7 రాష్ట్రాల్లో.. ‘అగ్ని’ కీలలు!

ABN , First Publish Date - 2022-06-18T08:44:14+05:30 IST

మిలిటరీ త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ విధానంపై యువత కుతకుతలాడుతోంది.

7 రాష్ట్రాల్లో.. ‘అగ్ని’ కీలలు!

యూపీ, బిహార్‌, హరియాణాల్లో ఉధృతం..

కొత్త సైనిక నియామక విధానంపై జనాగ్రహం

వయోపరిమితి 23 ఏళ్లకు పెంచినా చల్లారని ఆందోళనలు

రైల్వే ఆస్తుల విధ్వంసం.. 340 రైళ్లపై ప్రభావం

234 ట్రైన్లు పూర్తిగా రద్దు... మరో 95 పాక్షికంగా


న్యూఢిల్లీ, జూన్‌ 17: మిలిటరీ త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ విధానంపై యువత కుతకుతలాడుతోంది. పాత విధానంలోనే భర్తీ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారు చేపట్టిన నిరసనలు హింసాత్మక రూపుదాల్చాయి. బిహార్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌.. మొత్తం 7 రాష్ట్రాల్లో  హింసాత్మక నిరసనలు శుక్రవారం తీవ్రమయ్యాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. యువత ఆగ్రహ జ్వాలల్లో రైళ్లు, రైల్వే ఆస్తులు ఆహుతవుతున్నాయి. 200కిపైగా రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఏడు రైళ్ల బోగీలకు నిప్పుబెట్టారు. రోడ్ల బ్లాకేడ్లు కొనసాగుతున్నాయి. పోలీసులతో బాహాబాహీకి దిగుతున్నారు. మిలిటరీ సర్వీసు నాలుగేళ్లకే కుదించడం.. త్వరగా రిటైరైన వారికి పెన్షన్‌ సౌకర్యం లేకపోవడం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశానికి 17.5-21 ఏళ్ల వయస్కులే అర్హులంటూ తెచ్చిన మార్పులపై యువత రగిలిపోతోంది.


నిరసనలు పతాక స్థాయికి చేరడంతో ఈ ఒక్కసారికి వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించినా.. ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు హామీ ఇస్తున్నా ఆందోళనకారులు వినడం లేదు. ప్రతిపక్షాలు కూడా నిరసనలకు పిలుపిస్తుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని ఢిల్లీలోనూ విద్యార్థులు, యువత నిరసన చేపట్టారు.


హరియాణాలో వాహనాలపై రాళ్లు..

సైన్యంలో చేరే యువత హరియాణాలో ఎక్కువ. ఈ రాష్ట్రంలో గురువారం నుంచి విధ్వంసం తీవ్రమైంది. వల్లభ్‌గఢ్‌, జింద్‌, రోహతక్‌లలో వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. టైర్లను తగులబెట్టారు. వల్లభ్‌గఢ్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను ఒకరోజు నిలిపివేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులే. పల్వాల్‌ జిల్లాలో 1,000 మందిపై కేసులు నమోదుచేశారు. నర్వాణాలో ఢిల్లీ-భటిండా ట్రాక్‌పై 3 గంటలపాటు నిరసనకారులు బైఠాయించారు. హిసార్‌లో యువత జాతీయ జెండాలతో మహావీర్‌ స్టేడియంలో గుడిగూడారు.


బిహార్‌లో బీజేపీ నేతలపై దాడులు..

బిహార్‌లో బీజేపీ నేతలనే లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ చంపారన్‌లోని బెటియాలో ఉపముఖ్యమంత్రి రేణుదేవి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ సోదరుడి పెట్రోలు బంకును ధ్వంసం చేశారు. మోతీహారిలో బీజేపీ ఎమ్మెల్యే విన య్‌ బిహారీ కారుపై రాళ్లురువ్వారు.  నవాడాలో గురువారం బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవిపై రాళ్లు రువ్వి గాయపరచిన ఆందోళనకారులు అక్కడి బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుబెట్టారు. బెటియాలో లఖీసరాయ్‌, సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్‌లలో ఒక్కో రైలుకు నిరసనకారులు నిప్పుబెట్టారు. 30 బోగీలను బుగ్గిచేశారు. పట్నా వెలుపల దీదర్‌గంజ్‌ టోల్‌ప్లాజాను, నవాడాలో పోలీసు జీపును తగులబెట్టారు. ఈ నిరసనలు రాజధాని పట్నాకు వ్యాపించలేదు. అయితే మాజీ ఎంపీ పప్పూ యాదవ్‌ వందల మంది మద్దతుదారులతో కలిసి అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.  


యూపీలో రాళ్లవర్షం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రైస్‌ వేపై రాళ్లు, టైర్లు అడ్డుపెట్టి రాకపోకలను ఆపేశారు. ఔవారాణసీ, ఫిరోజాబాద్‌, అమేథీల్లో కూడా నిరసనలు రేగాయి. బస్సులను ధ్వంసం చేశారు. బలియా రైల్వే స్టేషన్‌లో బోగీకి నిప్పుబెట్టారు. స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు. ఇక్కడ బలియా-వారాణసీ మెమూ, బలియా-షాగంజ్‌ రైళ్లను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. రైల్వే గోదాం, స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై ఉన్న ప్రైవేటు దుకాణాలపైనా రాళ్లతో, స్టేషన్‌ బయట బస్సులపైనా దాడిచేశారు. ఢిల్లీలో లెఫ్ట్‌ అనుబంధ ఏఐఎ్‌సఏ, పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు.  


 నిరసనలు ఒడిసాకు కూడా విస్తరించాయి. కటక్‌లో యువకులు రింగ్‌ రోడ్‌ను బ్లాక్‌ చేశారు. కంటోన్మెంట్‌లో హోర్డింగ్స్‌ను నేలకూల్చారు. నిరుడు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, వైద్య పరీక్షలు పూర్తిచేశామని.. ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) రాసేందుకు చూస్తుండగా అగ్నిపథ్‌ను విధానం తెచ్చి తమ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని నిరసనకారులు మండిపడుతున్నారు.


ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 164 రైళ్లు రద్దు..

యువత విధ్వంసానికి దిగడం దేశవ్యాప్తంగా 340 రైళ్లను ప్రభావితం చేసింది. 234 రైళ్లను అధికారులు రద్దుచేశారు. వీటిలో 94 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 140 ప్యాసింజర్‌ రైళ్లు. మరో 95 రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. ఇంకో 11 రైళ్లను దారి మళ్లించారు. బిహార్‌, జార్ఖండ్‌, యూపీలోని కొన్ని ప్రాంతాల పరిధిలోని ఒక్క ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌లోనే 164 రైళ్లు రద్దయ్యాయి. బిహార్‌, తూర్పు యూపీలకు వెళ్లే సర్వీసులను కొన్ని ప్రాంతాల వరకే నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించొద్దని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ యువతకు పిలుపిచ్చారు.

Updated Date - 2022-06-18T08:44:14+05:30 IST