ప్రభుత్వ ఆసుపత్రిలో... ప్రైవేటు దందా

ABN , First Publish Date - 2021-02-28T05:20:09+05:30 IST

సర్వజన ఆసుపత్రిలో మరీ ముఖ్యంగా లేబర్‌ వార్డులో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోగుల వద్ద యథేచ్ఛగా బయటి వ్యక్తులు వచ్చి శాంపిల్స్‌ తీసుకుంటూ సిబ్బందికి కమీషన అందజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో... ప్రైవేటు దందా
రిమ్స్‌లోని లేబర్‌ వార్డు

బ్లడ్‌ శ్యాంపిల్స్‌ తీసుకుని వెళుతున్న ప్రైవేటు వ్యక్తులు

ఆసుపత్రి సిబ్బంది కమిషన్ల కక్కుర్తి

దళారుల చేతుల్లో ద గా పడుతున్న రోగులు


పేద ప్రజలకు వైద్యమందించేందుకు రిమ్స్‌లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. పేరుకు తగ్గట్లే నిత్యం వేల మందికి సేవలందిస్తూ వస్తోంది. అటువంటి ఆసుపత్రిలో రాబందుల రూపంలో కొంత మంది రోగుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా లేబర్‌ వార్డులో ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది. కమిషన కోసం వైద్య సిబ్బందే వీరికి అండదండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కడప(సెవెనరోడ్స్‌), ఫిబ్రవరి 27: నగరానికి చెందిన సూరిబాబు (పేరు మార్చాం) వృత్తి రీత్యా కూలీ. గర్భవతి అయిన తన భార్య హేమవతికి హైబీపీ ఉంది. కూలీ పనిచేసుకునే ఇతను ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బు కట్టలేక తన భార్యను  ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రి సిబ్బంది ఆమెను పరీక్షించి కొన్ని టెస్టులు చేయించమని భర్తకు చెప్పారు. సూరిబాబు సరే అని బయటికి రాగానే ఒక వ్యక్తి వచ్చి ఈ టెస్టులు చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆసుపత్రిలో పరీక్షలన్నీ ఉచితం కదా అని అడిగేలోపే అవతలి వ్యక్తి సూరిబాబుతో వాదనకు దిగాడు. ఇది ఇక్కడ చేయరు, ఇష్టమైతే చేయించుకో, లేదంటే లేదు.. మాకేమైనా పని లేకుండా వచ్చామా అంటూ దురుసుగా ప్రవర్తించాడు. చివరకు అతను డబ్బు, బ్లడ్‌ శ్యాంపిల్‌ తీసుకుని వెళ్లాడు. ఈ విషయమై పిర్యాదు చేస్తే ఎక్కడ వైద్యం సరిగా చేయరోనని భయపడి మిన్నకుండిపోయాడు. ఈ తతంగమంతా ఆసుపత్రి ఆవరణలోనే జరిగింది.

సర్వజన ఆసుపత్రిలో మరీ ముఖ్యంగా లేబర్‌ వార్డులో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోగుల వద్ద యథేచ్ఛగా బయటి వ్యక్తులు వచ్చి శాంపిల్స్‌ తీసుకుంటూ సిబ్బందికి కమీషన  అందజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంతగా బయటి వ్యక్తులు వచ్చి శాంపిల్స్‌ తీసుకుంటున్నా ఎవరు కూడా వారిని నిలువరించడంలేదు. పేదలు, సరిగా అవగాహన లేని వారు ఆసుపత్రిలో జరిగే తతంగంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, ఫిర్యాదు చేస్తే వైద్యం సరిగా అందుతుందో, లేదో అనే భయంతో డబ్బులు సమర్పించుకుంటున్నారు. అన్నీ ఉచితమంటూనే కమిషన్ల కోసం కక్కుర్తి పడి బయటి వ్యక్తులను లోపలికి అనుమతిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

- డాక్టర్‌ ప్రసాద్‌,. రిమ్స్‌ సూపరింటెండెంట్‌

బయటి వ్యక్తులు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నా వరకు కూడా వచ్చాయి. వెంటనే నేను వెళ్లి పేషంట్లను విచారించగా అటువంటిదేమీ లేదన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వైద్యం కోసం వచ్చిన వ్యక్తులు ఎవరికీ ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సదుపాయాలు, పరికరాలు రిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Updated Date - 2021-02-28T05:20:09+05:30 IST