ, భారత నాయకత్వంతోనూ పోలుస్తూ వస్తున్నారు. బహిరంగ సభల్లో నేరుగా ప్రజలనే ప్రశ్నిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ప్రకటన దృశ్యాలను కూడా ఆయన స్క్రీన్‌లపై ప్రదర్శిస్తూ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం షెబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ సోదరుడు) ప్రధానిగా కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్‌, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో పాటు ఇతర పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పాకిస్థాన్‌లో అధికారంలో ఉంది. 


Updated Date - 2022-09-23T01:22:47+05:30 IST