ఇమ్రాన్‌ విజయం

ABN , First Publish Date - 2021-03-09T07:00:44+05:30 IST

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కనీసం కొంతకాలం విపక్షాలు విమర్శలకు దూరంగా ఉండక తప్పదు....

ఇమ్రాన్‌ విజయం

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కనీసం కొంతకాలం విపక్షాలు విమర్శలకు దూరంగా ఉండక తప్పదు. పదకొండు ప్రతిపక్ష పార్టీల కూటమి ‘పాకిస్థాన్‌ డెమోక్రాటిక్‌ మూమెంట్‌ (పీడీఎం)’ ఓటింగ్‌ సమయంలో వాకౌట్‌ చేయడంతో ఇమ్రాన్‌కు ఈ విజయం మరింత సులువైంది. ఇటీవల ఎగువసభకు జరిగిన ఎన్నికల్లో అధికార పక్షం ‘పాకిస్థాన్‌ తెహ్రీకీ ఇన్సాఫ్‌ (పీటీఐ)’ తరఫున అభ్యర్థిగా నిలిచిన ఆర్థికమంత్రి అబ్దుల్‌ హజీజ్‌ షేక్‌ ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇమ్రాన్‌ గద్దెదిగాలని ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్న విపక్షాలకు ఇది ఆయుధంగా అందివచ్చింది. కానీ, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా విశ్వాసపరీక్షకు సిద్ధపడటంతో విపక్షాలే ఆత్మరక్షణలో పడ్డాయి. ఆయనకు అవసరంకంటే ఆరు ఓట్లు ఎక్కువే వచ్చాయి. అధికారపక్షంలో తిరుగుబాటు ధోరణులు కనిపిస్తున్న తరుణంలో ఈ విశ్వాస పరీక్షతో వాటికి సమాధానం చెప్పాలని ఇమ్రాన్‌ నిర్ణయించుకున్నారు. 


ఆర్థికమంత్రి ఓటమి అనూహ్యమైనది. ఈయనకు పోటీగా మాజీ ప్రధాని యుసఫ్‌ రజా గిలానీ పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయనకు కనీసం ఇరవైమంది అధికారపక్ష సభ్యులు అనుకూలంగా ఓట్లేశారు. తన పార్టీవారు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుని ఈ పాడుపనిచేశారని ఇమ్రాన్‌ స్వయంగా ఆరోపించారు. దీనితో విపక్షాలు సంఖ్యాబలం కోల్పోయిన ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశాయి. గిలానీ ఎన్నికను తప్పుబట్టే క్రమంలో ఇమ్రాన్‌ తనపార్టీమీద తానే అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికను నిలువరించే లక్ష్యంతో ఎన్నికల సంఘంమీదా విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌ మరింత అప్రదిష్టపాలయ్యారు. దీనితో విశ్వాసపరీక్షకు పోతే తప్ప ప్రాయశ్చిత్తం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. మిలటరీ అండదండలు తనకు సంపూర్ణంగా ఉన్నందున విపక్షాలు తనను ఏమీ చేయలేవనీ, ఇప్పటికిప్పుడు తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ధైర్యం వాటికి లేదని ప్రధానికి తెలుసు. అందువల్ల, అధికారపక్ష కూటమిలో ఉన్న తన వ్యతిరేకశక్తులను ఏరిపారేయడానికి ఇదే మంచి తరుణమని విశ్వాసపరీక్షకు ముందుకొచ్చారు. విపక్ష కూటమి ఓటింగ్‌ సమయంలో వాకౌట్‌ చేయడం వెనుక సైన్యం పాత్ర ఉన్నదని అంటున్నారు. 


ఏతావాతా ఇమ్రాన్‌ పదవినైతే నిలబెట్టుకోగలిగారు కానీ, పార్టీలో ఆయన వైఖరిపట్ల విముఖత ఉన్న మాట నిజం. ఇక, కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక, సామాజిక రంగాలు, అధికధరలు, పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాలను నాశనం చేయమంటూ అంతర్జాతీయ ఒత్తిడి వంటివి ఆయనను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పరీక్షాసమయం సమీపిస్తున్నప్పుడల్లా కొంతమంది ఉగ్రవాదులను శిక్షిస్తున్నట్టు కనపడటం పాకిస్థాన్‌కు అలవాటే. పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థలు, న్యాయస్థానాలు అకస్మాత్తుగా క్రియాశీలకమై ఉగ్రవాదంపై విరుచుకుపడటం, ఆ తరువాత సదరు నాయకులను, సంస్థలను విడిచిపెట్టేయడం తెలిసిందే. గ్రేలిస్టు నుంచి బయట పడగలిగితే పాకిస్థాన్‌కు భారీగా అప్పులు పుడతాయి, బిలియన్ల డాలర్ల సొమ్ము సమకూరుతుంది. కానీ, పాక్‌ వైఖరి తెలుసుకనుక ఎఫ్‌ఏటీఎఫ్‌ దానిని నమ్మడం లేదు. ఇప్పుడు జూన్‌ కొత్తగడువుగా ముందుకు వచ్చింది. 2003నాటి భారత్‌–పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇకపై చిత్తశుద్ధిగా అమలు చేయడానికి ఆ దేశం ముందుకు రావడం వెనుక కూడా ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆశలే అధికంగా పనిచేశాయని ఓ వాదన. నిజానికి, ఈ ఒప్పందం అమలు జరిగినకంటే ఉల్లంఘనల కాలమే అధికం. ఎల్‌ఓసీ ప్రశాంతంగా ఉండటం కంటే కావల్సిందేమీ లేదు. కానీ, అటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ఉగ్రదాడులతో పాక్‌సైన్యం శాంతియత్నాలకు గండికొట్టడం చూస్తున్నదే. విశ్వాసతీర్మానంలో నెగ్గి అధికారాన్ని సుస్థిరం చేసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ నిజంగానే ఉభయదేశాల మధ్య శాంతికి బాటలు వేస్తే సంతోషించాల్సిందే.

Updated Date - 2021-03-09T07:00:44+05:30 IST