చైనాతో దోస్తీ కొంపముంచింది: ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-22T23:55:59+05:30 IST

తన పదవి నుంచి దిగిపోవడానికి చైనాతో దోస్తీ కారణమని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూశానని, అయితే స్వదేశ ప్రయోజనాలు..

చైనాతో దోస్తీ కొంపముంచింది: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: తన పదవి నుంచి దిగిపోవడానికి చైనాతో దోస్తీ కారణమని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూశానని, అయితే స్వదేశ ప్రయోజనాలు గిట్టని ప్రతిపక్షాలు తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర పన్నాయని ఆయన అన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చైనాతో సన్నిహితంగా ఉన్న ఇమ్రాన్.. ఒక్కసారిగా తన పదవి కోల్పోవడానికి చైనానే కారణమని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఇదే సమయంలో భారత విదేశాంగ విధానాలపై ఇమ్రాన్ పొగడ్తలు కురిపించారు.


శుక్రవారం లాహోర్‌లో నిర్వహించిన ఒక బహిరంగ సభను ఉద్దేశించి ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘భారత్ విదేశాంగ విధానం పూర్తిగా ఆ దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. ఇతర దేశాల ప్రయోజనాల కంటే ముందు సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తుంది. కానీ పాకిస్తాన్‌లో పరిస్థితి ఇలా లేదు. మన విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. దేశీ శక్తులకు కూడా చైనాతో వ్యాపారవాణిజ్యాలు నేను మెరుగుపర్చుకోవడం ఇష్టం లేదు. అందుకే కుట్రకు తెర లేపారు. నా పదవి పోవడానికి చైనా దోస్తీ ఒక కారణమైంది’’ అని అన్నారు.

Updated Date - 2022-04-22T23:55:59+05:30 IST